అమ్మాయిలతో చాటింగ్, డేటింగ్ అని ఆశపడ్డావో, అంతే!
‘‘5 పైసలు కొట్టేస్తే పెద్ద తప్పు కాదు, 5 కోట్లసార్లు 5 పైసలు కాజేస్తే.. తప్పే. అదే 5 కోట్ల మంది ఐదుసార్లు 5 పైసలు కాజేస్తే.. అది తప్పకుండా మెగా తప్పు అవుతుంది’’ఒక సినిమాలో హీరో అవినీతిపై చెప్పే డైలాగ్ ఇది.. వాస్తవానికి ఇందులో కంటికి కనిపించని మోసం, కుంభకోణం ఉన్నాయి. సాధారణంగా చిన్నమొత్తం మోసపోయిన వారెవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రారు. పరువు, ఆత్మాభిమానాలను ఆయుధంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు చెలరేగుతున్నారు. ముఖ్యంగా టీనేజీ కుర్రాళ్లను లక్ష్యంగా చేసుకుని డేటింగ్ యాప్స్ ముసుగులో రోజుకు కోట్లు కొట్టేస్తున్నారు. ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గత నాలుగేళ్లలో ఈ డేటింగ్ యాప్స్ మోసాలు నాలుగురెట్లు పెరిగాయి. డేటింగ్ యాప్‌లకు అమెరికా తరువాత ఇండియానే అతిపెద్ద మార్కెట్. ఇవి 2020లో మనదేశంలోని యువకుల నుంచి రూ.2,394 కోట్లు లాగేశాయి.
– సాక్షి, హైదరాబాద్
టీనేజీ, పెళ్లికాని కుర్రాళ్లే లక్ష్యంగా కొన్ని విదేశీ కంపెనీలు ఇండియాలో డేటింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాయి. తక్కువ కాలంలో కోట్ల రూపాయలు సంపాదించేందుకు డేటింగ్ యాప్‌ల పేరిట అక్రమమార్గం ఎంచుకున్నాయి. యాప్స్ నిర్వాహకులు చాలా తెలివిగా ఉచ్చులోకి లాగి, వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ఇంకా కొందరి వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సంపాదించి బ్లాక్‌మెయిలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తూ.. ఇక్కడి యువకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఎలా మోసం చేస్తారంటే..!
వీరు చేసే మోసాలకు సోషల్ మీడియానే వేదిక. ఉదాహరణకు హైదరాబాద్‌కు చెందిన నరేశ్ ఒకరోజు సోషల్ మీడియాలో లామోర్ అనే డేటింగ్ యాప్ యాడ్ చూశాడు. అందమైన యువతులు మీ స్నేహం కోసం ఎదురుచూస్తున్నారు అన్న క్యాప్షన్‌తో ఆకర్షితుడయ్యాడు. దాంతో వెంటనే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ యాప్ ఓపెన్ చేయగానే.. ఒకేసారి పదుల సంఖ్యలో అమ్మాయిలు తమతో స్నేహం చేయాలని సందేశాలు పంపారు. ఆ అమ్మాయిలతో చాట్ చేయాలంటే రూ.199 చెల్లించాలని షరతు విధించారు. రూ.199 కదా అని చెల్లించాడు. చాలామందితో చాట్ చేశాడు.
మరికొందరు వీడియో చాట్ చేయాలని ఉందని చెప్పారు. వారి కాల్స్ వస్తున్నా.. ఆన్సర్ చేయలేకపోతున్నాడు. వారి కాల్ లిఫ్ట్ కావాలంటే మరోసారి రూ.499 చెల్లించాలని సందేశం వచ్చింది. అలా చేస్తే 1,600 డైమండ్లు వస్తాయి. అవి అయిపోయే వరకు మాట్లాడవచ్చన్నది దాని సందేశం. దీంతో తాను ట్రాప్‌లో ఇరుక్కున్నానని అర్థం చేసుకొని అంతటితో వదిలేశాడు. ఇలాంటి యాప్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
అందులో చైనావే అధికం. చైనాకే చెందిన లామోర్ డేటింగ్‌యాప్ ఇలా మన దేశంలో గతేడాది రూ.199 ప్యాకేజీల పేరిట దాదాపు రూ.7 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కన మిగిలిన డేటింగ్ యాప్‌లు ఇంకెంత సంపాదించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. యాప్ నిర్వాహకులు ఇలా సంపాదించిన డబ్బును బిట్కాయిన్ల రూపంలోకి మార్చి తమ దేశాలకు తీసుకెళ్తున్నారు.
పరువు కోసం మౌనం..:
ఇలా నమ్మి మోసపోయిన వారు ఏటా లక్షల్లో ఉంటారు. వారు పోగొట్టుకునే డబ్బు రూ.కోట్లలో ఉంటుంది. వీరంతా 18 నుంచి 35 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం. రూ.199 పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేయలేరు. ఒకవేళ చేసినా.. వారు ఇలాంటి యాప్స్‌ను ఎందుకు డౌన్లోడ్ చేశావని మందలిస్తారు. దీంతో నలుగురిలో పరువు పోతుందని భయపడతారు. పరువు, చిన్నమొత్తమే కదా అన్న రెండు అంశాలే ఆయుధంగా నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్ ఇలాగే డేటింగ్ వెబ్సైట్లో అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. వాటిని రికార్డు చేసి అతన్నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇలాంటి బెదిరింపులకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏజెన్సీలతో రిక్రూట్మెంట్..
ఇలాంటి డేటింగ్ సైట్లలో పనిచేసే అమ్మాయిలను భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ఏజెన్సీలు ఉన్నాయి. టాలెంట్ ఏజెన్సీ పేరుతో వీరు అమ్మాయిలను ఉద్యోగాల కోసం పంపుతారు. వీరు చేయాల్సిందల్లా.. అబ్బాయిలతో ఫోన్లలో మాట్లాడటమే. ఎంత ఎక్కువ సేపు మాట్లాడితే అంత ఎక్కువ డబ్బు వీరికి వస్తుంది. సోనోకాన్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఏజెన్సీ ఉంది. ఇది ఇప్పటివరకు 15 డేటింగ్ యాప్‌లకు రెండువేల మంది అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి రిక్రూట్ చేసింది. సోనోకాన్లాంటి కంపెనీలు చాలానే ఉన్నాయి.
కొన్ని గణాంకాలు పరిశీలిస్తే..
డేటింగ్ యాప్స్ ద్వారా ఏటా మోసపోతున్న మొత్తం రూ.2,394 కోట్లు
సగటున రోజుకు పోగొట్టుకుంటున్నది రూ.6.5 కోట్లు
ఏటా మోసపోతున్న యువకులు 12 కోట్లు
సగటున నిమిషానికి మోసపోతున్న యువకులు 229
వీటికి దూరంగా ఉండాలి
డేటింగ్ యాప్స్‌లో అధిక భాగం పశ్చిమబెంగాల్ నుంచి నడుస్తున్నాయి. ఇందుకోసం ఆయా కంపెనీలు అమ్మాయిలతో ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వీరు అబ్బాయిలే లక్ష్యంగా చేసుకుని కాల్స్ చేస్తున్నారు. వారిని తమ మాయమాటలతో ముగ్గులోకి దింపి న్యూడ్ కాల్స్ చేయిస్తున్నారు. వాటిని వీడియో తీసి, తిరిగి వారికే పంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరూ కూడా అందమైన అమ్మాయిల ఫొటోలు చూపి వల వేసే కాల్స్‌ను నమ్మొద్దు. డేటింగ్ యాప్స్, సైట్స్‌కు దూరంగా ఉండటం మంచిది.
– ప్రసాద్, ఏసీపీ, సీసీఎస్