ఫ్రాంచైజీలుగా రాబోతున్న టబు ‘ఖూఫియా’
ఈ మధ్య కాలంలో సీక్వెల్ అనేది కామన్ అయిపోయింది. ఒక సినిమా హిట్ అయిందంటే చాలు దానికి సీక్వెల్ తీసుకొస్తున్నారు. పార్ట్ 1, 2,3 అంటూ ఫ్రాంచైజీలుగా చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఫ్రాంచైజీ అంటే ఒక సినిమా కథలోని పాత్రలు తీసుకొని..ఇంకో కథలా మార్చి..చూపించడమే. దాన్నే మన భాషలో సీక్వెల్ అని అంటాం. గతంలో హాలీవుడ్లో మాత్రమే ఫ్రాంచైజీ మూవీస్ వచ్చేవి.
కానీ ఇప్పుడు ఇండియన్ చిత్రాల్లో కూడా ఫ్రాంచైజీ కల్చర్ వచ్చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీలోనూ సీక్వెల్స్ జోరు నడుస్తోంది. హిట్ మూవీలకు వెంటనే పార్ట్ 2 వచ్చేస్తుంది. తాజాగా మరో చిత్రం కూడా ఫ్రాంచైజీలుగా రావడానికి సిద్ధమైంది. అదే ‘ఖూఫియా’. అలనాటి అందాల తార టబు నటించిన స్పై థ్రిల్లర్ సినిమా ఇది. విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో విడుదలై.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. విశాల్ మేకింగ్, టబు యాక్టింగ్పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.
ఏడాదికో ‘ఖూఫియా’
టబు, అలీ ఫజల్, హాట్ బ్యూటీ వామిగా గబ్బి, ఆశీష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఖుఫియా’. అమర్ భూషణ్ రచించిన 'ఎస్కేప్ టు నో వేర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విశాల్ భరద్వాజ్. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో.. ఫ్రాంచైజీలుగా తీసుకురావాలని భావిస్తున్నాడట దర్శకుడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా విశాల్ భరద్వాజే ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘‘ఖూఫియా’ ఫ్రాంచైజీలుగా తీసుకురావాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలోని కృష్ణ మెహ్రా పాత్రతో ఫ్రాంచైజీ ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై ఏడాదికొక ‘ఖుఫియా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను’అని విశాల్ భరద్వాజ్ చెప్పుకొచ్చాడు. అంటే త్వరలోనే ‘ఖుఫియా 2’ రాబోతుందన్నమాట.
‘ఖూఫియా’ కథేంటి?
కృష్ణ మెహ్రా అలియాస్ కేఎం (టబు), జీవ్ ( ఆశిష్ విద్యార్థి) రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ అధికారులు. ఢిల్లీలోని ‘రా’ ప్రధాన కార్యాలయంలో పనిచేసే రవి మోహన్ (అలీ ఫాజిల్)..అక్కడి సమాచారాన్ని ఉగ్రవాద సంస్థలకు చేరవేస్తున్నట్లు జీవ్ అనుమానిస్తాడు. అతనిపై నిఘా పెట్టాలని కేఎంను ఆదేశిస్తాడు. పై అధికారి ఆదేశంతో కేఎం ‘ఆపరేషన్ బ్రూటస్’పేరుతో రంగంలోకి దిగుతుంది.
ఈ క్రమంలో కేఎం బృందానికి ఎదురైన సమస్యలు ఏంటి? జీవ్ అనుమానించినట్లు రవి నిజంగానే ఉగ్రసంస్థలకు సమాచారం చేరవేశాడా? రవి దేశ ద్రోహ చర్యల వెనుక ఉన్నదెవరు? ఈ మోసంలో రవి భార్య చారు(వామికా గబ్బీ) హస్తం ఉందా? హీనా రెహమాన్(అజ్మేరీ), కేఎంకు ఉన్న సంబంధం ఏంటి? హీనాను హత్య చేసిందెవరు? కేఎం నేపథ్యం ఏంటి? ‘ఆపరేషన్ బ్రూటస్’ ఏ మేరకు సక్సెస్ అయింది అనేది తెలియాలంటే ‘ఖూఫియా’ సినిమా చూడాల్సిందే. ‘రా’ ఎలా పని చేస్తుందో వివరించే కథ ఇది.