ఆ క్రికెటర్ కథతో సినిమా తీస్తా!
‘‘మూస ధోరణిలో ఉన్న కథలు నాకిష్టం ఉండదు. అందుకే కొత్త కథలతో సినిమాలు తీస్తుంటాను. నన్ను ఉద్వేగానికి గురి చేసే కథ దొరికేంతవరకూ అన్వేషిస్తాను’’ అని ‘మధుర’ శ్రీధర్ చెప్పారు. దర్శకునిగా స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ వంటి వినూత్న కథలు తెరకెక్కించిన శ్రీధర్ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. క్రికెటర్ శ్రీశాంత్ జీవితం ఆధారంగా ఈ చిత్రం ఉంటుందని శ్రీధర్ చెబుతూ - ‘‘ఓ క్రికెటర్, ఓ నటి మధ్య సాగే ప్రేమకథతో ఈ చిత్రం ఉంటుంది. బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా’’ అన్నారు. పీబీ మంజునాథ్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘లేడీస్ అండ్ జెంటిల్మెన్’ చిత్రం నేడు విడుదలవుతోంది. ‘‘ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఇంటర్నెట్ ఎలా మార్చేసింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. ఈ ఐదేళ్లల్లో ప్రేక్షకులు ఇలాంటి బోల్డ్ చిత్రాన్ని చూసి ఉండరు’’ అని శ్రీధర్ చెప్పారు.