బ్యాంకు వెనుక గుంత తవ్వి..
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరు సమీపంలోని తిరుప్పాచ్చూర్‌లో ఇండియన్ బ్యాంకు వెనుక గుర్తు తెలియని దుండగులు ఐదు అడుగుల మేర గుంతను తవ్వారు. లాకర్లో ఉన్న నగదు, నగలను అపహరించాలని మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం తవ్విన గుంతను ఆ గ్రామ మహిళలు గుర్తించారు. బ్యాంకు లాకర్లో రెండు కోట్లకుపైగా విలువజేసే నగదు, నగలు భద్రంగా ఉండడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ ప్రాంతంలో ఇండియన్ బ్యాంకు బ్రాంచి ఉంది. దీని వెనుక భాగంలో పిచ్చిమొక్కలతో పాటు ఇతర ముళ్లపొదులు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని తొలగించాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. తిరుప్పాచ్చూర్ గ్రామంలోని మహిళలకు పిచ్చిమొక్కలను తొలగించే పనిని అప్పగించారు. పనిలో నిమగ్నమైన కూలీలు లాకర్ రూమ్ ప్రాంతంలో ఐదు అడుగుల మేరకు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు. వారు వెంటనే బ్యాంకు మేనేజర్ సుమతికి సమాచారం అందించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మేనేజర్ తాలుకా ఇన్స్పెక్టర్ ఏకాంబరానికి ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు, బ్యాంకు వెనుక నుంచి లాకర్‌కు తవ్వకాలు జరిపినట్టు గుర్తించారు.
అనంతరం ఇండియన్ బ్యాంకు భద్రతా అధికారి కుమరవేలు సంఘటన స్థలానికి చేరుకు పరిశీలించారు. బ్యాంకు లాకర్లో వుంచిన రెండు కోట్ల విలువ చేసే నగలు, నగదు భద్రంగా ఉండడంతో బ్యాంకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బ్యాంకు భద్రతాధికారి కుమర వేలు మీడియాతో మాట్లాడుతూ, బ్యాంకులో చోరీయత్నం జరిగిన నేపథ్యంలో నైట్ వాచ్‌మన్‌ను నియమిస్తామన్నారు. దీంతో పాటు బ్యాంకు ముందు, వెనుక భాగంలో కెమెరాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు.