సాక్షి, సెంట్రల్ డెస్క్ : ప్రజా సమస్యలే పోరాట పంథాగా, జనం గొంతుక వినిపించే కమ్యూనిస్టు పార్టీల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో మూడేళ్ల క్రితం ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) పీహెచ్‌డీ విద్యార్థి కన్హయ్య కుమార్ రూపంలో ఒక నవగళం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇప్పుడా గళమే మన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం నినదిస్తోంది.
ఏళ్లకి ఏళ్లు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న రాజకీయాలకే అలవాటుపడిపోయిన ప్రజలకి వామపక్ష సిద్ధాంతాలను, దళితులకు అంబేడ్కర్ కల్పించిన రక్షణ కవచాన్ని కలగలిపి ‘లాల్.. నీల్’ అనే ఒక కొత్త రాజకీయ అస్త్రాన్ని సంధించి, అందరి దృష్టిని ఆకర్షించినవాడు కన్హయ్య కుమార్.
ఇంటింటి ఉద్యమ కెరటం
చిన్నతనం నుంచే వామపక్ష భావజాలం, అందరినీ మంత్రముగ్ధుల్ని చేసే వాగ్ధాటి ఉండడంతో జేఎన్‌యూలో అంతగా పట్టులేని లెఫ్ట్ పార్టీ విద్యార్థి విభాగం ఏఐఎస్‌ఎఫ్ నుంచి పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కన్హయ్యకుమార్. విద్యార్థులకు పీహెచ్‌డీ భృతి తగ్గించడంతో ‘ఆక్యుపై యూజీసీ’ పేరుతో వీధులకెక్కి పోరాడినప్పుడు తొలిసారి ఆయన పేరు అందరికీ తెలిసింది.
జేఎన్‌యూలో జాతివ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో దేశద్రోహం నేరం కింద అరెస్టయి బయటకి వచ్చాక కన్హయ్యకుమార్ తోటి విద్యార్థుల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో ఆయన పేరు ఊరూవాడా మారుమోగింది. ఆ ప్రసంగమే రాజకీయ జీవితానికి పునాది వేసింది.
చట్టసభల్లో కొత్త గొంతుకనవుతా..
రాజ్యాంగాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడు సమ సమాజం ఆవిష్కృతమవుతుందని నమ్ముతారు కన్హయ్య కుమార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నడిరోడ్డుపై నిల్చోబెట్టి ప్రశ్నించాలని అంటారు. అందుకే చట్టసభల్లో కొత్త గొంతుకనవుతానని ఎలుగెత్తి చాటుతున్నారు.
2018 ఏప్రిల్‌లో సీపీఐ జాతీయ సమితిలో చేరారు. అప్పట్నుంచి జనసంవాద్ కార్యక్రమం ద్వారా 100కిపైగా సమావేశాలు నిర్వహించి జనంలోకి చొచ్చుకెళ్లారు. ఇప్పుడు బిహార్‌లోని బేగూసరాయి నియోజకవర్గం నుంచి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఉద్యమ నేపథ్య కుటుంబం..
బిహార్‌లోని బేగూసరాయిలో అగ్రవర్ణానికి చెందిన భూమిహార్ కుటుంబం నుంచి వచ్చారు కన్హయ్యకుమార్. తండ్రి జయశంకర్ సింగ్ చాలా ఏళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యారు. తల్లి మీనాదేవి అంగన్‌వాడీ కార్యకర్త. ఒకప్పుడు తల్లిదండ్రులిద్దరూ రైతు హక్కుల కోసం పోరాటాలు చేశారు.
ఉద్యమమే ఊపిరిగా బతికిన కుటుంబం కావడంతో చిన్నప్పట్నుంచి కన్హయ్యకుమార్ ఆలోచనలన్నీ అణగారిన బతుకుల చుట్టూ తిరుగుతుండేవి. వామపక్ష భావజాలానికి ఓట్లు రాల్చే సత్తా లేదని భావించిన కన్హయ్య కుమార్ దేశంలోని దళితులు, వామపక్షాలు కలిస్తేనే సరికొత్త విప్లవం పుట్టుకొస్తుందని ప్రతిపాదిస్తున్నారు. ‘లాల్, నీల్’ నినాదంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
కన్హయ్యకుమార్ విజేతగా నిలుస్తారా ?
ఒక ప్రశ్నించే గళం, ఆగ్రహావేశాలు రగిలించే ప్రసంగం నవయువకుల్లో స్ఫూర్తి నింపుతోంది. నేటి తరం ఆయన ప్రసంగాల్ని ఆసక్తిగా వింటున్నారు. ‘‘ కన్హయ్యకుమార్ యువతకి ఆదర్శప్రాయుడు, ఒక హీరో. మోదీనే ఎదురిస్తున్న ధీరుడు. అందులో సందేహం లేదు. కానీ నడి వయసులో వారిని,వయసు మళ్లిన వారిని కన్హయ్య కుమార్ ప్రసంగాలు ఆకట్టుకోలేకపోతున్నాయి‘‘అని బీహార్‌కు చెందిన జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు.
బీజేపీ నుంచి వివాదాస్పదుడైన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బరిలో ఉంటే, మహాగఠ్ బంధన్‌లో భాగస్వామి అయినప్పటికీ ఆర్‌జేడీ తన్వీర్ హసన్‌ను పోటీలో నిలిపింది. కన్హయ్య కుమార్ భావజాలం జనసామాన్యంలోకి వెళ్లలేదనే భావనతో ఉన్న ఆర్జేడీ ఎన్నికల గోదాలోకి దిగింది. మహాగఠ్‌బంధన్ కన్హయ్యకుమార్‌కు మద్దతుగా నిల్చొని ఉంటే ఆయన విజయం నల్లేరు మీద బండి నడకే. కానీ త్రిముఖ పోటీలో ఓట్లు చీలి ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పట్నుంచే చెప్పలేని స్థితి. కన్హయ్య కుమార్ పక్కా లోకల్ కావడం ఆయనకి కలిసొచ్చే అంశం..
కొత్త గొంతుకల మద్దతు
ప్రజాస్వామ్యంలో కొత్త ఉద్యమ కెరటాలైన హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవాని వంటివారు కన్హయ్యకు మద్దతుగా ప్రచారానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజకీయం రంగు మార్చుకుంది. గత ఏడాది గుజరాత్‌లో బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై దాడులు జరిపి, వారిని రాష్ట్రం నుంచి తరిమేసిన విషయం తెలిసిందే.
దీనినే కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఒక ఆయుధంగా తీసుకున్నారు. జిగ్నేష్ మేవానీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బెంగుసరాయిలో మీకేం పని ? బిహారీలను తరిమి కొట్టారు. అలా దాడులు చేసిన వారి వెనక ఉండి మీరే ప్రోత్సహించారు. అప్పటి ఉద్రిక్తతలకి మీదే బాధ్యత‘ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మేవానీ గట్టిగానే బదులిచ్చారు.. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉంటే, తనను నిందించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు.
గిరిరాజ్‌సింగ్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఒక మహా కవి చెప్పినట్టుగా కన్హయ్య కుమార్‌కు కెరటమే ఆదర్శం. పడినందుకు కాదు, పడినా లేచినందుకు. కన్హయ్య ఎన్నికల్లో గెలిచారా, ఓడారా అన్నది కాదు ముఖ్యం. ఒక కొత్త తరహా రాజకీయాలకు దారి చూపించిన యువకుడిగా ఆయన చరిత్ర సృష్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Comments
Please login to add a commentAdd a comment