లాలూ-నితీష్ మ్యాజిక్ పని చేసింది
పాట్నా : బీహార్లో లాలూ-నితీష్ల మ్యాజిక్ పని చేసింది. ఉప ఎన్నికల్లో వీరిద్దరూ తమ సత్తా చాటారు. నిన్న మొన్నటి వరకూ బద్ధ శత్రువుల్లా కయ్యాలకు కాలు దువ్వుకున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత ఉప ఎన్నికల్లో మళ్లీ చేతులు కలిపిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ కూటమి విజయదుందుభి మోగించింది.
బీహార్లో మొత్తం పది స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ఆరు స్థానాలను ఆర్జేడీ-జేడీయూ కైవసం చేసుకుంది. బీజేపీ నాలుగు స్థానాలతో సరిపెట్టుకుంది. దాంతో బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. దీర్ఘ కాలం పాటు బీహార్ రాజకీయాలను శాసించిన ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జెడి(యు) నేత నితీష్ కుమార్ ఒకే వేదికను పంచుకోవడం దాదాపు 23 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
కాగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ బీహార్లో పది స్థానాల్లోనాలుగు, కర్ణాటకలో మూడుస్థానాలకు గానూ ఓ స్థానాన్ని గెలిచింది. మధ్యప్రదేశ్లో మూడు స్థానాల్లో రెండింటిని బీజేపీ కైవసం చేసుకుంది.