ఆగిన ఆరోగ్యశ్రీ.. అవస్థల్లో రోగులు!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ సేవల బంద్‌తో పలుచోట్ల రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. 10 రోజుల నుంచి ఔట్ పేషెంట్లు, వైద్య పరీక్షల సేవలనే నిలిపివేసిన నెట్వర్క్ ఆసుపత్రులు.. శనివారం నుంచి ఇన్‌పేషెంట్ సహా ఇతర అత్యవసర సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆరోగ్యశ్రీ సహా ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్ఎస్) కింద వైద్య సేవలకు పాక్షికంగా బ్రేక్ పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు దాదాపు 10 వేల మంది రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారని నెట్వర్క్ ఆసుపత్రులు పేర్కొన్నాయి. మొత్తం 235 ఆసుపత్రుల్లో సేవలన్నీ నిలిచిపోయాయని తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు రాకేశ్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం మాత్రం వైద్య సేవలు అందుబాటులోనే ఉన్నాయని తెలిపింది.
రంగంలోకి మంత్రి లక్ష్మారెడ్డి...
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను శాంతింప చేయడంలో విఫలం కావడంతో ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి రంగంలోకి దిగారు. ఉన్నతాధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సందర్భంగా తామంతా బిజీగా ఉంటే, ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం కావడంపై ఆయన మండిపడినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో టూర్లకు ఎలా వెళ్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. కొందరు నెట్వర్క్ ఆసుపత్రుల నేతలతోనూ, కార్పొరేట్ యాజమాన్యాలతోనూ ఆయన ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ప్రస్తుతం తామంతా బిజీగా ఉన్నామని, ఎన్నికలయ్యాక పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని వారితో అన్నట్లు సమాచారం. ఆయన చర్యలతో కార్పొరేట్ సహా కొన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవల బంద్‌ను ఉపసంహరించుకున్నాయని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
మొదటి నుంచీ వైద్య సేవలను నిలిపివేసిన కార్పొరేట్ ఆసుపత్రులు, శనివారం నుంచి చేపట్టిన పూర్తిస్థాయి ఆరోగ్యశ్రీ సేవల బంద్‌కు దూరంగా ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. కాగా కొందరు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నెట్వర్క్ ఆసుపత్రులు రోగులను ఇబ్బందికి గురిచేస్తే సహించబోమని మంత్రి హెచ్చరించినట్లు తెలిసింది. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ప్రవరిస్తున్నాయని, రాజకీయ ఉచ్చులో పడి ఇలా చేస్తున్నాయన్నారు. అవసరమైతే వైద్యంపై ఆరోపణలున్న కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులపై చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కొన్ని నెట్వర్క్ ఆసుపత్రులు వెనక్కు తగ్గినట్లు తెలిసింది. దీంతో నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నేతల్లోనూ సఖ్యత లేనట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుంటే శనివారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా 385 మంది ఆరోగ్యశ్రీ రోగుల వైద్యానికి అనుమతిచ్చినట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 159 మంది, కరీంనగర్ జిల్లాలో 52, మేడ్చల్‌లో 51, రంగారెడ్డి జిల్లాలో 34, వరంగల్ అర్బన్ జిల్లాలో 17 కేసులకు అనుమతిచ్చినట్లు వివరించింది.
అలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు: ఆరోగ్యశ్రీ సీఈవో
రోగులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) శనివారం ఒక ప్రకటనలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులను హెచ్చరించారు. ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు రోగులకు సేవలు అందించకుండా అసౌకర్యం కలిగిస్తే ఆరోగ్యశ్రీ జాబితా నుంచి ఆ ఆసుపత్రులను తొలగిస్తామని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.344 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గత నెల 30 నాటికి రూ.682 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇందులో గత వారం రోజుల్లోనే ప్రభుత్వం రూ. 150 కోట్లు విడుదల చేసిందన్నారు. అన్ని ఆసుపత్రులు కూడా ఆ రెండు పథకాలకు చెందిన లబ్ధిదారులకు ఉచిత, మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఈవో కోరారు.
వైద్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు: మంత్రి లక్ష్మారెడ్డి
ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అత్యవసర, ఇతర అన్ని రకాల వైద్య సేవలు ప్రముఖ కార్పొరేట్, ప్రైవేట్ వైద్య విద్యా దవాఖానాల్లో సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నాయని వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బకాయిలు కొంత మేర పెండింగ్‌లో ఉన్న మాట నిజమేనన్నారు. అయితే ఆ బకాయిలను ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తుందన్నారు. ఇప్పటికే రూ.150 కోట్లు విడుదల చేసిందన్నారు. అయినప్పటికీ తరచూ బకాయిల సాకుతో నిరుపేద ప్రజలకు వైద్య సేవలు నిలిపివేయడం, అదీ ప్రభుత్వం ఆపద్ధర్మంగా కొనసాగుతున్న ఈ తరుణంలో ఆపడం సమంజసం కాదన్నారు. యశోద, స్టార్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, కిమ్స్, ప్రైమ్, క్వాలిటీ కేర్ ఇండియా, సన్‌షైన్, కాంటినెంటల్, అపోలో వంటి పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. వైద్య సేవలు ఎక్కడా నిలిచిపోలేదని వివరించారు. ప్రజలు తమ సమీప కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలను పొందవచ్చని లక్ష్మారెడ్డి తెలిపారు. 104కి ఫోన్ చేస్తే ఆయా ఆసుపత్రుల వైద్య సేవల వివరాలు ప్రజలకు లభిస్తాయని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆరోగ్యశ్రీ ఏడాది బడ్జెట్ రూ.800 కోట్లని, అందులో ఈ మధ్యే రూ.150 కోట్లు విడుదల కాగా, ఈ ఆర్థిక ఏడాదిలో రూ.655 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు.