కిడ్నీ రాకెట్లో మరో కొత్త కోణం
జాబ్ పేరుతో యువకుడికి ఎర
వైద్య పరీక్షలని నమ్మించి.. కొలంబోలో కిడ్నీ కాజేత
దినేష్ మృతితో మరో యువకుడి ఉదంతం వెలుగులోకి..
బాధితుడు వస్తే వాంగ్మూలం రికార్డు చేస్తాం: సీసీఎస్ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ కేసులో మరో కొత్త కోణం.. జాబ్ ఇంటర్వ్యూ పేరుతో కొలంబో పిలిపించుకుని, వైద్యపరీక్షల పేరుతో కిడ్నీ దోచుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా లింగంపాలెం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, రాణి దంపతుల కుమారుడు మాదాసి కిరణ్ (24) ఇంటర్ పూర్తి చేసి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడు.
ఈ క్రమంలో ఫ్లికర్, టైమ్స్ జాబ్ వెబ్సైట్లను పరిశీలిస్తుండగా.. ఉస్మానియా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ ఉందని యాడ్ కనిపించింది. వారిని సంప్రదించగా పాస్‌పోర్ట్ తీసుకొని చెన్నైకి రావాలని చెప్పారు. గతనెల 23న కిరణ్ చెన్నై వెళ్లి ఆ కంపెనీ ప్రతినిధులను కలిశాడు. జాబ్‌కు సంబంధించి పది రోజుల ట్రైనింగ్ కోసమని అతడిని కొలంబో తీసుకెళ్లారు. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెప్పి అతడిని అదే నెల 29న ఉదయం 7.30కి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెళ్లగానే ఏదో ఇంజక్షన్ ఇవ్వడంతో సృ్పహ కోల్పోయాడు.
మధ్యాహ్నం 12 గంటలకు స్పృహలోకి వచ్చిన కిరణ్ తనకు ఏం జరిగిందని అడగ్గా.. బాత్రూంలో జారిపడ్డావని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగానికి సెలక్ట్ అయ్యావని, టీఏ, డీఏలతో కలిపి నెలకు రూ.25 వేల జీతం వస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో జాబ్ చేయాల్సి ఉంటుందని, నీ ఈ-మెయిల్‌కు త్వరలో అపాయింట్మెంట్ లెటర్ పంపిస్తామని చెప్పి రూ.2 వేల డాలర్లు ఇచ్చి అతడిని స్వగ్రామానికి పంపించారు.
అపాయింట్‌మెంట్‌లెటర్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్‌కు... కిడ్నీ అమ్మేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడిన కొత్తగూడెంవాసి దినేష్ ఉదంతం పేపర్లలో కనిపించింది. దినేష్ ఫొటోను గుర్తించిన కిరణ్.. అతను కూడా తనతో పాటు కొలంబో రూమ్‌లో కనిపించాడని ‘న్యూస్‌లైన్’కు చెప్పాడు. ఆ రూమ్‌లో తమతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన పది మంది యువకులు ఉన్నారని, అయితే తనలాగే వారు కూడా జాబ్ కోసం వచ్చారని భావించానని కిరణ్ తెలిపాడు.
దినేష్ ఉదంతం తెలిసిన వెంటనే అనుమానంతో తాను వైద్యుడికి చూపించుకోగా.. తన కిడ్నీ కూడా కొలంబోలో కాజేసినట్టు బయటపడిందని కిరణ్ కన్నీరుపెట్టుకున్నాడు. బాధితుడు ముందుకొస్తే అతని స్టేట్మెంట్ రికార్డు చేస్తామని సీసీఎస్ పోలీసులన్నారు. ఇదిలా ఉండగా, దినేష్ కేసులో గుంటూరుకు చెందిన కిషోర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు ఆచూకీ కూడా పోలీసులకు లభించింది. వీరిచ్చిన సమాచారంతో ఓ పోలీసు బృందం చెన్నైకి వెళ్లింది. ప్రధాన నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.