విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
లేకుంటే ట్రాన్స్కో ఏఈ కార్యాలయాన్ని ముట్టడిస్తా
అధికారులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హెచ్చరిక
వాడపల్లి (ఆత్రేయపురం) : రైతులు ట్రాన్స్కో ద్వారా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించకపోతే ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తానని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు. వాడపల్లి గ్రామంలో తమ దృష్టికి వచ్చిన విద్యుత్ సమస్యలపై ట్రాన్స్కో ఏఈ కృష్ణమూర్తిని నిలదీశారు. బొమ్మూరు నుంచి రావాల్సిన విద్యుత్ సరఫరా అమలాపురం నుంచి రావడం ద్వారా లోఓల్టేజ్ సమస్యతో రైతుల పంట పొలాల్లో మోటార్లు తిరగడం లేదని ఆయన సంబంధిత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాత విధానం ప్రకారం బొమ్మూరు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సబ్బిడీపై సోలార్ యంత్రాలను అందిస్తామని రైతుల నుంచి రూ.50 వేల చొప్పున డీడీలు తీయించారని ఇప్పటికే సోలార్ మోటార్లు అందకపోవడంతో ఏఈని నిలదీశారు.
ట్రాన్స్కో అధికార పార్టీ నేతలకు తలొగ్గి వ్యవహరిస్తున్నారని, దీనిపై పోరాటం చేస్తానని హెచ్చరించారు. కడియపులంకలో ఉన్న నర్సరీలకు విద్యుత్ సరఫరా అందిస్తుండగా ఆలమూరు మండలంలో నర్సరీలకు నిర్ణీత సమయ వేళలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కరెంట్ కోత విధించడంపై జగ్గిరెడ్డి వండిపడ్డారు. పేరవరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సక్రమంగా సాగునీరు సరఫరా సాగడం లేదన్నారు. మోటార్లు పాడై గొట్టాలకు రంధ్రాలు ఏర్పాడి నీరు వృథా పోతున్నా ఆ శాఖ అధికారులకు పట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం సభ్యులు చిలువూరి నాగరామసత్యనారాయణరాజు, పోచిరాజు బాబురావు, సర్పంచ్ కరిపోతు విమల పల్లయ్య పాల్గొన్నారు.