పీఎఫ్ లో మరో రగడ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) వ్యవహారంలో రోజుకో వివాదం రగులుతోంటే..తాజాగా మరో సరికొత్త విధానం అమలుకు సంస్థ రంగం చేసింది. పీఎప్ ముందస్తు ఉపసంహరణల నిరోధకం కోసం అంటూ చేపట్టిన 'ఒక ఉద్యోగికి ఒక భవిష్యనిధి ఖాతా పథకాన్ని' ఈ మే ఒకటి నుంచి అమల్లోకి తీసుకు రానుంది. దీనిద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలని సంస్థ భావిస్తోంది. దీంతో ఉద్యోగులు.. ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ ఖాతా తెరవాల్సిన అవసరముండదని, పీఎఫ్ సొమ్ము విత్ డ్రాయల్ తెరపైకి రాదని సంస్థ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
సుదీర్ఘంగా పీఎఫ్ అకౌంట్ నిర్వహిస్తే వచ్చే లాభాలను కల్పించడానికే ఈ నిర్ణయ తీసుకున్నట్టు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ చెబుతోంది. ఏప్రిల్ 21 న జరిగిన ఈపీఎఫ్ వో అంతర్గత సమావేశంలో మాట్లాడిన కమిషనర్ వీపీ జోయ్ ఈ విషయాన్నిఈ విషయాన్ని ధృవీకరించారు. మే 1 వతేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్ సేవలు మెరుగ్గా ఉంటే ..ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఈపీఎఫ్ లో చేరడానికి ఉత్సాహం చూపుతారన్నారు. పీఎఫ్ ఖాతాల నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని యజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. అటు ప్రావిడెంట్ ఖాతాల నిర్వహణలోకి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేసే దిశగా ఈపీఎఫ్ సంస్థ ఆలోచిస్తోంది. మున్సిపాలిటీల్లోని ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతాలు ఉండాలనే అభిప్రాయంతో ఆమేరకు చర్యలకు ఉపక్రమించింది.
పీఎఫ్ ఖాతా నిర్వహణ, పింఛన్ వంటవి వాటిని ఉద్యోగులకు అనుకూలంగా, మారిస్తే ఫీఎఫ్ ఖాతాలను సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తారని ఈఫీఎఫ్ సంస్థ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే 58 సంవత్సరాలలోపు పీఎఫ్ విత్డ్రాయల్స్పై నిషేధం విధించాలని ఆలోచన చేసింది. అయితే దేశ వ్యాప్తంగా దీనిపై ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో పునరాలోచనలో పడ్డ ఈఫీఎఫ్ సంస్థ ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఒక ఉద్యోగికి ఒకే పీఎఫ్ ఖాతా అన్న విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో గుర్రుగా ఉన్న ఉద్యోగులు దీనిపై ఎలా స్పందించనున్నారో చూడాలి.