నిద్రిస్తున్న కార్మికులపై దూసుకెళ్లిన లారీ
ముగ్గురు బీహార్‌వాసుల మృతి
సుల్తానాబాద్ : లారీ క్లీనర్ నిర్లక్ష్యం మూడు నిండుప్రాణాలను బలిగొంది. రివర్స్‌లో వచ్చిన లారీ నిద్రిస్తున్న కార్మికులపై నుంచి వెళ్లడంతో వారు మృత్యువాతపడ్డారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో శనివారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. బీహార్ రాష్ట్రం మస్తాపూర్ జిల్లా రోసేరా మండలం కల్యాణ్‌పూర్‌కు చెందిన 15 మంది కార్మికులు వారం క్రితం రైస్‌మిల్లులో పనిచేసేందుకు వచ్చారు. శుక్రవారం పని ముగిసిన తర్వాత భోజనాలు చేసి మిల్లు ఆవరణలో అందరూ ఒకే చోట వరుసగా పడుకున్నారు.
అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో మేడిపల్లిలోని ఐకేపీ సెంటర్ నుంచి ఓ లారీ మిల్లుకు ధాన్యం తీసుకొచ్చింది. హనుమాన్ దీక్ష స్వీకరించిన డ్రైవర్ మాలవితరణకు వెళ్లగా, క్లీనర్ సాయిలుకు లారీని అప్పగించాడు. అతడు నిద్రిస్తున్న కార్మికులను గమనించకుండా లారీని రివర్స్ తీసుకోవడంతో వెనుక చక్రాల కింద నలిగి దీప్‌సదా(20), శ్యాంసుందర్ సదా(25), సుకేందర్‌సదా(22) మృతిచెందారు.