ఎన్నారై పాలసీ రావాలి
కొండవీటి సురేష్, ఆర్మూర్: ఉపాధి వేటలో కుటుంబ సభ్యులను విడిచి గల్ఫ్‌తో పాటు ఇతర దేశాలకు వెళ్లి కష్టపడుతున్న ప్రవాస భారతీయులకు మేమున్నామనే భరోసా కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీని రూపొందించి అమలు చేయాలని వలసదారుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు కోరారు. గల్ఫ్ బాధితుల పక్షాన దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్న కోటపాటి నర్సింహ నాయుడు ఎన్ఆర్ఐ పాలసీ ఆవశ్యకతపై, అందులో ఏ అంశాలు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 20 – 25 లక్షల మంది వివిధ దేశాలకు వలస వెళ్లినట్లు వివిధ సంస్థలు సర్వేల్లో అంచనా వేశాయి. వీరిలో అత్యధికంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమాన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్‌తో పాటు మలేషియా, సింగపూర్, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు సైతం ఉపాధి కోసం వలస వెళ్లారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు అత్యధికంగా భవన నిర్మాణ కార్మికులుగా, ఇళ్లలో పని వారిగా చేరారు. వీరికి ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవడానికి ఎవరిని సంప్రదించాలో కూడా కనీస అవగాహన లేని దుస్థితిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి విదేశాల్లో.. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ప్రతీ ఎంబసీలో ఒక తెలుగు మాట్లాడగలిగే అధికారిని నియమించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేదా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతీ దేశంలో ఒక తెలుగు అధికారిని నియమించాలి. గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో అక్రమ నివాసం ఉంటున్న వేలాది మందిని ఎలాంటి జరిమానాలూ, జైలు శిక్షలు లేకుండా స్వస్థలాలకు వెళ్లిపోవడానికి ఆ దేశాల ప్రభుత్వాలు అవకాశమిచ్చిన సందర్భాలలో వారిని ఆదుకొని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
ప్రవాసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా, సంబంధిత ఎన్ఆర్ఐ విభాగం మంత్రికి జవాబుదారీగా ఉండే విధంగా 25 మంది సభ్యులతో కూడిన తెలంగాణ ప్రవాసీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ప్రతి గల్ఫ్ దేశానికి ఒక డైరెక్టర్, ఎనిమిది అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఒక్కొక్క సభ్యుడు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో తెలంగాణ ప్రవాసీల నుంచి నలుగురు, విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రవాసీలు, సామాజిక సంస్థల నుంచి నలుగురు సభ్యులతో కేరళ మాదిరి నాన్ రెసిడెంట్స్ తెలంగాణనైట్స్ వెల్ఫేర్ యాక్ట్ ద్వారా ప్రవాసీ తెలంగాణీయుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
ప్రతీ కార్మికుడిని సభ్యుడిగా చేర్చుకోవాలి
ప్రతి వలస కార్మికుడిని ప్రవాసీ సంక్షేమ బోర్డులో సభ్యుడిగా చేర్చుకొని వారి నుంచి ప్రతీ సంవత్సరం వారి స్థాయిని బట్టి కొంత మొత్తాన్ని వసూలు చేయాలి. ఈ నిధికి సంక్షేమ బోర్డు ద్వారా అంతే మొత్తాన్ని జమ చేయాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి సంక్షేమ బోర్డు పరిధిలో సేవింగ్స్ ఖాతా తెరిచి వారు తిరిగి వచ్చిన తర్వాత వారికి చెల్లింపులు జరిపి వారిని ఇక్కడే స్థిరపడే విధంగా ఉపాధి అవకాశాలలో ఆ నిధిని ఉపయోగించుకోవడం లేదా వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత వారు కూడబెట్టుకున్న స్థాయిలో పింఛన్ వచ్చే విధంగా చూడాలి. విదేశాలకు వెళ్లి ఏజెంట్ల కారణంగా లేదా అక్కడి యాజమాన్యాల కారణంగా మోసపోయి.. నష్టపోయి తిరిగివచ్చిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలను ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారిని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని బోర్డులో సభ్యత్వం తీసుకొనే విధంగా ప్రోత్స హించాలి. వారికి తగిన నైపుణ్య, శిక్షణ ఇవ్వడంతో పాటు వారు వెళ్లే దేశం, కంపెనీ, నివాసం ఉండే అడ్రస్‌తో సహా సమాచారం సేకరించాలి. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) శిక్షణ కేంద్రాలను ప్రతీ డివిజన్, నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేయాలి.
ప్రవాసీ బీమా..
రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు బీమా తరహాలో వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాసీలకు వర్తించే విధంగా ఐదు లక్షల రూపాయల ప్రవాసీ బీమా పాలసీని ప్రవేశపెట్టాలి. సాంకేతిక కారణాలతో బీమా సౌకర్యం పొందలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎక్స్ గ్రేషియా అందించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది లక్షల రూపాయల ప్రమాద బీమా ‘ప్రవాసీ భారతీయ బీమా యోజన’ను కార్మికులందరికీ చేయించాలి. బీమా పాలసీని ఆన్ లైన్లో రెన్యూవల్ చేయించుకోవడానికి రాష్ట్రంలోని కొన్ని ‘మీ సేవా’ కేంద్రాలను ప్రత్యేకంగా కేటాయించాలి. విదేశాల్లో ఆత్మహత్య చేసుకున్న, సహజంగా, ప్రమాదవశాత్తు తదితర కారణాలతో మరణించిన వారి మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు తెప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అందుకు ప్రతీ దేశంలో ఒక అధికారి లేదా స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.వివిధ కారణాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న వారికిన్యాయ సహాయం అందేవిధంగా ఎంబసీతోఅనుసంధానం చేయాలి.
తెలంగాణ ప్రవాసీ దివస్..
ప్రవాసీ భారతీయ దివస్ తరహాలో తెలంగాణ ప్రవాసీ దివస్ నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన ప్రవాసీలకు ప్రతీ సంవత్సరం ఒక సదస్సు ఏర్పాటు చేసి అన్ని దేశాలలోని సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, స్వచ్ఛంద సంస్థల సభ్యులను ఆహ్వానించి రెండు రోజులకు తక్కువ కాకుండా సమావేశాలు నిర్వహించాలి. తద్వారా వారి భావాలను, సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులను ఆహ్వానించవచ్చు, ప్రవాసీలు సత్కరించవచ్చు.
మోసకారి ఏజెంట్లపైచర్యలు తీసుకోవాలి
తప్పుడు వీసాలతో మోసం చేస్తున్న ఏజెంట్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. లైసెన్స్ కలిగిన కొందరు ఏజెంట్లు కూడా విజిట్ వీసాలతో మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కొందరు విదేశాలకు వెళ్లాక అక్కడ ఏజెంట్లుగా అవతారమెత్తి వీసాలు పంపిస్తున్నారు. ఇలాంటి వీసాలపై వెళ్లినవారు రెండు, మూడు నెలలకే తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి.
స్థానిక ఉపాధిపై దృష్టి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చేవారు స్వగ్రామాలలో స్థిరపడటానికి ప్రయత్నించాలి. విజిట్ వీసాపై వెళ్లిన వారు, కల్లివెళ్లిగా ఉన్నవారు, తక్కువ జీతాలతో ఇబ్బందిపడేవారు స్వరాష్ట్రానికి రావడం మంచిది. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఎందరో ఉపాధి పొందుతున్నారు. మన ప్రాంతం వారు ఇక్కడే ఉపాధి చూసుకోవచ్చు.