Lal-Neal
-
లాల్, నీల్.. కన్హయ్య
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ప్రజా సమస్యలే పోరాట పంథాగా, జనం గొంతుక వినిపించే కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మూడేళ్ల క్రితం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) పీహెచ్డీ విద్యార్థి కన్హయ్య కుమార్ రూపంలో ఒక నవగళం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడా గళమే మన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం నినదిస్తోంది. ఏళ్లకి ఏళ్లు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలకే అలవాటుపడిపోయిన ప్రజలకి వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి, అందరి దృష్టిని ఆకర్షించినవాడు కన్హయ్య కుమార్. ఇంటింటి ఉద్యమ కెరటం చిన్నతనం నుంచే వామపక్ష భావజాలం, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే వాగ్ధాటి ఉండడంతో జేఎన్‌యూలో అంతగా పట్టులేని లెఫ్ట్ పార్టీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కన్హయ్యకుమార్. విద్యార్థులకు పీహెచ్డీ భృతి తగ్గించడంతో ‘ఆక్యుపై యూజీసీ’ పేరుతో వీధులకెక్కి పోరాడినప్పుడు తొలిసారి ఆయన పేరు అందరికీ తెలిసింది. జేఎన్‌యూలో జాతివ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో దేశద్రోహం నేరం కింద అరెస్టయి బయటకి వచ్చాక కన్హయ్యకుమార్ తోటి విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ఆయన పేరు ఊరూవాడా మారుమోగింది. ఆ ప్రసంగమే రాజకీయ జీవితానికి పునాది వేసింది. చట్టసభల్లో కొత్త గొంతుకనవుతా.. రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడు సమ సమాజం ఆవిష్కృతమవుతుందని నమ్ముతారు కన్హయ్య కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడిరోడ్డుపై నిల్చోబెట్టి ప్రశ్నించాలని అంటారు. అందుకే చట్టసభల్లో కొత్త గొంతుకనవుతానని ఎలుగెత్తి చాటుతున్నారు. 2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరారు. అప్పట్నుంచి జనసంవాద్ కార్యక్రమం ద్వారా 100కిపైగా సమావేశాలు నిర్వహించి జనంలోకి చొచ్చుకెళ్లారు. ఇప్పుడు బిహార్‌లోని బేగూసరాయి నియోజకవర్గం నుంచి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఉద్యమ నేపథ్య కుటుంబం.. బిహార్‌లోని బేగూసరాయిలో అగ్రవర్ణానికి చెందిన భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారు కన్హయ్యకుమార్. తండ్రి జయశంకర్ సింగ్ చాలా ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి మీనాదేవి అంగన్వాడీ కార్యకర్త. ఒకప్పుడు తల్లిదండ్రులిద్దరూ రైతు హక్కుల కోసం పోరాటాలు చేశారు. ఉద్యమమే ఊపిరిగా బతికిన కుటుంబం కావడంతో చిన్నప్పట్నుంచి కన్హయ్యకుమార్ ఆలోచనలన్నీ అణగారిన బతుకుల చుట్టూ తిరుగుతుండేవి. వామపక్ష భావజాలానికి ఓట్లు రాల్చే సత్తా లేదని భావించిన కన్హయ్య కుమార్ దేశంలోని దళితులు, వామపక్షాలు కలిస్తేనే సరికొత్త విప్లవం పుట్టుకొస్తుందని ప్రతిపాదిస్తున్నారు. ‘లాల్, నీల్’ నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కన్హయ్యకుమార్ విజేతగా నిలుస్తారా ? ఒక ప్రశ్నించే గళం, ఆగ్రహావేశాలు రగిలించే ప్రసంగం నవయువకుల్లో స్ఫూర్తి నింపుతోంది. నేటి తరం ఆయన ప్రసంగాల్ని ఆసక్తిగా వింటున్నారు. ‘‘ కన్హయ్యకుమార్ యువతకి ఆదర్శప్రాయుడు, ఒక హీరో. మోదీనే ఎదురిస్తున్న ధీరుడు. అందులో సందేహం లేదు. కానీ నడి వయసులో వారిని,వయసు మళ్లిన వారిని కన్హయ్య కుమార్ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి‘‘అని బీహార్‌కు చెందిన జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ నుంచి వివాదాస్పదుడైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉంటే, మహాగఠ్ బంధన్‌లో భాగస్వామి అయినప్పటికీ ఆర్జేడీ తన్వీర్ హసన్‌ను పోటీలో నిలిపింది. కన్హయ్య కుమార్ భావజాలం జనసామాన్యంలోకి వెళ్లలేదనే భావనతో ఉన్న ఆర్జేడీ ఎన్నికల గోదాలోకి దిగింది. మహాగఠ్‌బంధన్ కన్హయ్యకుమార్కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పట్నుంచే చెప్పలేని స్థితి. కన్హయ్య కుమార్ పక్కా లోకల్ కావడం ఆయనకి కలిసొచ్చే అంశం.. కొత్త గొంతుకల మద్దతు ప్రజాస్వామ్యంలో కొత్త ఉద్యమ కెరటాలైన హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటివారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజకీయం రంగు మార్చుకుంది. గత ఏడాది గుజరాత్లో బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిపి, వారిని రాష్ట్రం నుంచి తరిమేసిన విషయం తెలిసిందే. దీనినే కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఒక ఆయుధంగా తీసుకున్నారు. జిగ్నేష్ మేవానీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బెంగుసరాయిలో మీకేం పని ? బిహారీలను తరిమి కొట్టారు. అలా దాడులు చేసిన వారి వెనక ఉండి మీరే ప్రోత్సహించారు. అప్పటి ఉద్రిక్తతలకి మీదే బాధ్యత‘ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మేవానీ గట్టిగానే బదులిచ్చారు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంటే, తనను నిందించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. గిరిరాజ్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒక మహా కవి చెప్పినట్టుగా కన్హయ్య కుమార్‌కు కెరటమే ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కన్హయ్య ఎన్నికల్లో గెలిచారా, ఓడారా అన్నది కాదు ముఖ్యం. ఒక కొత్త తరహా రాజకీయాలకు దారి చూపించిన యువకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. -
జాతీయస్థాయిలోనూ లాల్–నీల్?
కార్యాచరణ దిశగా సీపీఎం అడుగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేస్తున్న లాల్–నీల్ ప్రయోగాన్ని సీపీఎం దేశవ్యాప్తంగా అమలుచేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక శక్తుల సమస్యలను వామపక్షాలు నిర్లక్ష్యం చేశాయన్న విమర్శలను దూరం చేసుకునేందుకు జాతీయస్థాయిలో ఉమ్మడి కార్యాచరణను ఆ పార్టీ చేపట్టనుంది. పార్టీ పటిష్టత, విస్తరణకోసం సీపీఎంతో కలసి వచ్చే ప్రజాతంత్ర శక్తులు, సామాజిక శక్తులు, సంస్థలతో కలసి పని చేయనుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి నినాదంతో ఆ పార్టీ చేపట్టిన పాదయాత్ర అనుభవాలు, భవిష్యత్తు కార్యాచరణపై మార్చి 31 నుంచి ఏప్రిల్1 వరకు రెండు రోజులపాటు ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం హాజరుకానుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్–నీల్
-
కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్–నీల్
► సామాజిక న్యాయానికి ఐక్య ఉద్యమాలు: ఏచూరి ► హిందూ రాజ్యస్థాపన దిశగా మోదీ, సంఘ్ శక్తులు సందేశమిచ్చాయి ► యూపీ పీఠంపై ‘యోగి’ని కూర్చోబెట్టడమే అందుకు నిదర్శనం ► బీజేపీ, ఆరెస్సెస్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి: కేరళ సీఎం విజయన్ ► ముగిసిన తమ్మినేని మహాజన పాదయాత్ర.. సరూర్‌నగర్‌లో సీపీఎం భారీ సభ సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎరుపు, నీలం రంగు జెండాలను ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను సీఎంగా చేయడం ద్వారా ప్రధాని మోదీ, ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు హిందూ రాజ్యస్థాపన దిశగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయన్నారు. దళితులు, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై అగ్రకుల పెత్తందారీ విధానాలు అమలు కాబోతున్నాయని చెప్పారు. ఈ శక్తులు అధికారంలోకి రావడం వల్ల సామాజిక న్యాయ సాధన మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ‘సంక్షేమ, సామాజిక న్యాయ సమర సమ్మేళనం’పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. ‘‘ఇంద్రధనస్సులో మొదటనున్న ఎరుపు రంగు, చివరనున్న నీలం రంగు మధ్యలోని సమస్త రంగులు కలగలిసేలా ఉద్యమిద్దాం. సామాజిక న్యాయ సాధన కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు, హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తాం. అన్ని రంగాలు, వర్గాలపై మోదీ ప్రభుత్వ దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. పోరాడి సాధించిన పథకాలు రద్దవుతున్నాయి. సబ్‌ప్లాన్ రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, ఇతర వర్గాలకు చెందిన రూ.73 వేల కోట్ల స్కాలర్షిప్పులు, బకాయిలు విడుదల చేయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారు. గోరక్ష సమితి ద్వారా దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. లాల్, నీల్ జెండాలు, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం కలవకపోతే ఇలాంటి దాడులు తట్టుకునే పరిస్థితి ఉండదు’’అని ఆయన అన్నారు. శనివారం నాగ్‌పూర్‌లో తన సభకు ఆరెస్సెస్, సంఘ్ పరివార్ శక్తులు అడ్డంకులు సృష్టించినా.. అక్కడే అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన వీరభూమిలో ఎరుపు, నీలి జెండాలతో పాటు భగత్‌సింగ్ ఇంక్విలాబ్ నినాదాలతో ఉద్వేగభరితంగా సభ సాగిందని ఏచూరి చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఐక్యతను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ‘‘దేశవ్యాప్తంగా అంబేద్కర్, వామపక్ష భావజాలంతో సామాజిక న్యాయం నినాదంతో అన్ని శక్తులు కలసి పనిచేయడం మొదలైందని, ఇది నిర్నిరోధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 4,200 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను చైనాలో మావో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌తో పోల్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్ తమ మిత్రుడిగా ఉన్నారని, ఆ తర్వాత మారిపోయారని ఏచూరి అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలపై సీఎంకు తమ్మినేని రోజూ లేఖలు రాశారని, కేసీఆర్ ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలం గాణ సాయుధ పోరాటం భూసమస్యను దేశం ఎజెండాగా మార్చిందని, ఇక్కడ పోరాటాలు జరిగితే అవి దేశమంతా ప్రభావితం చేస్తాయ న్నారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సభకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీ లను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: విజయన్ బీజేపీ, సంఘ్ శక్తులు దేశాన్ని కాషాయీకరణ దిశగా తీసుకెళ్లేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ మండిపడ్డారు. సీపీఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కాషాయీకరణతో దళితులు, మైనారిటీలతోపాటు మహిళలు కూడా తీవ్ర నిర్భందానికి, ఒత్తిళ్లు, కట్టుబాట్లకు గురవుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. సంఘ్ అరాచకాల వల్లే రోహిత్ వేముల, ముత్తుకృష్ణ వంటి తెలివైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రం వినాశకరమైన విధానాలు అమలు చేస్తోంది. కేంద్రానికి రాష్టాలన్నా, రాష్ట్రాల హక్కులన్నా గౌరవం లేదు. దక్షిణాదిపై కక్ష కట్టింది. అందుకే ఈ రాష్ట్రాల్లో అశాంతి రేపాలని చూస్తోంది. భోపాల్‌లో, మంగళూరులో నా ఉపన్యాసాన్ని అడ్డుకోవాలని చూశారు. హైదరాబాద్ సభను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. వీటికి భయపడేది లేదు. మత ఘర్షణలు, పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ, ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే యూపీలో బీజేపీ గెలిచింది’’అని విజయన్ అన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం లేదు ఉమ్మడి రాష్ట్రంలో అసమానతలపై పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలోనూ సామాజిక న్యాయం అమలు కావడం లేదని, కొందరు రాజకీయవేత్తలు భారీగా ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని కేరళ సీఎం విజయన్ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.