lalaguda police station
-
HYD: తార్నాకలో గ్యాంగ్‌రేప్, ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: తార్నాకలో ఘోరం జరిగింది. లిఫ్ట్ పేరిట ఒక మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు ఐదుగురు. నిందితుల అరెస్ట్‌తో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లాలాగూడ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి సమయంలో మహిళను తార్నాకలో వదిలిపెడతానంటూ మధు అనే వ్యక్తి నమ్మబలికాడు. తన స్కూటీపై ఎక్కించుకుని ప్రశాంత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఫోన్ చేసి తన నలుగురు స్నేహితుల్ని రప్పించుకుని ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో మధు యాదవ్, బర్నా యేసు, సిరిగిరి ప్రశాంత్‌కుమార్, పస్తం తరుణ్‌కుమార్, కేశోజువా రోహిత్‌లపై కేసు నమోదు చేసుకున్నారు లాలాగూడ పోలీసులు. ప్రశాంత్.. మధుసూదన్.. రోహిత్ తరుణ్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి..
సాక్షి, హైదరాబాద్: బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన తల్లీకూతుళ్లు అదృశ్యమైన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సురేష్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేటలోని గవర్న్మెంట్ స్కూల్ సమీపంలో నివాసముంటున్న సయ్యద్ అసీమ్, ఆఫ్రీన్ బేగం దంపతులు. వీరికి 8 నెలల అయాత్ అనే కూతురు సంతానం. ఈ నెల 6న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆఫ్రీన్ బంధువుల ఇంటికి వెళ్లొస్తానని చెప్పి తన కూతురు అయాత్ను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆఫ్రీన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. బంధువులను, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం కనిపించకపోవడంతో లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లాలాపేట: బాలుడు అదృశ్యమైన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన వరుణ్(10) ఈ నెల 5న మాణికేశ్వర్‌నగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి తల్లిదండ్రులతో కలిసి వచ్చాడు. తిరిగి వెళ్తామని అనుకుంటున్న సమయంలో ఈ నెల 6న మధ్యాహ్నం ఇంటి బయట ఆడుకుంటున్న వరుణ్ కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిననా ఫలితం లేదు. దీంతో తండ్రి యశ్వంత్ ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిరాద్యు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం
హైదరాబాద్: టైలర్ షాపునకు వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...లాలాగూడలోని సూపర్‌స్టార్ హోటల్ సమీపంలో నివసించే శంషుద్దీన్ కూతురు నాజియా(19) ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో టైలర్ షాపునకు వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన నాజియా రాత్రయిై నా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు స్నేహితులను, బంధువులను, తెలిసిన వారిని నాజియా గురించి వాకబు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో శనివారం స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబునాయుడు నగర్లో పోలీసుల హచ్‌చల్
హైదరాబాద్: నగరంలోని లాలాగూడ పోలీసుస్టేషన్ పరిధిలోగల చంద్రబాబునాయుడునగర్లో శుక్రవారం రాత్రి పోలీసులు హల్ చల్ చేశారు. అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టవేసే క్రమంలో నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని చంద్రబాబునాయుడు నాయుడు నగర్ లో నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వంర్యంలో దాదాపు వంద మంది పోలీసులు బస్తీలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి వ్యక్తి ఆధార్ కార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఆధారాలు లేని మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ మాట్లాడుతూ అనుమానితులు ఎవరైనా తారసపడితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఏసీపీ, లాలాగూడ సీఐ కరణ్కుమార్సింగ్తో పాటు మరో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 30 మంది మహిళా పోలీసులు పాల్గొన్నారు.