జాడ లేని పిట్ట
సందర్భం : నేడు పోస్టల్ దినోత్సవం
కొత్తచెరువు : ఇంటి ముందు కూర్చున్న ముసలి తల్లిదండ్రులకు దూరంగా ఉన్న కొడుకు యోగక్షేమాలు మోసుకొచ్చిన, బంధువులు, స్నేహితులు మధ్య దూరాల దారాన్ని తెంచేసి వారి అనుబంధాన్ని పటిష్టం చేసిన, ప్రేయసి, ప్రియుడి విరహాన్ని అక్షరరూపంలో ఆవిష్కరించిన ఉత్తరాలు నేడు కనుమరుగవుతున్నాయి. సమాచార రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని ఆప్తబంధువు క్రమంగా అందరికీ దూరమవుతోంది.
ఒకప్పుడు తొంబై ఆమడల దూరాన్ని కూడా సునాయాసంగా అధిగమించగలిగిన ఆ తోకలేని పిట్ట.. నేడు సెల్‌ఫోన్లు, కంప్యూటర్ రాకతో ఉనికి కోల్పోయింది. నేటి తరం ఫేస్‌బుక్, వ్యాట్సప్‌లలో క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉత్తరాలని మరచిపోయింది. ఈ నేపథ్యంలో ఉత్తరాలు రాసే వారులేక పోస్టల్ డబ్బాలు తుప్పుపట్టి దర్శనం ఇస్తున్నాయి. ఆదివారం పోస్టల్ దినోత్సవ కార్యక్రమం నిర్వంచుకునేందుకు తపాలా సిబ్బంది సిద్ధమయ్యారు.