ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
వికారాబాద్ రూరల్: ఎస్టీలకు ప్రభుత్వం 12 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, 6 శాతం రిజర్వేషన్‌తో ఎస్టీలు నష్టపోతున్నారని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టి.కిషన్‌సింగ్ అన్నారు. స్థానిక అతిథిగృహంలో శనివారం బంజారా భేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చడం సంతోషకరమన్నారు.
బంజారాల కోసం హైదరాబాద్‌లో ఎకర స్థలంలో భవనం నిర్మించడం, సేవాలాల్ మహరాజ్ జన్మదిన వేడుకలకు ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వడం కూడా సంతోషించదగ్గ విషయమన్నారు. కానీ ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఎస్టీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చే నెలలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటిస్తుందని, అదే 6 శాతం రిజర్వేషన్వల్ల ఎస్టీ నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 12 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తరువాత ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
500 కుటుంబాలు ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించాలన్నారు. బంజారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశంతో జూలై 5న పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సభకు పెద్దఎత్తున బంజారాలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు ధనంజయ్, ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ పవార్, జిల్లా అధ్యక్షుడు రాఘవన్‌నాయక్, నాయకులు కిషన్‌నాయక్, విఠల్‌నాయక్, హరినాయక్, తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.