పేదలకు ఇబ్బంది కలిగితే కష్టం
♦ రైతులు నిరాశా నిస్పృహల్లో ఉన్నారు
♦ వ్యవసాయ రంగంలో మైనస్‌లో ఉన్నాం
♦ ఉపాధి నిధులు ఖర్చు చేస్తున్నా ఫలితాలు రావడంలేదు
♦ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందాలని, వారిలో అసంతృప్తి పెరగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు, ఉన్నతాధికారులకు పిలుపునిచ్చారు. పేదలను ఇబ్బంది పెడితే అనుకున్న వృద్ధిని సాధించలేమని, వారు ఇబ్బంది పడేలా సంస్కరణలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. స్థానిక హోటల్లో రెండురోజులపాటు జరిగే జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికానికి 9.72 శాతం, రెండో త్రైమాసికానికి 13.94 శాతం కలిపి మొత్తం 11.77 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు.
ఇదే సమయంలో జాతీయ స్థాయి వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందన్నారు. పరిశ్రమల రంగంలో 6.25 శాతం, సేవా రంగంలో 8.81 శాతం వృద్ధి సాధించామన్నారు. ప్రాథమిక రంగం బాగా పనిచేస్తున్నా, వ్యవసాయ రంగంలో మైనస్‌లో ఉన్నామని, ఈ రంగంలో అనుకున్నంతగా చేయలేకపోయామని చెప్పారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, నిరాశా నిస్పృహలతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
పోలీసు, రెవెన్యూ బాగా పనిచేయాలి
పోలీసు, రెవెన్యూ వంటి రెగ్యులేటరీ శాఖలు బాగా పనిచేయాలని, ఆరోగ్య, విద్యా రంగాల పనితీరు మెరుగుపడితేనే ఫలితాలు వస్తాయని సీఎం చెప్పారు. ఉపాధి హామీ నిధులు ఖర్చు పెడుతున్నా ఫలితాలు రావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే నెలలో భోగాపురం ఎయిర్‌పోర్టుకు బిడ్స్ పిలుస్తామని, దగదర్తి, ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూములను అప్పగిస్తామని తెలిపారు.
ఏటా భారీగా వేడుకలు
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, సింగపూర్ ఫెస్టివల్ తరహాలో ఏటా భారీగా వేడుకలు నిర్వహించాలని చంద్రబాబు పర్యాటక శాఖాధికారులకు సూచించారు. విశాఖ పెస్టివల్కు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. స్మార్ట్ గ్రామ, స్మార్ట్ వార్డుల్లో అధికారులు ఇంకా భాగస్వాములు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రతన్ టాటా వంటి వ్యక్తులతో త్వరలో స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి త్వరలో సీఈఓను నియమిస్తామన్నారు. గ్రామాల్లో పనిచేస్తూ పట్టణాల్లో ఉండే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు.
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి బాగానే ఉన్నా సంతృప్తికరంగా లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. తొలుత ద్వితీయ త్రైమాసిక (మూడు నెలలు) ఫలితాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. సీసీఎల్ఏ అనిల్‌చంద్ర పునీత స్వాగతోపన్యాసం చేయగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సదస్సు ఉద్దేశాలను వివరించారు. ఉపముఖ్యమంత్రులు కేవీ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు.