Lund University
-
ఈ గద్దకు చూపెక్కువ!
లండన్: ‘పెరెగ్రిన్ ఫాల్కన్’అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. దీంతో ఈ పక్షులు ఎక్కువ వేగంతో ఎగిరేటప్పుడు నేలపై ఉండే తన ఆహారాన్ని వేగంగా గుర్తించి, స్పందించే వీలు కలుగుతుందన్న మాట. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధన ప్రకారం మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి. ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ప్రకారం సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదని తెలిసింది. సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవని తెలిపింది. వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుందని వివరించారు. అదే పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగి చటుక్కున నోట్లో వేసుకుంటుందని చెప్పారు. -
కాకుల్లోనూ వస్తుమార్పిడి
భవిష్యత్తు భద్రంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, వాటి ప్రకారమే నడుచుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఈ అలవాటు మనుషు లకు మాత్రమే కాకుండా కాకులకు కూడా ఉందట. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాకులు తమ మనుగడను శాశ్వతం చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరించడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో వస్తుమార్పిడి వంటివి కూడా ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతిని ఎంచుకొని, తమను తాము కాపాడుకుంటాయట. అయితే ఈ పద్ధతులను ఎంచుకునే సమయంలో స్వీయనియంత్రణను పాటించడం, పలు రకాలుగా ఆలోచించడం, ఎంచుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం వంటివి కాకుల్లో ఉన్న ఉత్తమ గుణాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం మనుషుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణాలను గతంలో చింపాజీల్లో గమనించామని, అంతకు మించిన పరిణితిని కాకులు కనబర్చడం ఆశ్చర్యపర్చిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఓస్వాత్ తెలిపారు. -
గ్రహాన్ని మింగేసిన సూర్యుడు!
లండన్: మిస్టరీగా ఉన్న తొమ్మిదో గ్రహాన్ని సూర్యుడు 4,500 కోట్ల ఏళ్ల క్రితమే మింగేసి ఉంటాడని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సౌరకుటుంబంలో అదే మొదటి బాహ్యగ్రహం కావొచ్చని అంచనా. శాస్త్రీయ అంశాల అది ప్రకారం మన సౌరకుటుంబానికి వెలుపల ఉండాలి కానీ అది మన సౌరకుటుంబంలో భాగమే. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు దీనికి ఆధారాలున్నాయంటున్నారు. నక్షత్రాలు సమూహాలుగా ఉన్నప్పుడు అవి ఒకదాన్ని మరోటి దాటి వెళుతుంటాయి. ఆ సందర్భంలోనే సూర్యుడు ఈ గ్రహాన్ని మింగేసి ఉంటాండంటున్నారు ఈ శాస్త్రవేత్తలు. -
చెయ్యే క్రెడిట్ కార్డు!
వాషింగ్టన్: చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. క్రెడిట్ కార్డు తీసుకెళ్లకున్నా.. ఎం చక్కా మీరు షాపింగ్ చేయొచ్చు.. కొనాల్సినవన్నీ కొనేసి.. మీ చేతిని స్వైప్ మిషన్‌పై పెడితే చాలు.. మీ అకౌంట్లోని డబ్బులు కావాల్సిన వారి ఖాతాలోకి వెళ్లిపోతాయి. స్వీడన్‌కు చెందిన క్విస్టర్ అనే కంపెనీ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. వీరు రూపొందించిన స్వైప్ మిష న్లో క్రెడిట్‌కార్డుకు బదులుగా చేతిని ఉంచితే చాలు.. సెన్సార్ల ద్వారా అది చేతిని స్కాన్ చేసుకొని కావాల్సిన డబ్బును మీ అకౌంట్ నుంచి ఐదు సెకన్లలోపే తీసుకుంటుంది. వేలిముద్రలులాగే, చేతిలో ఉండే నరాలు కూడా ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు... దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్తరకం స్వైప్ మిషన్‌ను తయారుచేసినట్లు రూపకర్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ లేఫ్లాడ్ తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి స్వైప్మిషన్లను లండ్ యూనివర్సిటీలో 15 వరకు అమర్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉండదని చెప్పారు. ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు ముందుగా తమ ఫోన్ నంబర్‌కు సంబంధించిన చివరి నాలుగు సంఖ్యలను నమోదు చేసి, తర్వాత స్వైప్‌మిషన్‌పై చేతిని ఉంచితే చాలు... డబ్బులు బదిలీ అయిపోతాయి.