సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా ఇన్‌స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్‌లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
కీలక విభాగాల్లో విధులు..
ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్‌లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్‌స్పెక్టర్‌గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు.
అన్ని స్టేషన్లలోనూ ఉండాలి
మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్‌హెచ్‌ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం.
– చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ
పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి
తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి.
– మహమూద్ అలీ, హోమ్ మంత్రి
రాష్ట్రంలో ముగ్గురే..
174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్‌హెచ్‌ఓ ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్‌స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా.
– మధులత, లాలాగూడ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment