krishna leaders
-
'రైతుబజార్లో స్టాళ్లు అమ్ముకుంటున్న ఎమ్మెల్యే గద్దె'
కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నిన్నటికి నిన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో మండిపడితే.. ఇప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌పై మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. పటమట రైతుబజార్లో స్టాళ్లను గద్దె రామ్మోహన్ టోకున విక్రయిస్తున్నారని, ఒక్కో స్టాల్‌కు 2 లక్షల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని యలమంచిలి రవి ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి కొంతమంది నేతలు తనపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. గద్దె రామ్మోహన్ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి వద్దే పంచాయితీ పెడతానని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి హెచ్చరించారు. -
కృష్ణాజిల్లాలో కమలం-సైకిల్ పొత్తు చిత్తు
టీడీపీలో పొత్తు చిచ్చులు తెచ్చిపెడుతోంది. పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కైకలూరు నియోజకవర్గాలను పొత్తులో భాగంగా కమలదళానికి చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి బీజేపీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో టీడీపీ నాయకులు ఈ స్థానం విషయమై భగ్గుమంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ముస్లిం మైనారిటీలకు కేటాయించాలి తప్ప బీజేపీకి పొత్తులో వదలకూడదని డిమాండ్ చేస్తున్నారు. కైకలూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని కూడా అక్కడి నేతలు అంగీకరించడంలేదు. దీంతో ఇరుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఏమాత్రం సత్ఫలితాలు ఇస్తుందన్నది అనుమానంగానే మారింది.