krishna river illegal constructions
-
కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆ నిర్మాణాల యజమానులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు అందని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
నీళ్లు నమిలిన మంత్రి దేవినేని
సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో, కరకట్ట (గట్టు) లోపల అక్రమ నిర్మాణాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీళ్లు నమిలారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ సమాధానం దాటవేశారు. ఆక్రమణదారులకు తక్షణం నోటీసులు జారీ చేసి.. వాటిని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నివేదిక కూడా సమర్పించాలని గతంలో ఆయన డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేయగా.. జవాబు చెప్పకుండా విలేకరుల సమావేశం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, 2014 డిసెంబర్ 31న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా నదిలో పరిశీలనకు బోటులో వెళ్లి.. నదికి ఇరువైపులా కరకట్టల లోపల ఆక్రమణలు ఉన్నాయని, చివరకు కృష్ణమ్మను కూడా వదల్లేదని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని మీడియా ఎదుట తారస్థాయిలో ఏకరువు పెట్టారు. ఆ మరుసటి రోజు (2015 జనవరి 1న) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కృష్ణా నదిలో ఆక్రమణలు దారుణమని, కాంగ్రెస్ వాళ్లు దేన్నీ వదిలిపెట్టరని, ఆక్రమణదారులను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. తర్వాత ఆయనే ఉండవల్లిలోని కృష్ణానది ఒడ్డున ఉన్న లింగమనేని ఎస్టేట్‌లో మకాం పెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది కరకట్ట లోపలవున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై మంగళవారం విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు 57 మందికి నోటీసులు జారీ చేసింది.