అశ్వ రాజసం
అశ్వం.. శక్తికి, వేగానికి ప్రతీక. కదనరంగంలో అయినా.. రేసు మైదానంలో అయినా దానికదే సాటి. వింటిని విడిచిన బాణంలా దూసుకుపోతుంది. ఈ గుర్రాలు కూడా అంతే.. పైగా వీటికి విద్యార్థుల వేగం తోడైంది. మరి ఊరుకుంటాయా? ఏమో గుర్రం ఎగురవచ్చు.. అన్నట్టు ఎగురుతూ దూకుడు ప్రదర్శించాయి. విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల ఫుట్‌బాల్ గ్రౌండ్స్‌లో బుధవారం గుర్రపు స్వారీ ప్రదర్శన జరిగింది. 2017, జనవరిలో ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో లయోల విద్యార్థులు కూడా పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయోల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఏపీ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సాహస ప్రవృత్తిని వెలికితీసేందుకు గుర్రపు స్వారీ ఎంతో దోహదపడుతుందన్నారు. మానసిక దృఢత్వాన్ని కలిగిస్తుందని చెప్పారు. మరో అతిథి, మూడో అశ్వకదళ కమాండింగ్ అధికారి కర్నల్ ఎస్.ఎల్ బఘేల్ మాట్లాడుతూ గుర్రపుస్వారీ విన్యాసం విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడమే కాకుండా వారిమీద నమ్మకాన్ని కలిగిస్తుందన్నారు. అనంతరం ఈ ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులకు ఎన్‌సీసీ మొమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పీజీ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ రెక్స్ ఏంజిలో, డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ మెల్కియెర్, డాక్టర్ గుమ్మా సాంబశివరావు, అశ్వికదళ ఎన్‌సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ సురేష్‌బాబు, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ వి.చిన్నప్ప తదితరులు పాల్గొన్నారు. - విజయవాడ (గుణదల)