చల్లని వెన్నెలలో... చక్కని ఊయలలో...
- నిర్మలారెడ్డి
చెట్ల ఆకులు గాలికి అటూ ఇటూ కదలాడుతూ ఉంటే.. ఆ సన్నని దారి వెన్నెలను మోసుకువస్తుంటే.. చల్లని ఆహ్లాదకర వాతావరణంలో ఊయలూగుతూ కమ్మగా నిద్రలోకి జారుకుంటే ఎంత బాగుంటుంది. మరెందుకు ఆలస్యం... అటవీ సౌందర్యం వీక్షించడానికి బయల్దేరేవారు వెంట ఈ ట్రీ టెంట్‌ను కూడా తీసుకెళితే మీ కలను ఎంచక్కా ఇలలో ఎంజాయ్ చేసేయొచ్చు.
దూరప్రాంతాలకు అందులోనూ అటవీ ప్రాంతాలకు విహారానికి వెళ్లినప్పుడు బస చేయాల్సిన పరిస్థితి వస్తే ఈ ట్రీ టెంట్ చెంత ఉంటే కాటేజీల కోసం వెతుక్కోనక్కర్లేదు. క్రిమికీటకాలు, పాములు, తేళ్ళు, ఇతర జంతువులు వస్తాయేమో అనే భయమూ అక్కర్లేదు. వానకి తడవని విధంగా, చలి నుంచి రక్షణగా డిజైన్ చేయబడిన ఈ ట్రీ టెంట్‌లో ముగ్గురు పెద్దలు లేదా ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారులూ సేద దీరవచ్చు. వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా రూపొందించిన ఈ టెంట్ 250 కేజీల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. చిన్న అవసరాలకు కూడా కిందకు దిగకుండా వీటిలో హ్యాండీ డ్రింక్ హోల్డర్లు, ఫోన్ పాకెట్స్, ట్యాబ్ పౌచెస్ కూడా ఉంటాయి. తేలికపాటి బరువు ఉండటమే కాదు ప్యాకింగ్ కూడా సులువే! రకరకాల రంగుల్లోనూ ఇవి లభిస్తున్నాయి.
మీరు చేయవల్సింది బలంగా ఉండే చెట్లను ఎంచుకొని వాటిని బేస్ చేసుకుంటూ ఈ ట్రీ టెంట్‌ను అమర్చుకోవడమే. పిక్నిక్ టెంట్ల తయారీ కంపెనీలు రిలీఫ్ టెంట్స్, కాన్వాస్ టెంట్స్, క్యాంపింగ్ టెంట్స్, వెడ్డింగ్ టెంట్స్, గార్డెన్ టెంట్స్... రకరకాల సైజుల్లో లభిస్తున్నాయి. ట్రావెల్ మార్కెట్లో దర్శనమిస్తున్న ఈ టెంట్లను ఆన్‌లైన్ ద్వారా సులువుగా ఎంపిక చేసుకొని, కొనుగోలు చేయవచ్చు. అలెక్స్‌ప్రెస్, అమెజాన్ వంటి వెబ్‌సైట్‌లలో వీటి ధరలు సుమారు రూ.1000/- నుంచి రూ. 10,000ల వరకు ఉన్నాయి.