పాన్‌కార్డు లేకున్నా పట్టుకుంటాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డు లేదు కదా ఆదాయ పన్ను పరిధిలోకి రావడం లేదనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆదాయం ఉండి పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని వెతికి పట్టుకునే శక్తి సామర్థ్యాలున్నాయని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్స్ (సీబీడీటీ) చైర్మన్ కె.వి.చౌదరి తెలిపారు. గతేడాది దేశవ్యాప్తంగా ఈ విధంగా 5,327 కేసులు నమోదు చేయడమే కాకుండా రూ. 90,000 కోట్లు లెక్కలు చూపించని ఆదాయాన్ని వెలికితీసినట్లు తెలిపారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో 758 కేసులు నమోదు చేయడమే కాకుండా రూ. 1,133 కోట్లు లెక్క చూపని ఆదాయాన్ని కనుగొన్నట్లు ఆయన తెలిపారు.
సీబీడీటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన చౌదరి శుక్రవారం ఐటీ టవర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ జనాభా 125 కోట్లు దాటినా అందులో కేవలం 3.5 కోట్లు మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారన్నారు. కానీ పాన్ కార్డు లేకుండా కూడా ఆదాయాన్ని సంపాదిస్తూ పన్ను ఎగవేస్తున్న వారు కూడా ఉన్నారని, వీరందరినీ వెలికితీసి పన్ను పరిధిలోకి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, మొబైల్ ఫోన్ అమ్మకాలు, మైనింగ్ వ్యాపారాల్లో లెక్కలు చూపించని ఆదాయం ఎక్కువగా ఉంటోందన్నారు.
బ్యాంకు లావాదేవీలు, బీమా, ఇతర ఆర్థిక సంస్థలు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, ఆటో మొబైల్ కంపెనీలు... ఇలా అనేక సంస్థల నుంచి సమాచారం తీసుకొని పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్న వారి వివరాలను సర్వే రూపంలో సేకరిస్తున్నట్లు చౌదరి తెలిపారు. అంతేకాకుండా కార్యాలయాలు, ఇళ్లను సోదా చేయడం ద్వారా అక్రమ ఆస్తులను గుర్తిస్తున్నామని ఈ విధంగా గతేడాది రూ. 19,792 కోట్లు తమ సోదాల్లో బయటపడ్డాయని, ఇందులో రూ. 808 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ రీజియన్‌లో 50 గ్రూపులపై సోదా చేసి రూ. 1,441 కోట్లు వెలికి తీశామని, ఇందులో 11 గ్రూపులకు చెందిన రూ. 189 కోట్లు సీజ్ చేయడం జరిగిందన్నారు.
పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్యను పెంచడానికి వివిధ డేటా బ్యాంకులు, బిజినెస్ ఇంటిలిజెన్స్ ప్రాజెక్ట్స్‌పై ఆధారపడుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రిటర్నులు వేయాల్సిన వారిలో 22 లక్షల మంది దాఖలు చేయని వారిని గుర్తించినట్లు తెలిపారు. పన్ను వివాదాల కేసుల్లో కోర్టుల వద్ద మూడు లక్షలకు పైగా అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, ఈ సంఖ్యను తగ్గించడానికి త్వరలో ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.
వసూళ్లలో లక్ష్యం చేరుకుంటాం.
ప్రసుత్త ఆర్థిక సంవత్సరంలో రూ. 7.36 లక్షల కోట్లు ఆదాయ పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చౌదరి తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 15 శాతం అధికమని, ఈ ఏడాది ఇప్పటికే రూ. 53,936 కోట్లు రిఫండ్స్ చెల్లించిన తర్వాత నికరంగా రూ. 1.51 లక్షల కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ ఏడాది రూ. 38, 288 కోట్లు వసూ లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ. 5,978 కోట్ల వసూళ్లు జరిగాయని, ఇవి కాకుండా రూ. 3,175 కోట్లు రిఫండ్స్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు చౌదరి తెలిపారు.
స్పైస్ జెట్‌లో లోపాలు నిజమే..
స్పైస్ జెట్ ఆదాయ పన్ను వ్యవహారాల్లో కొన్ని అవకతవకలను గుర్తించామని, వీటి ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులనుంచి వసూలు చేసిన టీడీఎస్‌ను సకాలంలో చెల్లించకపోవడం, ఉద్యోగస్తులకు ఫామ్ -16 ఇవ్వకపోవడం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు చౌదరి తెలిపారు.
టాక్స్ ఆడిటింగ్ గడువు పెంపు పరిశీలిస్తాం
ట్యాక్స్ ఆడిట్ కేసుల్లో రిటర్నులు దాఖలు చేయాల్సిన సమయాన్ని పెంచే విషయాన్ని పరిశీలిస్తామని సీబీడీ టీ చైర్మన్ హామీ ఇచ్చినట్లు ఫ్యాప్సీ ఒక ప్రకటనలో పేర్కొంది. మర్యాద పూర్వకంగా ఫ్యాప్సీ బృందం చౌదరిని కలిసింది. ఈ సందర్భంగా ట్యాక్స్ ఆడిటింగ్ రిటర్నుల గడువును పెంచాల్సిందిగా ఫ్యాప్సీ కోరింది.