kothacheruvu
-
పవన్ ఫ్లాప్ షో.. 5 నిమిషాల్లోనే ముగిసిన పర్యటన
సాక్షి, పుట్టపర్తి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఫ్లాప్ షోను తలపించింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ఆయన...రోడ్డుమార్గంలో కొత్తచెరువుకు వచ్చారు. ఓ కుటుంబాన్ని పరామర్శించి 5 నిముషాల్లో పర్యటన ముగించుకుని ధర్మవరం వెళ్లిపోయారు. పరామర్శలో ట్విస్ట్ పవన్ తొలుత కొత్తచెరువుకు చెందిన రైతు సమిటి రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శిస్తారని ఆ పార్టీ స్థానిక నాయకులు రైతు కుటుంబానికి రెండు రోజుల కిందట సమాచారం ఇచ్చారు. అయితే రామకృష్ణ కుటుంబానికి వైఎస్సార్ రైతు బీమా సొమ్ము రూ.7 లక్షలను ప్రభుత్వం అందించిందని మంగళవారం ‘సాక్షి’ పత్రికలో ప్రచురణ కావటంతో పవన్ రూటు మార్చారు. నల్లమాడ మండలం వంకరకుంట గ్రామానికి చెందిన కౌలు రైతు సాకే రామకృష్ణ భార్య సుజాతను పవన్ పరామర్శించారు. అది కూడా వంకరకుంట గ్రామానికి వెళ్లకుండా రైతు కుటుంబాన్నే కొత్తచెరువుకు రప్పించుకున్నారు. చదవండి: (బయటపడ్డ పవన్ కల్యాణ్ రాజకీయ డ్రామాలు) -
ఆర్ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
సాక్షి, పుట్టపర్తి: కొత్తచెరువు పట్టణంలోని షిర్డిసాయి క్లినిక్‌లో శుక్రవారం దారుణం జరిగింది. జ్వరానికి చికిత్స కోసం వచ్చిన ఓ బాలికపై ఆర్ఎంపీ సహాయకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. షిర్డిసాయి క్లినిక్‌ను ఆర్ఎంపీ ఆదినారాయణ నిర్వహిస్తున్నాడు. కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికకు జ్వరంగా ఉండటంతో శుక్రవారం తల్లిదండ్రులు క్లినిక్‌కు తీసుకొచ్చారు. ఆర్ఎంపీ ఆదినారాయణకు చూపించారు. అతను పరీక్షించిన తర్వాత ఇంజక్షన్ వేయాలని సహాయకుడు జయరామ్‌కు సూచించాడు. జయరామ్ బాలికను ఇంజక్షన్ గదిలోకి తీసుకెళ్లాడు. తల్లిని గది బయటకు పంపించాడు. తర్వాత దుస్తులు తొలగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు జయరామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పుట్టపర్తి రూరల్ సీఐ నరసింహారావు, కొత్తచెరువు ఎస్ఐ లింగన్న తెలిపారు. చదవండి: (విధుల్లో ఉన్న వలంటీర్‌పై టీడీపీ నేత దాడి) ఆగడాలకు అడ్డేదీ? షిర్డిసాయి క్లినిక్‌లో గతంలోనూ ఆగడాలు జరిగాయి. అధిక డోస్ మందులు ఇవ్వడంతో గతంలో ముగ్గురు మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఎంపీ సహాయకులు ముగ్గురు ఉండగా.. ఏ ఒక్కరికీ తగిన అర్హతలు లేవు. క్లినిక్‌లో ఏం జరిగినా డబ్బుతో మేనేజ్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఘటన జరిగిన షిర్డిసాయి క్లినిక్ -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య
కొత్తచెరువు (పుట్టపర్తి) : కొత్తచెరువు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సూర్యనారాయణ భార్య వరలక్ష్మీ(25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురానికి చెందిన వరలక్ష్మీ, సూర్యనారాయణ వివాహం ఐదేళ్ల కిందట కాగా, ఆమెకు కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోందన్నారు. అయితే ఇంటికి ఆలస్యంగా వచ్చే భర్తతో తరచూ ఆమె వాగ్వాదానికి దిగేదన్నారు. శనివారం రాత్రి 9 గంటల వరకు పోలీస్‌స్టేషన్ ఆవరణలో షటిల్ ఆడిన సూర్యనారాయణ ఆ తరువాత విధి నిర్వహణలో భాగంగా ఇరగంపల్లిలో జూదరులను పట్టుకునేందుకు వెళ్లాడని చెప్పారు. భర్త ఎంతసేపటికీ రాకపోవంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటిలో ఉరేసుకుని తనువు చాలించిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పులకించిన భక్తజనం
కొత్తచెరువు : వేలాది మంది భక్తుల నడుమ సంగమేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్తచెరువులోని బుక్కపట్నం రహదారిలో నిర్వహించిన ఈ ఉత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయ ధర్మకర్త మనోహర్ ఇంటి నుంచి స్వామి వారికి అలంకరణ వస్తువులు, జెండాను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. శివపార్వతులకు పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణ మధ్య స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంలోకి తీసుకెళ్లారు. అనంతరం భక్తులు శివ నామస్మరణ చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్టు
కొత్తచెరువు (పుట్టపర్తి) : పుట్టపర్తి మండలం వెంగలమ్మచెరువుకు చెందిన పాలగిరి, జగరాజుపల్లికి చెందిన దుమ్మలాంజనేయులు, చీమల నరసింహులు అనే గంజాయి విక్రేతలను శుక్రవారం అరెస్టు చేసినట్లు కొత్తచెరువు సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖరరెడ్డి విలేకరులకు తెలిపారు. వారి నుంచి 16 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పైన పేర్కొన్న ముగ్గురు నిందితులు తూర్పు గోదావరి జిల్లా తుని నుంచి గంజాయిని తీసుకువచ్చి పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో గంజాయిని అమ్మేవారని తెలిపారు. శుక్రవారం వారు గంజాయిని తీసుకొస్తున్నారనే పక్కాస మాచారంతో సత్యసాయి ప్రశాంతి రైల్వేస్టేషన్ వద్ద కాపు కాసి, అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను కోర్టులో హాజరుపరచినట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ వెంకీ, కానిస్టేబుళ్లు నాగేశ్వరరెడ్డి, నాగేష్, చంద్ర, భరత్‌రెడ్డి, రామంజి, వన్నప్ప పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
కొత్తచెరువు : కొత్తచెరువు సమీపంలోని గండి వద్ద రైలు నుంచి జారి పడి ఓ యువకుడు మృతి చెందాడు. కొత్తచెరువు ఎమ్మార్సీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న మండల కేంద్రానికి చెందిన నాగార్జున(33)గా గుర్తించారు. అనంతపురం నుంచి శనివారం రాత్రి కొత్తచెరువుకు రైలులో వస్తూ ప్రమాదవశాత్తు జారిపడినట్లు పోలీసులు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయమే గొర్రెల కాపరులు గుర్తించి తమకు సమాచారం ఇచ్చారని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
మాజీ సర్పంచ్ అరెస్టు
కొత్తచెరువు (పుట్టపర్తి) : అక్రమంగా విద్యుత్ వాడుకున్నారని ఏడాది కిందట నమోదైన కేసులో నిందితుడైన కొత్తచెరువు మాజీ సర్పంచి హరినాథ్చౌదరిని జిల్లా యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బుక్కపట్నం రహదారిలో ఉన్న వాటర్‌ప్లాంట్‌కు ఆయన అక్రమ విద్యుత్ వాడుతున్నారని అప్పట్లో విద్యుత్ అధికారులు రూ.3 లక్షలు పైబడి జరిమానా విధించారు. అప్పటి నుంచి జరిమానా చెల్లించకపోవడంతో వారు ఆయనకు నోటీసులు జారీచేస్తూ వచ్చారు. చివరకు అరెస్టు వారంట్ జారీ కావడంతో శుక్రవారం జిల్లా యాంటీ పవర్ టెప్తు స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విషయంపై ట్రాన్స్‌కో ఏఈ శీననాయక్ను వివరణ కోరగా విద్యుత్ చౌర్యం ఘటనలో జరిమానా చెల్లించకపోతే అరెస్టు తప్పదన్నారు. -
జాడ లేని పిట్ట
సందర్భం : నేడు పోస్టల్ దినోత్సవం కొత్తచెరువు : ఇంటి ముందు కూర్చున్న ముసలి తల్లిదండ్రులకు దూరంగా ఉన్న కొడుకు యోగక్షేమాలు మోసుకొచ్చిన, బంధువులు, స్నేహితులు మధ్య దూరాల దారాన్ని తెంచేసి వారి అనుబంధాన్ని పటిష్టం చేసిన, ప్రేయసి, ప్రియుడి విరహాన్ని అక్షరరూపంలో ఆవిష్కరించిన ఉత్తరాలు నేడు కనుమరుగవుతున్నాయి. సమాచార రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని ఆప్తబంధువు క్రమంగా అందరికీ దూరమవుతోంది. ఒకప్పుడు తొంబై ఆమడల దూరాన్ని కూడా సునాయాసంగా అధిగమించగలిగిన ఆ తోకలేని పిట్ట.. నేడు సెల్ఫోన్లు, కంప్యూటర్ రాకతో ఉనికి కోల్పోయింది. నేటి తరం ఫేస్బుక్, వ్యాట్సప్లలో క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉత్తరాలని మరచిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాలు రాసే వారులేక పోస్టల్ డబ్బాలు తుప్పుపట్టి దర్శనం ఇస్తున్నాయి. ఆదివారం పోస్టల్ దినోత్సవ కార్యక్రమం నిర్వంచుకునేందుకు తపాలా సిబ్బంది సిద్ధమయ్యారు.