చెప్పేదొకటి.. చేసేదొకటి..
మల్లన్న సాగర్ విషయంలో ప్రభుత్వ తీరుపై తమ్మినేని ధ్వజం
సాక్షి, హైదరాబాద్ : ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చే స్తున్న పనులకు పొంతన లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో రైతులకు.. కేంద్ర భూసేకరణ చట్టం-2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉందన్నారు. కేంద్ర భూసేకరణ చట్టాన్ని పక్కన పెట్టి జీవో 123 ప్రకారమే బలవంతంగా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాల ద్వారా సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు.
ఈ విషయంలో కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వ్యవహరిస్తున్న తీరు నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో రైతులను ఆందోళనల్లో పాల్గొనకుండా పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడుతున్నారని, ప్రభావిత ప్రాంతాలకు వెళ్లే నాయకులను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇది పోలీసు రాజ్యమా, ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మంగళవారం ఎంబీ భవన్‌లో రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం సందర్భంగా పార్టీ నాయకులు జూలకంటి రంగారెడ్డి, చుక్క రాములు, సున్నం రాజయ్య, బి.వెంకట్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడే ప్రజల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోందని, భూసేకరణ సమస్యపై కదిలేందుకు సన్నద్ధత కనబడుతోందని ఒక ప్రశ్నకు తమ్మినేని బదులిచ్చారు. రాష్ర్టవ్యాప్తంగా భూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 26న ఇందిరాపార్కు వద్ద భూనిర్వాసితుల రాష్ట్రవ్యాప్త మహాధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటించిందన్నారు.
ఆగస్టులో పార్టీ ప్లీనం సమావేశాలు
ఆగస్టు 16, 17, 18 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పార్టీ ప్రత్యేక ప్లీనం సమావేశాలకు ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, నాయకులు రామచంద్ర పిళ్లై, బీవీ రాఘవులు హాజ రవుతారు. కోల్‌కతాలో జరిగిన అఖిల భారత ప్లీనంలో పార్టీ నిర్మాణంపై నిర్ణయాలు చేసినట్లు తమ్మినేని తెలిపారు. పార్టీ నిర్మాణ లోపాలు,వాటి సవరణకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిం చారన్నారు.