సకల వ్యవస్థలూ పతనమయ్యాయి!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి
మనసులో మాట
చంద్రబాబునాయుడు నిజంగా రాజనీతిజ్ఞతను ప్రదర్శించుకోవాలంటే ఫిరాంపుదారుల చేత రాజీనామా చేయించాలి. తెలుగుదేశం పార్టీపై అభిమానంతో చేరుతున్నట్లయితే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆయన చెప్పాలి. స్పీకర్ల వ్యవస్థ అని కాదు. మొత్తంగా రాజకీయ వ్యవస్థే ప్రమాణాలు కోల్పోతోంది.
స్పీకర్ల వ్యవస్థ పతనం మొత్తం రాజకీయ వ్యవస్థ పతనంలో భాగంగానే చూడాలని ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి అన్నారు. మొత్తం వ్యవస్థే తన ప్రమాణాలు కోల్పోతోందని. కేవలం హైదరాబాదుకూ, ఏపీకే పరిమితం కాకుండా. ఢిల్లీలోనూ ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ అంత ప్రజాస్వామికవాదిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని, సభాపతి విధుల్లో తానెన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌కు దూరం కావడం బాధాకరమంటున్న మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ‘మనసులో మాట’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
మీ బాల్యం ఎలా సాగింది?
పాఠశాల చదువు హైదరాబాద్‌లోనే జరిగింది. చిన్నప్పటినుంచి నేటివరకు రెండు ప్రపంచాల్లో బతుకుతూ వస్తున్నాను. ఒకవైపు నగరజీవితం, మరోవైపు పల్లె జీవితం.
మీ కుటుంబ వ్యవహారాలు, వివాహ జీవితం?
నా లవ్ స్టోరీ నా భార్య పుట్టిన క్షణం నుంచే స్టార్ట్ అయింది. మేనరికం మాది. నా భార్యపేరు పద్మజ. ఆమె పుట్టిన రెండో నిమిషంలోనే నీ భర్త సురేష్ రెడ్డి అని చెప్పేశా రట. ఇంకేముంది.. డిక్లేర్ అయింది. అలా చిన్నప్పుడే లవ్‌స్టోరీ మొదలైపోయింది.
రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
మా నాన్న, తాత కూడా రాజకీయాల్లో ఉండేవారు. తాతయ్య చౌటుపల్లి హనుమంతరెడ్డి స్వాతంత్ర సమరయోధులు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఏకీకరణ ప్రకటనను జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా నిజామాబాద్‌లోనే ప్రకటించారు. తాత జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, నాన్న సమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ వారసత్వంలో భాగంగా 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.
స్పీకరుగా ఉన్నప్పుడు మీకు సంతృప్తి కలిగించిన సన్నివేశం ఏది?
ఒక్కమాటలో చెప్పాలంటే శాసనసభకు విజిబిలిటీ తీసుకొచ్చాను. గ్రామీణుల నుంచి అమెరికాలో ఉండేవారి వరకూ శాసనసభ వ్యవహారాలను చూడాలి అనే ఆసక్తి కలిగించాను. సభలో చర్చ జరగాలి. డిబేట్ కావచ్చు.. అల్లరి కావచ్చు.. ఏదైనా కానీ.. హౌస్‌లో ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలి. దాంతో అప్పుడ ప్పుడూ డిబేట్‌తో పరిష్కారాలు వస్తాయి. అల్లరితో కూడా పరిష్కారాలు వస్తాయి.
వైఎస్సార్, చంద్రబాబుపై మీ అభిప్రాయం?
వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా మాట్లాడి ఎక్కువ సమయం తన పార్టీ సభ్యులకు ఇచ్చేవారు. బాబు ఎక్కువ సమయం ఆయన మాట్లాడి, తర్వాత మిగ తావారికి ఇచ్చేవారు.
స్పీకర్ల స్వతంత్రతపై మీ అనుభవం?
అయిదేళ్లు సభాపతిగా పనిచేశాను. ఈ మొత్తం కాలంలో వైఎస్సార్ మూడుసార్లు మాత్రమే నా వద్దకొచ్చారు. ‘‘సభ గురించి కాదు. సభలో ఈ కార్యక్రమాలు జరుపు కుంటాం అధ్యక్షా అనుమతి ఇవ్వండి’’ అని అడగడానికి వచ్చారు. మరెన్నడూ కూడా ఆయన నా విధుల్లో జోక్యం చేసుకోలేదు. ఒకసారి జలయజ్ఞంపై ప్రదర్శన, ఇంకోసారి శాసనసభ 50 ఏళ్ల ఉత్సవాలు జరుపుకోవడం మీదా, అంతకుముందు రాష్ట్రపతిని శాసనసభకు మొదటిసారి ఆహ్వానించడానికి సంబంధించి ఈ మూడుసార్లు మాత్రమే వైఎస్ నాతో నేరుగా సంప్రదించారు. ఆయన నిజమైన ప్రజాస్వామికవాది.
పార్టీనే విలీనం చేసుకుంటున్నా, డబ్బులిచ్చి కొనుక్కున్నా స్పీకర్లు స్పందించడం లేదు?
ఒక ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరి మంత్రి అయ్యాడు. అది కచ్చితంగా కేసే అవుతుంది. దానిగురించి ఆలోచించాల్సిన పనే లేదు. పార్టీనే విలీనం చేశారంటే కచ్చితంగా కేసుపెట్టాల్సిన విషయం.
స్పీకర్ల వ్యవస్థ ప్రమాణాలు ఏమవుతున్నాయి?
ఇదంతా కూడా ఒక చిన్న ప్రతిఫలనం. స్పీకర్ల వ్యవస్థ అని కాదు. మొత్తంగా రాజకీయ వ్యవస్థే ప్రమాణాలు కోల్పోతోంది. ఇది కేవలం హైదరాబాదుకే పరిమితం కాదు. ఢిల్లీలోనూ ఇదే జరుగుతోంది. ఢిల్లీలోనూ ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరొక పార్టీలో చేరాడు. అక్కడా చర్యలు లేవు.హైదరాబాదుకు ఆదర్శం ఢిల్లీ. ఢిల్లీకి మరొకటి ఆదర్శం.
ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొంటున్నారన్న చంద్రబాబే ఇప్పుడా పని చేశారు కదా?
బాబు నిజంగా రాజనీతిజ్ఞతను ప్రదర్శించుకోవాలంటే ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించాలి. టీడీపీపై అభిమానంతో చేరుతున్నట్లయితే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేసి మళ్లీ గెలవాలి అని ఆయన చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డాక కూడా దాన్ని ఒక తార్కిక ముగింపుకు తీసుకెళ్లకుండా అలాగే ఆపుతున్నారు.
వైస్ కుటుంబంమీద కాంగ్రెస్ పార్టీ కక్ష పూని, కేసు పెట్టిందా?
కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో ప్రాణం పోశారు. అలాంటి మనిషి కుటుంబం ఈరోజు ఇబ్బందికరమైన వాతావర ణంలో ఉందంటే బాధగానే ఉంది. కానీ దానికి కారణం కమ్యూనికేషన్ గ్యాపే కాని కాంగ్రెస్ అధిష్టానం కాదు. హైకమాండ్‌కి రాష్ట్రానికి మధ్య రాయబారాలు నడిపే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యదర్శులు మొత్తం వ్యవహారాన్ని సరిగా మ్యానేజ్ చేయలేకపోయారనన్నదే నా ఫీలింగ్.
వైఎస్ చనిపోన తర్వాత జగన్ ని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏవిధంగా ఆయనకు విశ్వాసం కల్పిం చాలి అనే విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. మరోవైపు పార్టీని వీడకముందు జగన్ తీసుకున్న చర్యలను సరైన స్ఫూర్తిలో హైకమాండ్ ముందుకు తీసుకెళ్లలేకపో యారు. దీంతో గ్యాప్ ఎక్కువైన మాట వాస్తవమే. జగన్‌కి రాజకీయంగా కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే.
ఎన్టీఆర్, బాబు, వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డిపై మీ అభిప్రాయం?
ఎన్టీఆర్ అత్యంత ఆకర్షణీయమైన మనిషి. సినిమా రంగంలోంచి వచ్చారు. మంచి మనిషి. ఏదైనా ప్రాంతాన్ని చూసిన తర్వాత వెంటనే దానిపై నిర్ణయం ప్రకటించేవారు. ఇక బాబు. అన్ని వివరాలను తను సమగ్రంగా చూసేవారు. అంతా సరిగా ఉందంటేనే ఒకే అనేవారు. అలా ముందు జాగ్రత్త పడేవారు. తర్వాత వైఎస్సార్.. ప్రజల్లో 20 లేదా 30 ఏళ్లు మెలిగారు కాబట్టి ఏ గుండె ఏం కోరుకుంటోంది అనే సమాచారం వారి చేతుల్లో ఉండేది. మంచిమనసుతో వచ్చాడు కాబట్టే రాష్ట్రానికి రెవెన్యూ కూడా బాగా పెరిగింది. సంక్షేమానికి, అభివృద్ధికి ఆరోగ్యానికి, విద్యకు ఇలా ఉమ్మడి ఏపీని ఎంత డైనమిక్ స్టేట్‌గా మల్చారంటే.. నేను 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జిల్లాలకు అన్ని నిధులు ప్రకటించడం ఎప్పుడూ చూడలేదు. ముఖ్యంగా ఆయన ప్రారంభించిన జలయజ్ఞం ఒక గేమ్ చేంజర్.
ఆనాటి స్పీకర్ రామకృష్ణుడు ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కదా?
ఆ విషయంపై రామకృష్ణుడిని మీరు అడిగితే తప్పనిసరిగా ఇప్పుడు బాధపడతారని నా అభిప్రాయం. ఒక సీఎం ఉన్నట్లుండి పదవి కోల్పోయిన సంక్షోభ పరిస్థితుల్లో సభను రక్షించేవాడు సభాపతే. నిన్నటిదాకా సీఎంగా ఉన్న వ్యక్తిని మీరు మాట్లాడటానికి లేదని సభాపతి అన్నారంటే అది తర్వాతయినా పశ్చాత్తాపపడాల్సిన విషయమే.
(కె.ఆర్. సురేష్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి)
https://www.youtube.com/watch?v=fYydXz83IEM