‘లక్ష్మణ’ రేఖ దాటలేకపోయాడు
హీట్స్‌లోనే వెనుదిరిగిన గోవిందన్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
లండన్: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో నిరాశాజనక ఫలితం చేరింది. లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గోవిందన్ లక్ష్మణన్ తన అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా...అది ఫైనల్‌కు అర్హత సాధించేందుకు సరిపోలేదు. పురుషుల 5000 మీటర్ల పరుగులో లక్ష్మణన్ తొలి రౌండ్ హీట్స్‌లో 15వ స్థానంలో సరిపెట్టుకున్నాడు. 27 ఏళ్ల లక్ష్మణన్ ఈ పోటీని 13 నిమిషాల 35.69 సెకన్లలో ముగించాడు. గతంలో అతని అత్యుత్తమ టైమింగ్ 13 నిమిషాల 36.62 సెకన్లు కాగా... ఇప్పుడు దానిని సవరించడంలో మాత్రం అతను సఫలమయ్యాడు. ఓవరాల్‌గా అతను 31వ స్థానంలో నిలిచాడు.
ఇప్పటి వరకు చాంపియన్‌షిప్‌లో పోటీ పడిన భారత అథ్లెట్లలో లక్ష్మణన్ ఒక్కడే తన అత్యుత్తమ టైమింగ్కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. భారీ వర్షం అనంతరం ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోయిన స్థితిలో అతను పూర్తిగా వెనుకంజ వేశాడు. ‘ఇది నా తొలి ప్రపంచ చాంపియన్‌షిప్. కనీసం మన జాతీయ రికార్డు బద్దలు కొడదామని ఇక్కడికి వచ్చాను కానీ అది సాధ్యం కాలేదు. అయితే వ్యక్తిగతంగా ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం సంతృప్తినిచ్చింది. ఇక దిగ్గజ అథ్లెట్ మో ఫరాతో కలిసి ఈ రేసులో పరుగెత్తాను. ఆ రూపంలో నా కల నిజమైంది. మాకు అతనే స్ఫూర్తి. ఫరా ఆఖరి రేసులో నేను పక్కన ఉండటం జీవితకాలం గుర్తుండిపోయే అనుభూతి’ అని లక్ష్మణన్ వ్యాఖ్యానించాడు. శనివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించిన మో ఫరా ఆ రేసుతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు.
ఒకే ఒక్కడు...
అథ్లెటిక్ ట్రాక్ అంతా తానే అయి పరుగెత్తుతున్న ఇతడిని చూశారా... ఇతను బోట్స్వానాకు చెందిన ఐసాక్ మక్వానా. 200 మీటర్ల పరుగులో ఫేవరెట్. అయితే కలుషిత ఆహారం తీసుకొని అనారోగ్యం బారిన పడటంతో అతను హీట్స్‌లో పాల్గొనలేకపోయాడు. అయితే ఐఏఏఎఫ్ అతనిపై కరుణ ప్రదర్శించింది. గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రత్యేక అనుమతి ఇచ్చి మళ్లీ పరుగెత్తే అవకాశం కల్పించింది. దాంతో మక్వానా ట్రాక్‌పైకి దిగాడు. 20.54 సెక న్లలో లక్ష్యాన్ని చేరి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. తన పతకం ఆశలను నిలబెట్టుకోగలిగాడు.
ఫెలిక్స్‌కు 14వ పతకం...
అమెరికా స్టార్ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ ఖాతాలో మరో పతకం చేరింది. మహిళల 400 మీటర్ల పరుగులో ఆమె కాంస్యం (50.08 సెకన్లు) సాధించింది. ఫెలిక్స్ కెరీర్లో ఇది 14వ ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం కావడం విశేషం. ఫలితంగా జమైకా దిగ్గజాలు ఉసేన్ బోల్ట్, మెర్లీన్ ఒటీ (14)లతో ఆమె సమంగా నిలిచింది. ఈ ఈవెంట్లో ఫైలిస్ ఫ్రాన్సిస్ (యూఎస్–49.92సె.), సల్వా నసీర్ (బహ్రెయిన్–50.06సె.) వరుసగా పసిడి, రజత పతకాలు గెలుచుకున్నారు. ఓవరాల్‌గా ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో 9 స్వర్ణాలు నెగ్గిన ఫెలిక్స్... ఒలింపిక్స్‌లో కూడా మరో 6 స్వర్ణాలు సాధించింది.