చొక్కా రంగును బట్టి లైటింగ్!
సాక్షి, హైదరాబాద్: బల్బు, ట్యూబ్లైట్ల రోజులు పోయాయి. ఇప్పుడు లైట్ ఎమిటింగ్ డయోడ్ (ఎల్ఈడీ) ట్రెండ్ నడుస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మనం కోరుకున్న రంగు, గదిని బట్టి, ఆయా రోజును బట్టి కూడా లైట్ రంగును ఎంచుకోవచ్చంటున్నారు కాస్మో డ్యూరబుల్స్ ప్రై.లి. ఎండీ డాక్టర్ హరినాథ్ బాబు. పూజ గదిలో ఎరుపు, గార్డెనింగ్‌లో ఆకుపచ్చ, పడక గదిలో నీలం, హాల్లో వామ్ లైట్, స్టడీ రూంలో డే వైట్ లైట్, ఆఫీసుల్లో ప్యూర్ వైట్, దుకాణాల్లో వామ్ లైట్, రెస్టారెంట్లు, పబ్బుల్లో నీలం, ఎరుపు, ఆరెంజ్ రంగులను ఎక్కువగా వినియోగిస్తారని పేర్కొన్నారు.
సెల్‌ఫోన్ నుంచే ఆపరేటింగ్: ఇప్పుడు లైట్ ఆటోమిషన్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ఎల్ఈడీ లైట్లు గదిలోకి రాగానే వాటంతటవే ఆన్.. వెళ్లిపోగానే ఆఫ్ అవుతాయి. టీవీ సౌండ్ పెంచినట్టుగా రిమోట్ సహాయంతో లుమిన్స్ను ఎక్కువ, తక్కువ చేసుకోవచ్చు. వెబ్ బేస్డ్ సొల్యూషన్స్ ఎల్ఈడీ లైట్లను ఇంటర్నెట్ సహాయంతో ఐ-ఫోన్, ఐప్యాడ్ల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా రెస్టారెంట్లు, పబ్బులు, గేమింగ్ జోన్లు, మాల్స్‌లో వినియోగిస్తుంటారు.
ధర ఎక్కువైనా: బల్బు, సీఎఫ్ఎల్, ట్యూబ్‌లైట్లతో పోల్చుకుంటే ఎల్ఈడీ లైట్ల ధర కాస్త ఎక్కువే. కానీ, విద్యుత్ వినియోగం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
నెలకు రూ.7 కరెంట్ బిల్లు: ఎల్ఈడీ లైట్లు విద్యుత్‌ను చాలా తక్కువ. రోజుకు 10 గంటల చొప్పున బల్బును నెల రోజుల పాటు వినియోగిస్తే 27 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. అంటే నెలకు రూ. 39.15 పైసలు కరెంట్ బిల్లు వస్తుంది. (డొమెస్టిక్ వినియోగంలో యూనిట్ విద్యుత్‌కు రూ. 1.45 పైసలు) ట్యూబ్‌లైట్‌కు నెలకు 21 యూనిట్ల విద్యుత్‌కు.. రూ. 30.45 పైసలు బిల్లు వస్తుంది. అదే ఎల్ఈడీ లైట్‌కు నెలకు కేవలం 5 యూనిట్లే ఖర్చవుతుంది. అంటే రూ. 7.25 పైసల కరెంట్ బిల్లు వస్తుందన్నమాట.
క్రోమో థెరపీ లైట్లు కూడా: ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లలో డౌన్, షో, షాండలైయర్స్, డ్రైవే, వాక్‌వే, స్విమ్మింగ్ పూల్ వంటి రకాలు ఉన్నాయి. జాగ్వార్, విస్టోసీ, ఆర్టేమిడీ వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇవి స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు రూ.650 నుంచి ప్రారంభం. లైటింగ్‌తో మనిషి మూడ్‌ను మార్చే క్రోమోథెరపీ లైట్లు కూడా ఉన్నాయి. వీటి ధరలు లక్ష నుంచి ప్రారంభం. ప్రెస్టిజ్, ఎన్సీసీ, అశోకా వంటి నిర్మాణ సంస్థలతో పాటుగా పలు మీడియా సంస్థలకు, యాజమాన్యాలకు లైట్లను సరఫరా చేశాం.