కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్‌–నీల్‌ | CPM New agenda : Lal-Neal | Sakshi
Sakshi News home page

కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్‌–నీల్‌

Published Mon, Mar 20 2017 1:27 AM | Last Updated on Mon, Aug 13 2018 8:12 PM

కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్‌–నీల్‌ - Sakshi

కామ్రేడ్ల కొత్త ఎజెండా.. లాల్‌–నీల్‌

సామాజిక న్యాయానికి ఐక్య ఉద్యమాలు: ఏచూరి
హిందూ రాజ్యస్థాపన దిశగా మోదీ, సంఘ్‌ శక్తులు సందేశమిచ్చాయి
యూపీ పీఠంపై ‘యోగి’ని కూర్చోబెట్టడమే అందుకు నిదర్శనం
బీజేపీ, ఆరెస్సెస్‌ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి: కేరళ సీఎం విజయన్‌
ముగిసిన తమ్మినేని మహాజన పాదయాత్ర.. సరూర్‌నగర్‌లో సీపీఎం భారీ సభ


సాక్షి, హైదరాబాద్‌: సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఎరుపు, నీలం రంగు జెండాలను ఐక్యం చేస్తూ ప్రజా ఉద్యమాలను బలపరుస్తామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ను సీఎంగా చేయడం ద్వారా ప్రధాని మోదీ, ఆరెస్సెస్, సంఘ్‌ పరివార్‌ శక్తులు హిందూ రాజ్యస్థాపన దిశగా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయన్నారు. దళితులు, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై అగ్రకుల పెత్తందారీ విధానాలు అమలు కాబోతున్నాయని చెప్పారు.

ఈ శక్తులు అధికారంలోకి రావడం వల్ల సామాజిక న్యాయ సాధన మరింత దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ‘సంక్షేమ, సామాజిక న్యాయ సమర సమ్మేళనం’పేరిట నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి మాట్లాడారు. ‘‘ఇంద్రధనస్సులో మొదటనున్న ఎరుపు రంగు, చివరనున్న నీలం రంగు మధ్యలోని సమస్త రంగులు కలగలిసేలా ఉద్యమిద్దాం. సామాజిక న్యాయ సాధన కోసం ఈ ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు, హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తాం.

అన్ని రంగాలు, వర్గాలపై మోదీ ప్రభుత్వ దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. పోరాడి సాధించిన పథకాలు రద్దవుతున్నాయి. సబ్‌ప్లాన్‌ రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, ఇతర వర్గాలకు చెందిన రూ.73 వేల కోట్ల స్కాలర్‌షిప్పులు, బకాయిలు విడుదల చేయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారు. గోరక్ష సమితి ద్వారా దళితులు, మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. లాల్, నీల్‌ జెండాలు, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ నినాదం కలవకపోతే ఇలాంటి దాడులు తట్టుకునే పరిస్థితి ఉండదు’’అని ఆయన అన్నారు.

శనివారం నాగ్‌పూర్‌లో తన సభకు ఆరెస్సెస్, సంఘ్‌ పరివార్‌ శక్తులు అడ్డంకులు సృష్టించినా.. అక్కడే అంబేద్కర్‌ బుద్ధిజం స్వీకరించిన వీరభూమిలో ఎరుపు, నీలి జెండాలతో పాటు భగత్‌సింగ్‌ ఇంక్విలాబ్‌ నినాదాలతో ఉద్వేగభరితంగా సభ సాగిందని ఏచూరి చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ ఐక్యతను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ‘‘దేశవ్యాప్తంగా అంబేద్కర్, వామపక్ష భావజాలంతో సామాజిక న్యాయం నినాదంతో అన్ని శక్తులు కలసి పనిచేయడం మొదలైందని, ఇది నిర్నిరోధంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన 4,200 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను చైనాలో మావో నిర్వహించిన లాంగ్‌మార్చ్‌తో పోల్చారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం
ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్‌ తమ మిత్రుడిగా ఉన్నారని, ఆ తర్వాత మారిపోయారని ఏచూరి అన్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజా సమస్యలపై సీఎంకు తమ్మినేని రోజూ లేఖలు రాశారని, కేసీఆర్‌ ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలం గాణ సాయుధ పోరాటం భూసమస్యను దేశం ఎజెండాగా మార్చిందని, ఇక్కడ పోరాటాలు జరిగితే అవి దేశమంతా ప్రభావితం చేస్తాయ న్నారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి సభకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీ లను అమలు చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: విజయన్‌
బీజేపీ, సంఘ్‌ శక్తులు దేశాన్ని కాషాయీకరణ దిశగా తీసుకెళ్లేందుకు మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్‌ మండిపడ్డారు. సీపీఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘కాషాయీకరణతో దళితులు, మైనారిటీలతోపాటు మహిళలు కూడా తీవ్ర నిర్భందానికి, ఒత్తిళ్లు, కట్టుబాట్లకు గురవుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. సంఘ్‌ అరాచకాల వల్లే రోహిత్‌ వేముల, ముత్తుకృష్ణ వంటి తెలివైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. కేంద్రం వినాశకరమైన విధానాలు అమలు చేస్తోంది. కేంద్రానికి రాష్టాలన్నా, రాష్ట్రాల హక్కులన్నా గౌరవం లేదు. దక్షిణాదిపై కక్ష కట్టింది. అందుకే ఈ రాష్ట్రాల్లో అశాంతి రేపాలని చూస్తోంది. భోపాల్‌లో, మంగళూరులో నా ఉపన్యాసాన్ని అడ్డుకోవాలని చూశారు. హైదరాబాద్‌ సభను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. వీటికి భయపడేది లేదు. మత ఘర్షణలు, పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ, ప్రతిపక్షాల అనైక్యత కారణంగానే యూపీలో బీజేపీ గెలిచింది’’అని విజయన్‌ అన్నారు.

తెలంగాణలో సామాజిక న్యాయం లేదు
ఉమ్మడి రాష్ట్రంలో అసమానతలపై పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలోనూ సామాజిక న్యాయం అమలు కావడం లేదని, కొందరు రాజకీయవేత్తలు భారీగా ఆస్తులను కూడబెట్టుకుంటున్నారని కేరళ సీఎం విజయన్‌ విమర్శించారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ వాటిని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement