‘ప్రమోద్’ గార్డెన్‌ను ప్రారంభించిన సీఎం
- మంత్రి సుభాష్, రేఖా మహాజన్ హాజరు
సాక్షి, ముంబై: దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ పేరిట దాదర్‌లో ఏర్పాటు చేసిన గార్డెన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. గార్డెన్ పనులన్నీ పూర్తయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా పలు కారణాల వల్ల ప్రారంభం కాలేదు. ప్రమోద్ మహాజన్ వర్ధంతిని పురస్కరించుకుని ఉద్యానవనాన్ని ఆదివారం ప్రారంభించినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ప్రారంభోత్సవానికి మంత్రి సుభాశ్ దేశాయ్, ప్రమోద్ భార్య రేఖా మహాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉద్యానవన నిర్వహణ బాధ్యతలను 2014 ఆగస్టు నుంచి చూస్తూ వస్తున్న బీఎంసీకి చెందిన సేవ్రేజ్ ఆపరేషన్స్ (ఎస్వో) విభాగమే చూసుకోనుంది.
కార్యక్రమంలో ఎంపీ పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. నగరవాసులకు పచ్చదనంతో కూడిన ఉద్యానవనం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. సేవ్రేజ్ ఆపరేషన్స్, ఉద్యాన వన విభాగానికి మధ్య సయోధ్య లేకపోవడం వల్ల ఉద్యానవన ప్రారంభం ఆలస్యం అయిందని చెప్పారు. ఉద్యానవనంలో మామిడి, కొబ్బరి, గుల్మోహర్, బన్యన్, రావి తదితర భారీ వృక్షాలు ఉన్నాయి. పూల కుండీల్లో సమారు 2.5 లక్షల మొక్కలు ఉన్నాయి. దీని అభివృద్ధికి దాదాపుగా రూ.30 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం.
75 శాతం కంటి వ్యాధులను నయం చేయొచ్చు!
‘కంటికి సంబంధించిన 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం, తగినన్ని మౌలిక సదుపాయాలు లేకపోవడం చాలా మందికి చికిత్స అందడం లేదు’ అని రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య శాస్త్రం పురోగతి చెందుతోందని, సాధారణ ప్రజానీకానికి వైద్య శాస్త్ర ఫలాలు అందించాలని కోరారు. యువ వైద్యులు ప్రజాసేవకు అంకితం కావాలనే ఆకాంక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. సబర్బన్ ముంబైలోని ‘అనిదీప్ కంటి ఆస్పత్రి’ని ఫడ్నవీస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో కంటి చూపు ఇవ్వడం కంటే గొప్ప దీవెన ఇంకోటి లేదు.
కళ్లు లేని వారికి చూపు ప్రసాదించడం కూడా దీవెన లాంటిదే. 75 శాతం వ్యాధులను నయం చేయవచ్చు. అయితే ప్రజల్లో వ్యాధులకు సంబంధించిన సరైన అవగాహన లేకపోవడం వల్లే ఆశించనంత మేర బాధితులకు సాయం జరగలేదు’ అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి దీపక్ సావంత్, ఆయన కుమారుడు ప్రముఖ సర్జన్ స్వప్నేశ్ సావంత్ తదితరులు పాల్గొన్నారు.