labuors
-
కిరాయి కార్యకర్తల కోసం అన్వేషణ!
సాక్షి, అమరావతి : నామినేషన్ల పర్వం మొదలైంది. పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లాలంటే.. కనీసం వందమంది కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించాలి. అక్కడ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు క్రమం తప్పకుండా ప్రచారం చేయాలి. నామినేషన్ల తర్వాత కిరాయి కార్యకర్తలు దొరకడం కష్టం అవుతుంది. వేసవి కావడంతో భవన నిర్మాణాలకు డిమాండ్ ఉంటుంది. అలాగే ఎండలకు భయపడి కార్యకర్తలు రెట్టింపు డబ్బులు ఇస్తే కాని రారు. అందువల్ల నెల రోజులకు జీతానికి కార్యకర్తలను మాట్లాడుతున్నారు. నెల రోజులపాటు తమ వెంట ఉండేందుకు ముందుగానే మాట్లాడుకుంటున్నారు. నెలకు మాట్లాడుకున్నప్పటికీ వారానికి ఓసారి డబ్బులు తీసేసుకుంటున్నట్టు కిరాయి కార్యకర్తలను సరఫరా చేసే వన్ టౌన్‌కు చెందిన బ్రోకర్ ఒకరు తెలిపారు. ఒక్కో అభ్యర్థి కనీసం 50 మంది కిరాయి కార్యకర్తలను తమ వెంట ఉండే విధంగా మాట్లాడుకుంటున్నారు. కాగా పార్టీలో పనిచేసే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విధంగా కార్యకర్తలను సరఫరా చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఏ డివిజన్ లేదా గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడ లోకల్‌గా పనిచేసే కార్యకర్తల సేవలను ఉపయోగించుకుంటున్నారు. కార్యకర్తలకు డబ్బులతోపాటు చీరలు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు అదనంగా సరఫరా చేస్తున్నారు. నాయకుడి మంచితనాన్ని బట్టి నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. ముందుగా అడ్వాన్స్ తీసుకున్న తర్వాతే తమ కార్యకర్తల్ని మధ్యవర్తులు రంగంలోకి దింపుతున్నారు. తెలంగాణ నుంచి కార్యకర్తలు.. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులు తెలంగాణ నుంచి కూడా కిరాయి కార్యకర్తలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి ప్రచారం చేయడానికి వెళ్లిన టీడీపీ ప్రజాప్రతినిధులు అక్కడ కార్యకర్తలకు ఇచ్చే రేట్ల గురించి వాకబు చేశారు. ఇక్కడ రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకూ చెల్లించాల్సి వస్తోంది. అదే తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి కార్యకర్తలు రూ.400కే వస్తుండటంతో విజయవాడ నగరానికి చెందిన ఓ అభ్యర్థి అక్కడ నుంచి సుమారు వందమందిని కిరాయికి పిలిపించారు. వారికి స్థానికంగా షెల్టర్ ఏర్పాటు చేశారు. ఉదయం పూట టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి ఖర్చులు మాత్రం కార్యకర్తలే పెట్టుకోవాల్సి ఉంటుందని తెలంగాణ నుంచి కార్యకర్తలను తీసుకువచ్చిన బీమ్లా నాయక్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సుమారు 500 మంది కృష్ణా, గుంటూరు జిల్లాలకు వచ్చారని వివరించారు. తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, కాబట్టి ఎన్నికల రోజుకు వెళ్లిపోతామని వారు అన్నారు. వ్యవసాయ కూలీలను వదలడం లేదు.. తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాకు వచ్చి ఇక్కడ చెరకు, పత్తి వంటి పంట పొలాల్లో పనిచేసి తిరిగి వెళ్లిపోతారు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన వార్ని నెల రోజులపాటు ఉండి తమకు ప్రచారం చేయమని కోరుతున్నారు. కూలికి వచ్చినవారికి రూ.300 నుంచి రూ.400 మాత్రమే చెల్లిస్తే.. ఉదయం, సాయంత్రం ప్రచారానికి తిరుగుతారని ముఠా మేస్త్రీలు చెబుతున్నారు. టికెట్ కేటాయింపుపై అనుమానాలున్న అభ్యర్థులు కూడా చివర నిమిషంలో టికెట్ లభిస్తే ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఊరు వలసబాట..
సాక్షి, వేమనపల్లి: ఉన్న భూములు అటవీ వివాదంలో ఉన్నాయి.. చేద్దామంటే పనులు లేవు.. తిందామంటే తిండికి లేదు,. వారికి వేరే ఉపాధి లేక రాజారం ఊరు వలస బాట పట్టింది. అందురు పనుల కోసం పట్నం బోతే ఇంటివద్ద ఉన్నోళ్లు చీపుర్ల కోసం అడవిబాట పడుతున్నారు. అక్కడ దొరికే చీపురు పుల్లలను సేకరించి, చీçపుర్లను తయారు చేసి వాటిని విక్రయించిన డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు. రాజారం గ్రామంలో మొ త్తం 88 కుటుంబాలున్నాయి. వీటిలో 56 కుటుంబాలు గత 15 రోజుల నుంచి మంచిర్యాలకు వలస వెళ్తూనే ఉన్నారు. ఇక ఇంటి వద్ద ఉండే ముసలివారు చీపురు పుల్లల సేకరణను ఉపాధిగా ఎంచుకున్నారు. వరి కోతలు, పత్తి తీయడం పనులు మొదలయ్యేదాక వీరికి ఈ పనే ఆధారం. తెల్లవారకముందే సద్ది మూట పట్టుకుని అడవిబాట పడుతారు. వన్యమృగాల భయాన్ని లెక్క చేయకుండా చెట్టూ పుట్టా తిరిగి చీపురు పుల్లలు సేకరిస్తున్నారు. వాటిని ఇంటికి తెచ్చి ఎండలో ఆరబెట్టి వాటిని కట్టలుగా కడుతారు. సమీప గ్రామాల్లో తిరిగి రూ.20 లకు కట్ట చొప్పన అమ్మి జీవనం సాగిస్తున్నారు. పొద్దంతా కష్టపడి చీపురు పుల్లలు ఏరినా.. సరైన కూలీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేలని భూవివాదం.. రాజారం గిరిజనులు భూముల్లేని పేదలు కాదు. చీపురు సేకరణ, వలసలు వెళ్లటమే వీరికి ప్రధానాధారం కాదు. గోదుంపేట శివారులో ఉన్న వీరి భూములు అటవీ వివాదంతో తుడిచిపెట్టుకు పోయాయి. ఈ శివారులో 54 కుటుంబాలకు సాగు భూములున్నాయి. గత 20 ఏండ్ల క్రితమే ప్రభుత్వం పట్టాలిచ్చింది. ఐటీడీఏ సహకారంతో బోర్లు వేసి మామిడి చెట్లు పెంచి ఉపాధి చూపింది. గత 8 సం.లుగా ఆ భూమిపై అటవీ అధికారుల బెదిరింపులు మొదలయ్యాయి. దీం తో భూములను వదిలిపెట్టడంతో వీరు ఉపాధి కోల్పొయి కూలీలుగా మారారు. గత మూడు నెలల క్రితం మా భూములు మాగ్గావాలని గిరిజనులు ఉద్యమానికి సిద్దమయ్యారు. భూముల వద్దకు వెళ్లి సాగు చేసేందుకు అరకలు కట్టారు. దీంతో అటవీ, పోలీస్ అధికారులు 9 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆగాలని స్వయంగా జిల్లా కలెక్టర్ సూచించడంతో గిరిజను లు శాంతించారు. పల్లెల్లో వరి కోతలు, పత్తి సేకర ణ పనులు ప్రారంభం కాకపోవడంతొ కడుపు నిండే మార్గం లేక మంచిర్యాలలోని పలు ప్రాం తాలకు ఇటుక పనికి వెళ్తున్నారు. ఇంటి వద్ద ఉన్న వారు చీపుర్లను అమ్ముకుంటు ఉపాధి పొందుతున్నారు. మేం బతుకుడెట్ల.. మాకు గోదుంపేట శివారులో భూములు ఉన్నా యి. కానీ అటవీఅధికారులు సాగు చేయకుండా బెదిరిస్తున్నారు. ఇగ మేం బతుకుడెట్ల. అందరం మంచిర్యాల ఇటుక ప నులకు పోతె ఇంటి కాడున్నోళ్లు చీపురు ఏరేందుకు పోతాండ్లు. – బుర్సమాంతయ్య రాజారం ఊళ్లో ఉపాధి లేదు.. మాకు ఊళ్ల వేరే ఉపాధి లేదు. ఇగ ఏం పనిజేసుడు. మేమంతా ఇటుక పనికి పోతె ఇంటి కావలికి ముసులోళ్లు ఉంటుర్రు. ఆళ్లకు బువ్వ ఎట్ల, ఉపాసం ఉండలేక చీపురుపుల్లలు ఏరేందుకు పోతుల్లు. వాటితో వచ్చిన పైసలతోని బియ్యం, సామాన్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్నారు. – నాయిని చంద్రు -
బిల్లులు అందేనా!
సాక్షి, మల్దకల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చేసిన కూలీలందరికీ సకాలంలో కూలి డబ్బులు అందక, కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. పనులు చేసి రెండేళ్లు గడుస్తున్నా.. అధికారులు అప్పుడు, ఇప్పుడు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో కూలీలు డబ్బులు రాక, పనులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2016లో మండలంలోని ఉలిగేపల్లిలో దాదాపు 200 మంది కూలీలు కూలి పనులు, వ్యవసాయ పొలాలను చదును చేయడం, ముళ్లచెట్లను తొలగించడంతో పాటు వివిధ ఉపాధి హామీ పనులు చేయగా.. రూ.3 లక్షల 90 వేలకు పైగా బిల్లులు అందాల్సి ఉంది. పనులు చేసిన కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించాల్సిన అధికారులు ఇప్పటివరకు ఖాతాలో డబ్బులను జమ చేయకపోవడంతో కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు కూలీలు గతంలో ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో విచారణ జరిపించి కూలీలకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు కూలీలు అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంకుడు గుంతల పరిస్థితి... అలాగే మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధిహామీ పథకం కింద నిర్మించుకున్న మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల బిల్లులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. ఉలిగేపల్లిలో 125 మరుగుదొడ్లు, అమరవాయిలో 40 మంది ఇంకుడు గుంతలు నిర్మించుకోగా.. లబ్ధిదారులకు నేటికీ బిల్లులు అందలేదు. వారితో పాటు నిర్మించుకున్న కొంత మంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగా.. మిగిలిన వారికి నేటివరకు అందలేదు. దాదాపు రూ.2 లక్షలకు పైగా మరుగుదొడ్ల బిల్లులు, లక్షకు పైగా ఇంకుడు గుంతల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ప్రస్తుతం లబ్ధిదారులు మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. మంజూరైన వెంటనే జమచేస్తాం.. ఉలిగేపల్లిలో ఉపాధి కూలీలకు బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. మంజూరైన వెంటనే కూలీల ఖాతాల్లో జమ చేస్తాం. అదే విధంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు బిల్లులు విషయమై కూడా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. – రాజారమేష్, ఎంపీడీఓ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది.. గ్రామంలో ఉపాధి హామీ పనులు చేసి రెండేళ్లు గడుస్తుంది. ఇప్పటి వరకు అధికారులు బిల్లులు చెల్లించలేదు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా మార్పు రాలేదు. ఇక వస్తాయన్న ఆశ సన్నగిల్లింది. అధికారులు స్పందించి కూలీలు డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలి. – రాముడు, ఉలిగేపల్లి మరుగుదొడ్లు బిల్లు ఇస్తాలేరు.. ఉలిగేపల్లిలో ఉపాధి హామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.12 వేలు అందజేస్తామని చెప్పారు. దీంతో అప్పులు చేసి మరీ నిర్మించుకున్నాం. ఇప్పటి వరకు బిల్లులు అందించలేదు. ఇకనైనా అధికారులు స్పందించి మరుగుదొడ్ల బిల్లులు అందిస్తే బాగుంటుంది. – నర్సింహులు, ఉలిగేపల్లి -
రైల్వే కార్మికులకు దసరా బోనస్..!
రామగుండం: దసరా పండుగను పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు 78రోజుల వేతనాన్ని ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ)గా చెల్లించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఏడాది రైల్వేశాఖ నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా వివిధ కార్మిక సంఘాల విన్నపం మేరకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. గతేడాది చెల్లించిన దసరా బోనస్ రూ.8,975 వేలు కాగా.. ప్రస్తుత ఏడాది దానిని రూ.18వేలు చేయాలనే కార్మిక సంఘాల డిమాండ్ చేశాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఓ కార్మిక సంఘం నాయకులు చెబుతున్నారు. దీంతో రైల్వేలో పనిచేస్తున్న 12లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.