జూన్‌లోగా ‘భగీరథ’ పనులు
జూన్‌లోగా ముగించండి ‘మిషన్ భగీరథ’పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
• ఈ పదకొండు నెలలు అత్యంత కీలకం
• నిధుల కొరత లేదు.. వర్షాలు పడేలోపు పనులన్నీ కావాలి
• ఈ పథకం దేశానికే ఆదర్శం కాబోతోంది
• మార్చి నాటికి 3,811 గ్రామాలకు నీరందించాలి..
• పనుల తీరుపై ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘ సమీక్ష
• పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారుల ను ఆదేశించారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేయాలన్నారు. డిసెంబర్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. జూన్‌లోగానే పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలంలో పనులు అనుకున్నంత వేగంగా జరగవని, అందుకే ఇప్పట్నుంచి వర్షాలు పడేలోపు చాలా వేగంగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకు న్న ఈ కార్యక్రమాన్ని అధికారులు రేయింబ వళ్లు కష్టపడి విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని అభినందించారు. ‘‘మంచినీరు గ్రామాలకు చేరడంతోపాటు, గ్రామాలకు చేరిన నీళ్లు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా అందించడం చాలా ముఖ్యమైన పని. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు వేయడం కీలకం.
అవసరమైన సామగ్రిని తెప్పించడం తోపాటు వాటిని గ్రామాల్లో అమర్చాలి. రాష్ట్రమంతా ఒకేసారి సమాంతరంగా ఈ పనులు జరగాలి. అధికారులు సవ్యసాచిలా పని చేయాలి. పనులు వేగంగా జరిపించాలి. ఈ 11 నెలలే అత్యంత కీలకం’’ అని సీఎం అన్నారు. ప్రగతిభవన్‌లో మంగళవారం మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈఎన్సీ నుంచి డీఈల వరకు రాష్ట్రంలో పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతిని సమీక్షించారు. వివిధ ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారాలు సూచించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా జిల్లా స్థాయిలో చర్చించాలని, సీఎం కార్యాలయం వెంటనే స్పందిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీలు, సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు.
మంగళవారం ప్రగతి భవన్లో మిషన్ భగీరథపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నిరంతర విద్యుత్తు సరఫరా
మిషన్ భగీరథకు నిధుల కొరత లేదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని సీఎం చెప్పారు. ‘‘ఆర్థిక సంస్థల నుంచి రూ.30 వేల కోట్ల రుణం లభించింది. క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా జరగడమే ఇప్పుడు ప్రధా నం. పైపులైన్ల నిర్మాణానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకోవాలి. జాతీయ, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్ రోడ్లు, రైల్వే క్రాసిం గ్లు, కెనాల్ క్రాసింగ్‌లు, రివర్, రివర్ లెట్ క్రాసింగ్స్కు సంబంధించి ఆ శాఖలతో సమావేశమై అనుమతులు పొందాలి. అటవీ శాఖ అనుమతుల విషయంలో వేగం పెంచాలి. జిల్లా కలెక్టర్లు ఇందుకు చొరవ తీసుకోవాలని ఆదేశించాం. విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, లైన్ల నిర్మాణం తదితర పనులు వేగంగా జరగాలి. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా చేయాలి. మంచినీటి సరఫరాకు నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి’’ అని ఆదేశించారు.
48 గంటల్లోనే అంచనాల మార్పు
వర్కింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ ఉద్దేశాలను అర్థం చేసుకోవాలని, సకాలంలో పనులు పూర్తి చేస్తే ఇచ్చే ఇన్సెంటివ్ను ఉపయోగించు కోవాలని సీఎం పేర్కొన్నారు. ‘‘ఏజెన్సీలు చాలాచోట్ల పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చాయి. సబ్ కాంట్రాక్టర్లతో సకాలంలో పనులు చేయించే బాధ్యత ఏజన్సీలదే. నేల స్వభావాన్ని బట్టి పైపులైన్ల నిర్మాణం అంచనాల్లో మార్పులు చేర్పులు అనివార్యం. అంచనాల మార్పు 48 గంటల్లో జరగాలి. దీనికి సంబంధించి నిర్ణీత–ప్రామా ణిక రేట్లను వర్తింపచేయాలి’’ అని సూచించారు.
క్రాసింగ్స్ పనులపై సీఎస్‌కు ఆదేశం...
క్రాసింగ్స్ వద్ద పనులకు అనుమతులు పొందేందుకు సంబంధిత శాఖల అధికారుల తో వెంటనే సమావేశం కావాలని ముఖ్య మంత్రి సీఎస్‌ను ఆదేశించారు. ‘‘మొత్తం 148 చోట్ల పైపులైన్‌ను నదులు దాటించాల్సి ఉంది. 53 చోట్ల పనులు పూర్తయ్యాయి. 1,477 చోట్ల కెనాల్స్ దాటాలి. 164 చోట్ల పనులు జరిగాయి. ఈ వేసవిలో మిగతా పనులు పూర్తవుతాయి. 237 చోట్ల రైల్వే క్రాసింగ్స్ ఉన్నాయి. 207 చోట్ల అనుమతులు వచ్చాయి. 44 చోట్ల పనులు పూర్తయ్యాయి. 442 చోట్ల జాతీయ రహదారులు దాటాలి. 418 క్రాసింగ్స్కు అనుమతి వచ్చింది. 57 చోట్ల పనులు పూర్తయ్యాయి. 4,447 చోట్ల ఆర్అండ్డీ రోడ్లు క్రాస్ చేయాలి. 590 చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. 19 ఇన్‌టేక్ వెల్స్‌లో 11 పూర్తవగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి మార్చి నాటికి పూర్తవుతాయి. ఏప్రిల్ నుంచి ఇన్‌టేక్ వెల్స్ అన్నీ నీటిని పంప్ చేస్తాయి. 50 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో 3 పూర్తవగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి’’ అని అధికారులు సీఎంకు వివరించారు.
నీళ్లివ్వకుంటే ఓట్లడగమని చెప్పాం..
మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం కాబోతోందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘‘అన్ని రాష్ట్రాలూ మనవైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాల ప్రతినిధులు ఇక్కడకొచ్చి అధ్యయనం చేశారు. ఈ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించాం. అధికారులపై నమ్మకంతోనే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వర్కింగ్ ఏజెన్సీలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.
తాజా లక్ష్యాలు ఇవీ..
⇔ 2017 జూన్ నాటికి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పూర్తి
⇔ మార్చి నాటికి 3,811 గ్రామాలకు నీటి సరఫరా
⇔ డిసెంబర్ నాటికి మరో 20,366 గ్రామాలకు నీరు
⇔ 2017 మార్చి నాటికి 2,671 ఓహెచ్ఎస్ఆర్లు పూర్తి
⇔ డిసెంబర్ నాటికి 15,602 ఓహెచ్ఎస్ఆర్ పూర్తి
⇔ 2017 మార్చి నాటికి 8,547 కి.మీ. మెయిన్ పైప్‌లైన్
⇔ డిసెంబర్ నాటికి 42,780 కి.మీ. పైప్‌లైన్ పూర్తి
⇔ 2017 మార్చి నాటికి 9,79,245 గృహాలకు నీరు
⇔ డిసెంబర్ నాటికి 42,38,980 గృహాలకు నల్లా నీరు