Leaves of the trees
-
ఆకులతో డిజైనర్ డ్రెస్..
చాలా మంది విలువైన డిజైనర్ డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. కొంతమందేమో చాలా సింపుల్‌గా ఉన్నా చాలు సరిపోతుంది. సరిగ్గా ఇదే కోవలోకి వస్తారు ఈ ఫొటోలోని యువతులు. తూర్పు చైనాలోని హెఫె యూనివర్సిటీకి చెందిన నలుగురు డిజైనర్ డ్రెస్‌ను తలదన్నేలా ఎలాంటి ఖర్చు లేకుండా డ్రెస్ రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఎందుకంటే ఈ డ్రెస్‌ను కేవలం చెట్ల ఆకులతో డిజైన్ చేశారంటే నమ్మగలమా!! కానీ ఇది అక్షరాల నిజం.. వారం రోజులుగా చైనీస్ సోషల్ మీడియాలో ఈ ఫొటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆరు వేల ఆకులు, కొన్ని దారాలు, విపరీతమైన శ్రమ ఖరీదు చేసి తయారు చేశారు. ఈ డ్రెస్ ఇంత అందంగా రూపుదిద్దుకోవడానికి దీని వెనుక ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల కృషి ఉంది. ఆరు నెలల క్రితం వచ్చిన ఒక ఆలోచన వల్ల ఈ డ్రెస్ రూపుదిద్దుకుంది. యూనివర్సిటీలో ఏటా జరుగబోయే ఒక సదస్సుకు అక్కడి వారందరూ చాలా ఖరీదైన డ్రెస్‌లు వేసుకుని వస్తారు. అయితే అందరి దృష్టిని తమ వైపు ఎలా మరల్చాలి అని ఆలోచిస్తున్న తరుణంలో వీళ్లకు ఈ ఆకుల డ్రెస్ ఐడియా వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా వారి టీచర్ వద్దకి పరిగెత్తుకెళ్లి చెప్పారు. కానీ ఆ టీచర్ కాస్తా ఇది సాధ్యమయ్యే పనేనా అంటూ వారిని నిరాశకు గురిచేశారు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా వాళ్లు ఆ సంగతిని అక్కడే వదిలేయలేదు. చెట్ల ఆకులను ఫాబ్రిక్గా ఎలా ఉపయోగించాలనే విషయంపై విపరీతంగా సమాలోచనలు, పరిశోధనలు జరిపి ఆకులను సేకరించారు. ఆ ఆకులను వేడి నీటిలో ఉడికించి, ఆ తర్వాత ఆల్కలీ, సోడియం కార్బొనేట్ ద్రావణంలో రెండు గంటల పాటు ఉంచి అందులోని నీటిని పూర్తిగా పోయేలా చేశారు. ఆ తర్వాత మరి కొన్ని ప్రయోగాలకు ఆ ఆకులను గురిచేసి, వాటిని దారం సహాయంతో చక్కగా అల్లిక చేసి ఈ అందమైన డ్రెస్‌ను తయారుచేశారు. -
చల్లని వెన్నెలలో... చక్కని ఊయలలో...
- నిర్మలారెడ్డి చెట్ల ఆకులు గాలికి అటూ ఇటూ కదలాడుతూ ఉంటే.. ఆ సన్నని దారి వెన్నెలను మోసుకువస్తుంటే.. చల్లని ఆహ్లాదకర వాతావరణంలో ఊయలూగుతూ కమ్మగా నిద్రలోకి జారుకుంటే ఎంత బాగుంటుంది. మరెందుకు ఆలస్యం... అటవీ సౌందర్యం వీక్షించడానికి బయల్దేరేవారు వెంట ఈ ట్రీ టెంట్‌ను కూడా తీసుకెళితే మీ కలను ఎంచక్కా ఇలలో ఎంజాయ్ చేసేయొచ్చు. దూరప్రాంతాలకు అందులోనూ అటవీ ప్రాంతాలకు విహారానికి వెళ్లినప్పుడు బస చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ ట్రీ టెంట్ చెంత ఉంటే కాటేజీల కోసం వెతుక్కోనక్కర్లేదు. క్రిమికీటకాలు, పాములు, తేళ్ళు, ఇతర జంతువులు వస్తాయేమో అనే భయమూ అక్కర్లేదు. వానకి తడవని విధంగా, చలి నుంచి రక్షణగా డిజైన్ చేయబడిన ఈ ట్రీ టెంట్లో ముగ్గురు పెద్దలు లేదా ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులూ సేద దీరవచ్చు. వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా రూపొందించిన ఈ టెంట్ 250 కేజీల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. చిన్న అవసరాలకు కూడా కిందకు దిగకుండా వీటిలో హ్యాండీ డ్రింక్ హోల్డర్లు, ఫోన్ పాకెట్స్, ట్యాబ్ పౌచెస్ కూడా ఉంటాయి. తేలికపాటి బరువు ఉండటమే కాదు ప్యాకింగ్ కూడా సులువే! రకరకాల రంగుల్లోనూ ఇవి లభిస్తున్నాయి. మీరు చేయవల్సింది బలంగా ఉండే చెట్లను ఎంచుకొని వాటిని బేస్ చేసుకుంటూ ఈ ట్రీ టెంట్‌ను అమర్చుకోవడమే. పిక్నిక్ టెంట్ల తయారీ కంపెనీలు రిలీఫ్ టెంట్స్, కాన్వాస్ టెంట్స్, క్యాంపింగ్ టెంట్స్, వెడ్డింగ్ టెంట్స్, గార్డెన్ టెంట్స్... రకరకాల సైజుల్లో లభిస్తున్నాయి. ట్రావెల్ మార్కెట్లో దర్శనమిస్తున్న ఈ టెంట్లను ఆన్లైన్ ద్వారా సులువుగా ఎంపిక చేసుకొని, కొనుగోలు చేయవచ్చు. అలెక్స్ప్రెస్, అమెజాన్ వంటి వెబ్సైట్లలో వీటి ధరలు సుమారు రూ.1000/- నుంచి రూ. 10,000ల వరకు ఉన్నాయి.