పెళ్లయిన ఆరు నెలలకే..
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ఆత్మహత్య
కొన్నె(బచ్చన్నపేట) : పెళ్లయిన ఆర్నెల్ల్లకే ఇద్దరు మహిళలు తనువు చాలించారు. బచ్చన్నపేట మండలం కొన్నెలో ఒకరు.. ములుగు మండలంలోని చిన్నగుంటూరుపల్లిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకా రం.. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వసంత(20)కు కొన్నెకు చెందిన చీర వేణుతో ఆర్నెళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో వసంత బుధవారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు పత్తి సేకరించేందుకు వెళ్లింది. అక్కడే పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. వసంత ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా మృతురాలి అత్త, మామ, భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఎస్సై షాదుల్లాబాబా జనగామ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు.
చిన్నగుంటూరుపల్లిలో..
ములుగు : నెల్లూరు జిల్లాకు చెందిన అజ్మీరా దేవి(22) మండలంలోని చిన్నగుంటూరుపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా అఖిల్‌ను 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. తరచూ గొడవలు జరగడంతో దేవి బుధవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.