నాడు బంగారు పతకం..నేడు చీపురు
కోల్‌కతా: అతను 1987లో ఆల్ ఇండియా ఇన్విటేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నవాడు. మరిపుడు తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తన ఇద్దరు బిడ్డల్ని చదివించుకోవడం కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. చివరికి హౌరా మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. 'నా సోదరుడు టీబీతో బాధపడుతున్నాడు. అతని చికిత్సకోసం డబ్బుల్లేవు. కనీసం తినడానికి తిండి కూడా లేదు' అని అంటున్న ఈ మాజీ బాక్సర్ మాటలు వింటే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు.
వివరాల్లోకి వెళితే హౌరాకు చెందిన క్రిష్ణ రౌత్ 15ఏళ్ల వయసులో బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇపుడు 43 ఏళ్ల వయసులో రోజుకు 200 రూపాయల కోసం మున్సిపల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మురికివాడలో పూరిగుడిసెలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అతనికి బాక్సింగ్ అంటే ప్రాణం. అందుకే ఇప్పటికీ దాదాపు నలభైయాభై మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. రోజుకు కనీసం రెండు గంటలువారి కోసం కేటాయిస్తాడు. ప్రభుత్వం సాయం అందిస్తే కామన్ వెల్త్ క్రీడల్లోనూ, ఒలింపిక్స్ లోనూ సత్తా చాటుతామంటున్నాడు. మరోవైపు అతని దగ్గర శిక్షణ తీసుకున్న చాలామంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించారు.
'నేను బంగారు పతకాన్ని గెలుచుకున్నపుడు చాలామంది చాలా వాగ్దానాలు చేశారు. కానీ ఏవీ అమలుకు నోచుకోలేదు. ఇది నన్ను చాలా బాధించింది. నన్ను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎపుడూ కలవడానికి ప్రయత్నించలేదు. ఎలాకలుస్తాను..వారి చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. కనీసం మేయర్‌ను కూడా నేను కలవలేకపోయాను. తనకు శాశ్వతమైన జీవనభృతి కల్పిస్తే తన పిల్లల్ని బాగా చదివించుకుంటా' అని అంటున్నారు ఈ మాజీ ఛాంపియన్. అయితే ఈ విషయం మీడియాలో బాగా ప్రచారం కావడంతో రెజ్జింగ్ లెజెండ్, ఒలింపిక్స్ పతకాల విజేత సుశీల్ కుమార్ స్పందించారు. తను సీఎం మమతతో మాట్లాడి కృష్ణకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తానన్నారు. మమత దీదీకి క్రీడలన్నా, క్రీడాకారులన్నా చాలా అభిమానమని, ఆమె రైల్వే మంత్రిగా ఉన్నపుడు కూడా చాలామందికి సహాయం చేశారని తెలిపారు. ఇలాంటి క్రీడాకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.