కరెంటు కోతలపై అన్నదాతల ఆగ్రహం
మొయినాబాద్, న్యూస్‌లైన్: వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా, దాంట్లోనూ కోతలు... లోఓల్టేజీతో పంపుసెట్లు పనిచేయక... నీటి తడి అందక పంటలు ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. మండల పరిధిలోని అమీర్‌గూడ, నక్కలపల్లి గ్రామాల రైతులు శుక్రవారం మండల విద్యుత్ ఏఈ కార్యాలయం ఎదుట వేర్వేరుగా ధర్నా నిర్వహించారు. రెండు గ్రామాల్లోనూ వారం పది రోజులుగా కరెంటు సక్రమంగా లేక వరి, కూరగాయ పంటలు, పూల తోటలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో విద్యుత్ సరఫరా సరిగా లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి ఆరు గంటల కరెంటు ఇవ్వడంలేదని, అందులోనూ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రాత్రిపూట కరెంటు సరఫరా చేస్తుండటంతో పొలాల వద్దే ఉండాల్సి వస్తోందని, ఆ సమయంలో కూడా లోఓల్టేజీ కరెంటు రావడంతో మోటార్లు నడవక పంటలకు నీరు పెట్టలేక పోతున్నామని అన్నారు. కార్యాలయంలో ఏఈ నాగరాజు అందుబాటులో లేకపోవడంతో నక్కలపల్లి రైతులు ఫోన్లో ఆయనకు విషయం తెలియజేశారు. కాగా, అమీర్గూడలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వారం రోజుల క్రితం కాలిపోయిందని, మరమ్మతులు చేయించినా మళ్లీ మళ్లీ కాలిపోతుండటంతో గ్రామంలో కరెంటు ఉండటంలేదని ఆ గ్రామ రైతులు పేర్కొన్నారు.