layola college
-
ఎన్ని విమర్శలు వచ్చినా.. విద్యార్థులకు మంచి చేయాలనేదే లక్ష్యం
సాక్షి, విజయవాడ: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు సంస్కరణలు తీసుకువచ్చి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ ఆంధ్రా లయోలా కాలేజీలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు ఇచ్చే ఆస్తి విద్య ఒక్కటే అనే విధానంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందులో భాగంగా విద్యా రంగంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మొదట అమలు చేసేది ఆంధ్రప్రదేశ్‌లోనేనని వ్యాఖ్యానించారు. మేధావులు, విద్యావేత్తలు అయిన సి.వి.రామన్, అబ్దుల్ కలాం, రామానుజన్ జీవితాలను ప్రతి ఒక్క విద్యార్ధి ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. విద్యార్థులంతా తమ దైనందిన కార్యక్రమాల్లో సైన్సుకు సంబంధించిన అంశాలను గుర్తించి.. వాటిపై పరిశోధనలు చేసే స్థాయికి రావాలన్నారు. ఏపీ ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా విద్యార్థుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని.. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాదీవెన వంటి పథకాలు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయన్నారు. విద్యా రంగంలో చేస్తున్న మార్పుల వల్ల విమర్శలు వస్తున్నా.. లెక్క చేయకుండా విద్యార్థులకు మంచి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. విద్యార్థులు మరింత హుందాగా కనిపించాలన్న యోచనతో వచ్చే సంవత్సరం విద్యార్థుల యూనిఫామ్‌లో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గతంలో ఢిల్లీలో విద్యా విధానం బాగుందని వార్తల్లో చూసే వాళ్ళం.. నేడు ఏపీలో ఢిల్లీని మించిన విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు. సమాజ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తు ప్రధాన ఆశయంగా పాఠశాల విద్యను మరింత ముందుకు తీసుకెళ్తామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించనున్న ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల మూడవ జాతీయ క్రీడల ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడొద్దని రాష్ట్ర గురుకుల సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే స్పష్టంచేశారు. విజయవాడ లయోలా కళాశాలలో ఈ క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 22 వరకు జరగనున్న క్రీడల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కళాశాల ప్రాంగణంలోని ఫుట్ బాల్, హాకీ, బాస్కెట్ బాల్ కోర్టులను పరిశీలించిన కాంతిలాల్ దండే అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఫాదర్ జీఏపీ కిశోర్, సీనియర్ అథ్లెటిక్ కోచ్ వినాయక్ ప్రసాద్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, గిరిజన సంక్షేమ, శాప్ అధికారులు ఉన్నారు. (చదవండి: చెత్తతో ‘పవర్’ ఫుల్) -
‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’
చెన్నై : చెన్నై లయోలా కాలేజీలో నిర్వహించిన ఓ ఆర్ట్ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఈ నెల 19, 20 తేదిల్లో కాలేజీలో ‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ పేరుతో ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించారు. ‘అక్మే బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించడం కోసం ఉద్దేశించిన ఈ ఫెస్టివల్ వివాదాస్పదంగా మారింది. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలు, వాటి క్యాప్షన్లు ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని కించపరిచేలా ఉండటమే ఇందుకు కారణం. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని చిత్రాలకు ‘భారత్ మాతా కూడా మీటూ బాధితురాలే’, ‘రచయిత గౌరీ లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్కు సంబంధం ఉంది’, ‘పీఎం మోదీ సామ్రాజ్యవాదాన్ని అనుసరిస్తారు’ అంటూ వివాదాస్పద క్యాప్షన్లు పెట్టారు. దాంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమా ఆనంద్ అనే మహిళ మాట్లాడుతూ.. ‘‘స్ట్రీట్ అవార్డ్ ఫెస్టివల్’ అని చెప్పారు. కానీ ఇక్కడ పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి. స్ట్రీట్ అవార్డ్స్ అంటే.. మన జాతీయ చిహ్నాలను.. దేశ ప్రధానిని అవమానించడమేనా’ అని ప్రశ్నించారు. మరో బీజేపీ కార్యకర్త మాట్లాడుతూ.. ‘లయోలా కాలేజీ కేంద్రం నుంచి నిధులు పొందుతుంది. కానీ ఇక్కడ లౌకిక భావనను పూర్తిగా దెబ్బ తీస్తున్నారు. జాతీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ‘ఒక వేళ కాలేజీ యాజమాన్యమే ఇలాంటి కార్యకలపాలను ప్రోత్సాహిస్తుందని తెలిస్తే.. కేంద్రం నుంచి కాలేజికి వచ్చే నిధులను నిలిపివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరతామ’ని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాలేజీ ప్రాంగణాన్ని తప్పుడు కార్యక్రమాల కోసం దుర్వినియోగం చేసినందుకు తాము ఎంతో బాధపడుతున్నామని.. క్షమించమని కోరింది. -
రేపటి నుంచి అంతర్జాతీయ సదస్సు
గుణదల (రామవరప్పాడు ) : అంతర్జాతీయ సదస్సు ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ జీఏపీ కిషోర్ తెలిపారు. కళాశాలలో సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. కిషోర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి, 2016ను అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సదస్సు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యవసాయం, ఆహారం, పర్యావరణ శాస్త్ర రంగాల్లో నూతన విధానాలు అనే అంశంపై మూడు రోజుల పాటు సదస్సు ఉంటుందని చెప్పారు. పోగ్రాం కన్వీనర్ శివకుమారి మాట్లాడుతూ మెట్ట పంటలైన కంది, మినుము, పెసర వంటి పలు పప్పు ధాన్యాల సమగ్ర యాజమాన్య పద్ధతులు, పలు రకాల కొత్త వంగడాల గురించి అవగాహన ఉంటుందన్నారు. ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో కరస్పాండెంట్ ఫాదర్ రాజు, వైస్ ప్రిన్సిపాల్ మిల్కియార్, హెచ్వోడీలు పీ శ్రీనివాసరావు, కవిత, గ్లోరి పాల్గొన్నారు. -
అశ్వ రాజసం
అశ్వం.. శక్తికి, వేగానికి ప్రతీక. కదనరంగంలో అయినా.. రేసు మైదానంలో అయినా దానికదే సాటి. వింటిని విడిచిన బాణంలా దూసుకుపోతుంది. ఈ గుర్రాలు కూడా అంతే.. పైగా వీటికి విద్యార్థుల వేగం తోడైంది. మరి ఊరుకుంటాయా? ఏమో గుర్రం ఎగురవచ్చు.. అన్నట్టు ఎగురుతూ దూకుడు ప్రదర్శించాయి. విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌లో బుధవారం గుర్రపు స్వారీ ప్రదర్శన జరిగింది. 2017, జనవరిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో లయోల విద్యార్థులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయోల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఏపీ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాహస ప్రవృత్తిని వెలికితీసేందుకు గుర్రపు స్వారీ ఎంతో దోహదపడుతుందన్నారు. మానసిక దృఢత్వాన్ని కలిగిస్తుందని చెప్పారు. మరో అతిథి, మూడో అశ్వకదళ కమాండింగ్ అధికారి కర్నల్ ఎస్.ఎల్ బఘేల్ మాట్లాడుతూ గుర్రపుస్వారీ విన్యాసం విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడమే కాకుండా వారిమీద నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. అనంతరం ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ఎన్సీసీ మొమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీజీ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ రెక్స్ ఏంజిలో, డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ మెల్కియెర్, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, అశ్వికదళ ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ సురేష్‌బాబు, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ వి.చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ (గుణదల) -
ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి
విజయవాడ (గుణదల) : ప్రతి విద్యార్థి శక్తివంతమైన శాస్త్రవేత్త కావాలని మాజీ డీజీపీ ప్రసాదరావు అన్నారు. ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు తెలుసుకోవడటం వల్ల నూతన ఆలోచనలు వస్తాయని చెప్పారు. ఇంటర్మీడియెట్ సైన్స్ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేదుకు నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయిలో మూడు రోజులపాటు నిర్వహించే ‘ఇన్స్పైర్–16’ కార్యక్రమాన్ని అయన సోమవారంప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలని చెప్పారు. దేశ అభ్యున్నతికి ఉపయోగపడే హేతుబద్ధమైన, వివరణాత్మకమైన ప్రయోగాలను చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ప్రశ్నించే తత్వం ఉండాలన్నారు. ప్రశ్నల ద్వారానే నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏఎస్ రాఘవేంద్రరావు మాట్లాడుతూ భూమి మీద మొక్కలు చాలా ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరికి ఆహారం, గాలి, ఆరోగ్యం, ఆయిల్, సువాసన, సంతోషాన్ని అందిస్తాయని వివరించారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వచ్చిన మహేంద్రకుమార్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శరీరక ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. మానసిక అనారోగ్యం వల్ల ఎక్కువ పనులు చేయలేరన్నారు. అనంతరం విద్యార్థులకు భౌతిక, రసాయన, గణిత, వృక్ష, జంతు శాస్త్ర విభాగాల నిపుణులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తొలుత కాలేజీ ఆవరణలో ప్రసాదరావు మొక్కలు నాటారు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డి.వెంకటసతీష్, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
అలరించిన ‘భావన–2016’
-
నేటి నుంచి లయోలాలో ‘స్పందన’
విజయవాడ(గుణదల): ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో దాగిఉన్న సృ జనాత్మతను వెలికితీసేందుకు ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ జీపీఏ కిషోర్lచెప్పారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 7, 8 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో 17 ఈవెంట్లలో 11 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు పాల్గొంటున్నారని లె లిపారు. 8వ తేదీన జరిగే ముగింపు వేడుకలకు సినీడైరెక్టర్, నటుడు ఎం.నరేష్కుమార్ హాజరవుతారని తెలిపారు. అనంతరం ఆయన స్పందన–2016 బ్రోచర్‌ను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ విభాగం ప్రిన్సిపాల్ ఫాదర్ చిన్నప్ప అధ్యాపకులు కృష్ణార్జున, నిర్మలకుమారి, ఎలీషా పాల్గొన్నారు. -
బాస్కెట్‌బాల్ విజేత లయోలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ఇంటర్ కాలేజ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో లయోలా డిగీ కాలేజ్ (అల్వాల్) విజేతగా నిలిచింది. సిటీ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో లయోలా 75-40 స్కోరుతో భవాన్‌స డిగ్రీ కాలేజ్ (సైనిక్‌పురి) పై విజయం సాధించింది. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సి. మంజులత విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహక కార్యదర్శి నర్సింగరావు, సునీల్ కుమార్, జేసీ బాబు, రవిప్రసాద్, వెంకటేశ్వరరావు, రాజేశ్ కుమార్ తదితరులు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆలస్యంగా వెలుగులోకి విద్యార్థుల ఘర్షణ
అల్వాల్: అల్వాల్‌లోని ఓ ప్రైవేటు విద్యాసంస్థ విద్యార్థులు వారం రోజుల క్రితం రోడ్డుపై సృష్టించిన హంగామా గురువారం మీడియాలో హల్చల్ చేసింది. వివరాలలోకి వెళితే... అల్వాల్‌లోని లయోలా కళాశాల విద్యార్థులు వారం రోజుల క్రితం కళాశాల సమీపంలో రోడ్డుపై సీనియర్ విద్యార్థులు కొందరు జూనియర్లు తమకు గౌరవం ఇవ్వడంలేదని కొట్టారు. ఈ విషయం తెలిసిన యాజమాన్యం విద్యార్థులను మందలించి చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కాని ఇరు వర్గాలలో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం బయటకు రాలేదు. గురువారం మీడియాలో సంఘటన జరిగిన రోజు దగ్గరలోని సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను ప్రసారం చేయడంతో పోలీసులులు, విద్యాసంస్థ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా సంఘటన ప్రసారంలో ర్యాగింగ్ అంటూ మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేసిందని విద్యాసంస్థల నిర్వహకులు ఆరోపించారు. -
నేడు రాష్ట్రపతి చెన్నై రాక
టీ,నగర్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం చెన్నైకు రానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకుంటున్న ఆయన, అక్కడి నుంచి ఎంఆర్సీ నగర్ లీలం ప్యాలెస్ నక్షత్ర హోటల్లో జరిగే ఇంజినీర్ల సదస్సులో పాల్గొననున్నారు. తర్వాత ఒంటి గంటకు అక్కడి నుంచి బయలుదేరి నుంగంబాక్కం లయోలా కళాశాలకు చేరుకుని కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో కార్యక్రమాలు ముగించుకుని విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాక సందర్భంగా ఆయన వెళ్లే మార్గాలలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముగ్గురు అడిషనల్ కమిషనర్లు, ఏడుగురు జాయింట్ కమిషనర్లు, 11 మంది డెప్యూటీ కమిషనర్లు సహా 3,500 మంది భద్రతా విధుల్లో నిమగ్నమవుతున్నారు.