నీటిలో మునిగి 14 మంది చిన్నారుల మృతి
మాస్కో: రష్యాలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఫిన్లాండ్ సరిహద్దుకు సమీపంలోని స్యమొజీరో సరస్సులో పడవ తిరగబడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమ్మర్ క్యాంపుకు వెళ్లిన చిన్నారులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 14 మృతదేహాలను కనుగొన్నామని రష్యా దర్యాప్తు కమిటీ అధికారి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు. చిన్నారులందరూ 14 ఏళ్ల లోపువారేనని చెప్పారు. మృతుల్లో పెద్దలు ఎవరూ లేరని వెల్లడించారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నలుగు క్యాంప్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. సాయంకాలం వేళ రెండు పడవల్లో విద్యార్థులు విహారానికి వెళ్లినప్పుడు బలమైన అలల ధాటికి తిరగబడ్డాయన్నారు. సహాయక సిబ్బంది 30 మందిని కాపాడినట్టు తెలిపారు. మృతుల్లో 10 మంది మాస్కోకు చెందిన వారిగా గుర్తించారు.