రాష్ట్రానికి బీజేపీ, టీడీపీ ద్రోహం
పది వామపక్ష పార్టీల ధ్వజం
సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రంలోను, రాష్ట్రంలోను మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్నాయని పది వామపక్ష పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో విభజన హామీల సాధనలో వైఖరేమిటో స్పష్టం చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశాయి. ఆదివారం పది వామపక్ష పార్టీల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. సమావేశ వివరాల్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ మీడియాకు వివరించారు. రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, లోటు బడ్జెట్ భర్తీ వంటి విభజన హామీలు రెండేళ్లవుతున్నా అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
విభజన హామీల అమలులో రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ద్రోహంచేస్తుంటే ఇంకా కేంద్రంలో మిత్రపక్షంగా కొనసాగాలా? పోరాడి సాధించుకోవాలా? అనేది చంద్రబాబు తేల్చుకోవాలని వారు సూచించారు. రాష్ట్రంలో అన్ని పార్టీల్ని కలుపుకుని విభజన హామీల అమలుకు టీడీపీ ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే ఏపీని దగా చేసినట్టేనని స్పష్టం చేశారు.
మేడే జరిపే నైతిక హక్కు బాబు సర్కారుకు లేదు..
రాష్ట్రంలో కార్మిక హక్కులను అత్యంత దారుణంగా హరించివేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కార్మిక దినోత్సవాన్ని(మేడే) నిర్వహించడం విడ్డూరమని వారు ఎద్దేవా చేశారు. అధికారపార్టీగా పోటీ సంఘాలు పెడుతూ కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్న టీడీపీ ప్రభుత్వానికి మేడేను నిర్వహించే నైతిక హక్కులేదని విమర్శించారు. ఇటీవల అనేక సమస్యలపై ఉద్యమించిన కార్మికులను అరెస్టులు చేయించడం, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం వంటి చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడడాన్ని గుర్తుచేశారు.
విశాఖ జిల్లాలోని బ్రాండిక్స్ పరిశ్రమలో 12 వేలమంది కార్మికుల్ని తొలగించి రోడ్డున పడేశారని, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని పరిగిలో రావతార్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో 182 మంది కార్మికుల్ని తొలగించారని తెలిపారు. ప్రభుత్వం పోలీసు బలం ప్రయోగించినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా ఈనెల 4న విశాఖ జిల్లా బ్రాండిక్స్ కార్మికులకు మద్దతుగా, అలాగే 14న పరిగిలో పది వామపక్షాల ఆధ్వర్యంలో సభ జరిపి తీరుతామని వారు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరరామరాజు, ఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకిరాములు, జల్లి విల్సన్(సీపీఐ), వి.ఉమామహేశ్వరరావు(సీపీఎం) పాల్గొన్నారు.