13న భద్రాచలంలో లక్ష దీపోత్సవం
భద్రాచలం: భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఈ నెల 13న అరుదైన వేడుకను నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మిథిలా స్టేడియం(కల్యాణమండపం) ప్రాంగణంలో కార్తీక పుష్యమి లక్ష దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేశారు. ఆధ్యాత్మికతను పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించ తలపెట్టిన ఈ ఉత్సవానికి అయ్యే వ్యయాన్ని బెంగళూరుకు చెందిన పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ రోజు రామాలయ ప్రాంగణమంతా కార్తీక దీపాలతో అలంకరించనున్నారు.
దర్బార్ సేవ జరిగే ఉత్సవ మంటపాన్ని కూడా ప్రత్యేకంగా దీపాలంకరణ చేయనున్నారు. ఇందుకోసమని 50 వేల ప్రమిదలను, లక్ష వత్తులను, దీపాలను వెలిగించేందుకు నూనె వంటి వస్తువులను నిర్వాహకులే అందజేయనున్నారు. కల్యాణ మండపంలో దీపాలంకరణ కోసం 24 గ్రూపుల(దళం)ను ఎంపిక చేయనున్నారు. ఒక్కో గ్రూపులో 12 మంది మహిళలు ఉంటారు. ఎంపిక చేసిన దళాలను దేవతా మూర్తుల పేర్లతో నమోదు చేసుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 7గంటల వరకు ఈ జరిగే ఈవేడుకలో అధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు.
భద్రాద్రికి భక్తులను రప్పించడమే లక్ష్యం..
పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసి, తద్వారా దివ్యక్షేత్రానికి భక్తులను రప్పించటమే లక్ష్యంగా ఈ అరుదైన వేడుకను నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం అధికారులు ప్రకటించారు. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వారు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకు రావటం అభినందనీయమని దేవస్థానం ఈఓ కూరాకుల జ్వోతి, ఏఈఓ శ్రావణ్ కుమార్ తెలిపారు.
దీపోత్సవంలో పాల్గొనే మహిళా టీమ్‌లకు వారి ప్రతిభకు గుర్తింపుగా బహుమతులను కూడా అందజేసేందుకు ఫౌండేషన్ వారు ముందుకొచ్చారని తెలిపారు. మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.15 వేలు విలువ గల వెండితో తయారు చేసిన అమ్మవారి ప్రతిమ, పీఠాలను అందజేయనున్నట్లుగా చెప్పారు. వేడుకలో పాల్గొనే టీమ్‌లలో సభ్యులందరికీ భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి చిత్రాలను అందజేస్తామన్నారు.
9లోగా నమోదు చేసుకోవాలి..
భద్రాద్రి క్షేత్రంలో జరిగే లక్ష దీపోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామభక్తులు పాల్గొనవచ్చు. ఇందుకోసం టీమ్‌లుగా ఏర్పడి ఈ నెల 9లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని దేవస్థానం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం దేవస్థానం ఉద్యోగులకు చెందిన 76600 07679, 76600 07684 సెల్ నంబర్ర్లలో సంప్రదించాలని కోరారు.