law cet
-
రేపు ఏపీ లాసెట్–2024
ఏఎన్‌యూ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్– 2024 పరీక్షలను ఈ నెల 9న మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కన్వీనర్ ఆచార్య బి.సత్యనారాయణ తెలిపారు. మూడేళ్ల ఎల్ఎల్బీ, ఐదేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ లాసెట్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు.ఏపీ లాసెట్‌కు 23,425 దరఖాస్తులు వచ్చాయన్నారు. పురుషులు 15,374 మంది, మహిళలు 8,051 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులు https://cets. apsche.ap.gov.in ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్‌తోపాటు ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తేవాలన్నారు. పరీక్ష నిర్వహణ కోసం 105 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను జూన్ 9న మధ్యాహ్నం 1.00 నుంచి 2.30 గంటల వరకు అనుమతిస్తామన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. -
తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాసెట్-2023 ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఈ రిజల్ట్స్‌ను గురువారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. తెలంగాణలోని వివిధ యూనివర్సిటీలు, ప్రైవేట్ న్యాయ కళాశాలల్లోని మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుతో పాటు పీజీ ఎల్ఎల్ఎం కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ మే 25వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. 43,692 మంది దరఖాస్తు చేసుకోగా 36,218 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ☛ TS LAWCET-2023 ఫలితాల డైరెక్ట్ లింక్ ఇదే.. -
ఏపీ లాసెట్: అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఏపీ లాసెట్ 2021లో క్వాలిఫై అయిన విద్యార్థుల అడ్మిషన్స్ కోసం గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన AP LAWCET/APPG LAWCET లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈనెల 18 నుంచి 22 వరకు ఏపీ ఉన్నత విద్యామండలి వెబ్సైట్ sche.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. -
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, తిరుపతి: ఏపీ లాసెట్ పరీక్ష ఫలితాలు గురువారం విడదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. న్యాయ కళాశాలల్లో మూడు, ఐదేళ్ల న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఐదేళ్ల లా కోర్సులో 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని ఉన్నత విద్యామండలి చైర్మన్ తెలిపారు. ఏపీ లాసెట్-2021 ఫలితాల కోసం క్లిక్ చేయండి కాగా మూడేళ్ల లా కోర్సులో విజయవాడకు చెందిన మోపురు హరిప్రియ మొదటి ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన లీలా రాజా సెకండ్ ర్యాంక్.. కందలగడ్డ హరికృష్ణ మూడో ర్యాంకు సాధించారు. చీరాలకు చెందిన గొర్ల హారిబాబు, అనంతపురానికి చెందిన సాతర్ల మంజునాధ 4, 5 ర్యాంకులు సాధించారు. చదవండి: ఏపీ: ఇంజనీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ఐదేళ్ల లా కోర్సుల్లో ►మొదటి ర్యాంక్- మోనికా భాయి, బనగానపల్లె, కర్నూల్ జిల్లా. ►సెకండ్ ర్యాంక్- వెలిచేటి నాగ సాయి ప్రశాంతి, బంటుపల్లి, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా ►మూడో ర్యాంక్- ఇనపకుర్తి శ్రీనివాస సునీల్, బూడి వీధి పూసపాటి రేగడ, విజయనగరం జిల్లా, ►నాలుగవ ర్యాంక్-నర్మద భారతి, మాకవరపాలెం, విశాఖపట్నం. ►అయిదో ర్యాంక్- బొప్పరాజు వెంకట బ్రహ్మం, తర్ల పాడు, ప్రకాశం జిల్లా పీజీ లాసెట్‌లో ►మొదటి ర్యాంక్- యారబాల గీతిక, శివాజిపాలెం, విశాఖపట్నం ►సెకండ్ ర్యాంక్.- కాగడాల కృష్ణం నాయుడు, శ్రీకాకుళంజిల్లా.. ► మూడో ర్యాంక్, రరమేష్ బాబు తాత పూడి, విజయవాడ ► నాలుగో ర్యాంక్- మన్నం సుసన్యా, విజయవాడ ► అయిదో ర్యాంక్- సనతనా భారత్, శాంతి నగర్, నెల్లూరు -
Telangana: సెట్ల దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాసెట్ తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్ – 2021 దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. విద్యార్థులు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా వారు ఎంచుకున్న సమీప ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలు ఉంటుందని చెప్పారు. పీఈసెట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. టీఎస్ ఐసెట్ కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగించారు. పరీక్షకు ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతుండడం, కొన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు జరగకపోవడంవల్ల ఈ నెల 15వ తేదీతో ముగియనున్న గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో పెంచామని ఆయన పేర్కొన్నారు. -
మేలో ‘సెట్’ల పండుగ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌లో (బీఈ/బీటెక్‌లో) ప్రవేశాల కోసం 2020 మే 5, 6, 7 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను మంగళవారం ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. అనంతరం ఆ వివరాలను మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణతో కలసి చైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈసెట్, ఎంసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీజీలాసెట్ పీజీఈసెట్ నిర్వహణ తేదీలను కూడా ప్రకటించారు. మే 2వ తేదీన ఈసెట్‌తో ప్రవేశ పరీక్షలు ప్రారంభం అవుతాయని, అదే నెలలో అన్ని కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలను పూర్తి చేస్తామని తెలిపారు. జూలై నెలాఖరులోగా అన్ని కోర్సులకు కౌన్సె లింగ్ నిర్వహించి ప్రవేశాలను పూర్తి చేస్తామని, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడతామని వివరించారు. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన ఇంటర్మీడియట్ ఫలితాలు సకాలంలోనే వస్తుండగా, డిగ్రీ కోర్సుల పరీక్షలను వీలైనంత త్వరగా నిర్వహించి, ఫలితాలు వెల్లడించేలా చర్యలు చేపట్టాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తామని వివరించారు. గతంలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలు (లాసెట్ ద్వారా) ఆలస్యం కాగా, న్యాయ విద్య కాలేజీలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మూడేళ్లకు అనుబంధ గుర్తింపు నేపథ్యంలో ఈసారి వాటిని కూడా సకాలంలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులను బట్టి సెషన్స్ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్యను బట్టి సెషన్ల సంఖ్య ఉంటుందని పాపిరెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇంజనీరింగ్ ఎంసెట్‌ను 5 సెషన్లలో నిర్వహిస్తామని, ఒక్కో సెషన్లో 50 వేల మందికి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. గతేడాది ఇంజనీరింగ్ ఎంసెట్‌కు 1,42,210 మంది దరఖాస్తు చేసుకున్నారని, దాన్ని బట్టి ఈసారి 1.5 లక్షల్లోపు దరఖాస్తులు వస్తే 6 సెషన్లలో ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తామని చెప్పారు. అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్ ఎంసెట్‌ను అభ్యర్థుల సంఖ్యను బట్టి 3 లేదా 4 సెషన్లలో నిర్వహిస్తామన్నారు. ఎడ్‌సెట్‌కు దరఖాస్తులు 50 వేలు దాటితే 23తోపాటు 24న కూడా నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది ఈ సెట్స్ నిర్వహించిన యూనివర్సిటీలకే ఈసారి కూడా బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. సెట్స్ కన్వీనర్లను త్వరలోనే నియమిస్తామన్నారు. నిమిషం నిబంధన యథాతథం.. ఎంసెట్ తదితర సెట్స్ నిర్వహణలో నిమిషం నిబంధన యథావిధిగా ఉంటుందని పాపిరెడ్డి చెప్పారు. ఎంసెట్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్ష కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. వికలాంగులకు పరీక్ష ఫీజు తగ్గింపు అంశాన్ని ఆయా సెట్స్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మార్చిలో సెట్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామని తెలిపారు. ఈసారి నేషనల్ పూల్ లేదు.. ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను జాతీయ స్థాయి పరీక్ష ద్వారానే చేపట్టాలన్న నిబంధన ఈసారి లేదన్నారు. రాష్ట్ర సెట్స్ ద్వారానే ప్రవేశాలు చేపడతామన్నారు. ఒకవేళ కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్ ద్వారానే అన్ని రాష్ట్రాల్లో ప్రవేశాలు చేపట్టాలని తప్పనిసరి చేస్తే దాన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఏడాది ముందుగానే ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్ట సవరణతోనే విదేశీ వర్సిటీలు ప్రస్తుతం ఉన్న పార్లమెంటు చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం విదేశీ యూనివర్సిటీలు దేశంలో యూనివర్సిటీ లేదా ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం కేంద్రం తెస్తున్న నూతన విద్యా విధానంలో ఆ అంశంపై చర్చిస్తోందని, అందులో ఓకే చెబితే విదేశీ యూనివర్సిటీలు వచ్చే అవకాశం ఉందన్నారు. -
ఏప్రిల్ 27న పాలిసెట్
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్కోర్సులకు సంబంధించి 2016 ఏప్రిల్ 27న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు సాంకేతిక విద్యామండలి తేదీని నిర్ణయించింది. ఈ పరీక్ష ఫలితాలను మే 9న ప్రకటించి అనంతరం ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. ఇలా ఉండగా ఐసెట్ కన్వీనర్‌గా ఆంధ్రాయూనివర్సిటీ మేనేజ్మెంటు విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎం.రామ్మోహనరావును నియమించారు. లాసెట్ కన్వీనర్‌గా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారెడ్డిని నియమిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి ఆదేశాలు ఇచ్చారు. కీలకమైన ఎంసెట్ నిర్వహణకు సంబంధించిన వివిధ కమిటీలను ఈనెలాఖరులోగా ఏర్పాటుచేయనున్నారు. నాగార్జునవర్సిటీ వీసీగా మురళీకృష్ణ పేరు ఖరారు ఇలా ఉండగా నాగార్జునవర్సిటీ ఉపకులపతిగా ఆచార్య అయ్యంకి వెంకట మురళీకృష్ణ పేరును ఖరారు చేస్తున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్టీయూలో రిమోట్‌సెన్సింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాగార్జున వర్సిటీ వీసీ ఎంపికకు సంబంధించి సెర్చికమిటీ ఇంతకు ముందు ఆచార్య ఆర్.వెంకటరావును ఎంపికచేయడం, ఆయన బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించడం తెలిసిందే. దీంతో అదే సెర్చికమిటీని మరోసారి సమావేశమై ప్రభుత్వానికి మళ్లీ నివేదికను అందించింది. ఇందులోని మురళీకృష్ణ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదంతో త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
తెలంగాణ లాసెట్-2015 ప్రవేశపరీక్ష ప్రారంభం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం లాసెట్-2015 ప్రవేశపరీక్ష ప్రారంభమైంది. ఎల్ఎల్బీ మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులు, ఎల్ఎల్ఎం కోర్సులో 2015-16 ప్రవేశాలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 19,291మంది విద్యార్థులు లాసెట్ రాస్తున్నారు. మూడేళ్ల లా కోర్సుకు గోదావరి, అయిదేళ్ల కోర్సుకు శాతవాహన, ఎల్ఎల్ఎం కోర్సుకు భద్రాద్రి ప్రశ్నాపత్రాలను ఎంపిక చేశారు. ఎల్ఎల్బీ మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఎల్ఎల్ఎం కోర్సుకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. -
19న తెలంగాణ లాసెట్
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సులో ప్రవేశాలకు, ఎల్ఎల్ఎంలో ప్రవేశాలకు లాసెట్‌ను ఈనెల 19న నిర్వహించనున్నట్లు లాసెట్ కన్వీనర్, కేయూ లా కళాశాల ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు తెలిపారు. మొత్తం 19,135 మంది అభ్యర్థుల కోసం తొమ్మిది రీజినల్ సెంటర్లలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఎల్బీ మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుకు ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఎల్ఎల్ఎం కోసం 1516 మంది దరఖాస్తు చేసుకోగా వీరికోసం రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 19న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష జరగనుందని వెల్లడించారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను డబ్లూడబ్లూడబ్లూటీఎస్ లాసెట్. ఓఆర్జీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. (కేయూ క్యాంపస్) -
మే 30న ‘లాసెట్’ రాత పరీక్ష
అనంతపురం: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల బీఎల్, ఐదేళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ, రెండేళ్ల పీజీ ఎల్ఎల్ఎం, ఎంఎల్ ప్రవేశాలకు నిర్వహించే ‘లాసెట్-2015’ రాత పరీక్షలను మే 30న నిర్వహించనున్నట్లు లాసెట్ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య శేషయ్య వెల్లడించారు. ఎస్కేయూలోని ఏపీ లాసెట్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రూ.350 ఫీజుతో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 7 వరకు రూ.500, మే 15 వరకు రూ.1,000, మే 23 వరకు రూ.1,500 అపరాధ రుసుంతో దరఖాస్తు చేయడానికి వెసులుబాటు కల్పించినట్లు వివరించారు. -
22న లాసెట్ స్పాట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: లాసెట్ స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 22న హైద రాబాద్లోని బషీర్‌బాగ్ పీజీ కాలేజీలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఎల్ఎల్బీ 3, 5 సంవత్సరాలు, ఎల్ఎల్ఎం కోర్సులలో ప్రవేశానికి లాసెట్‌కు హాజరైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్లో చూడొచ్చు రేపటితో ముగియనున్న ‘సెట్’ దరఖాస్తుల స్వీకరణ తెలంగాణ, ఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను 24వ తేదీ వరకు అందచేయవచ్చు.