LBnagar police
-
ఆస్తి కోసమే ప్రత్యూషపై వేధింపులు?
పైశాచికానికి పాల్పడిన పినతల్లికి రిమాండ్ హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ ఆనందనగర్‌కు చెందిన ప్రత్యూషను గృహ నిర్బంధం చేసి చిత్ర హింసలకు గురిచేసిన ఆమె సవతి తల్లి చాముండేశ్వరిని గురువారం ఎల్బీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా బీఎస్ఎన్ఎల్లో ఏఈగా పనిచేస్తున్న యువతి తండ్రి రమేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. చాముండేశ్వరి ప్రత్యూషను ఏడాది కాలంగా చిత్రహింసలకు గురిచేస్తుండగా అందుకు రమేష్ సహకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మానవహక్కుల కమిషన్, పోలీసులు బాధితురాలి ఇంటిపై దాడిచేసి ఆమెను బుధవారం గృహనిర్బంధం నుంచి విముక్తికలిగించిన సంగతీ విదితమే. ఈ కేసులో చాముండేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రమేష్‌ను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ప్రత్యూష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి ఆస్తిపై కన్నేసినందునే ఈ కేసులో ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకే సవతి తల్లి ఆమెపై అకృత్యాలకు దిగినట్లు తెలుస్తోంది. 2003లో రమేష్‌కుమార్ మొదటి భార్య సరళాదేవి భర్తతో విడిపోయే సమయంలో పద్మారావునగర్‌లో ఉన్న శ్రీరామ్ సీతమ్స్ అపార్ట్మెంటులో ఉన్న ప్లాటును వారి కుమార్తె ప్రత్యూష పేరుమీద రాయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం సరళాదేవి మృతి చెందింది. ఈ క్రమంలో ప్రత్యూషను బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్పించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరడంతో తండ్రి రమేష్ బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో తన ఇంటికి తెచ్చాడు. అయితే పద్మారావునగర్ ప్లాటు విలువ సుమారు రూ.కోటి ఉండడంతో ఆ ఆస్తి ప్రత్యూషకు దక్కుతుందేమోనన్న భయంతో రమేష్ రెండో భార్య చాముండేశ్వరి యువతిని చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనలో రమేష్‌కుమార్ అరెస్ట్ అయితే పూర్తి వివరాలు తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
45 తులాల బంగారం పైనే ఎత్తుకెళ్లారు..
పోలీసులకు ఫిర్యాదు చేసిన యజమాని నాగోలు: కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోని నగలు చోరీ చేసి.. ఆపై నిప్పుపెట్టిన ఘటనలో 45 తులాలకు పైనే బంగారం చోరీ అయినట్టు తేలింది. అబూదాబీ నుంచి ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఇంటి యజమాని గొట్టేటి గంగయ్య ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం... ఎల్బీనగర్ నవోదయకాలనీకి చెందిన జి.గంగయ్య, సరళ భార్యాభర్తలు. గంగయ్య అబూదాబీలో కెమికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన పెద్ద కుమారుడు రఘువీర్ పాలెం బస్సు ప్రమాదంలో చనిపోయాడు. అమెరికాలో ఉంటున్న మరో కుమారుడు, కుమార్తె వద్దకు గంగయ్య భార్య గత సెప్టెంబర్‌లో వెళ్లింది. ఈ క్రమంలో ఆమె కొంత బంగారాన్ని లాకర్లో పెట్టి.. మిగతా 45 తులాల బంగారాన్ని ముంబైలో ప్రత్యేకంగా తయారు చేయించిన బీరువాలో భద్రపరిచి అమెరికా వెళ్లింది. ఇంటి బాధ్యతలను సమీపంలో ఉండే నల్లగొండ జిల్లా చందుభట్లకు చెందిన ఎల్లయ్యకు అప్పగించారు. ఇదే ఇంట్లో సరళ సోదరి గంగ కొన్ని రోజులు ఉండి టెట్ పరీక్షకు సిద్ధమై వెళ్లిపోయింది. శనివారం తెల్లవారుజామున గంగయ్య ఇంట్లో నుంచి పొగ రావడంతో స్థానికులు గమనించి ఫైరింజిన్, ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎల్లయ్య వచ్చి తాళం తీసి చూడగా ఇంట్లోని బీరువా పగులగొ ట్టి ఉంది. ఇంట్లోని చీరలు, కంప్యూటర్, ఏసీ, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఈ విషయాన్ని అబుదాబీలో ఉండే గంగయ్యకు సమాచారం అందించాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న గంగయ్య బీరువాలో దాచిన 45 తులాల బంగారు నగలు, మూడు ల్యాప్‌టాప్‌లు, అర కేజీ వెండి, మూడు కెమెరాలు చోరీకి గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇంత పెద్ద చోరీ జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.