కాకుల్లోనూ వస్తుమార్పిడి
భవిష్యత్తు భద్రంగా ఉండాలని ముందు జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, వాటి ప్రకారమే నడుచుకోవడం మనలో చాలామందికి అలవాటే. అయితే ఈ అలవాటు మనుషు లకు మాత్రమే కాకుండా కాకులకు కూడా ఉందట. స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాకులు తమ మనుగడను శాశ్వతం చేసుకునేందుకు రకరకాల పద్ధతులను అనుసరించడాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందులో వస్తుమార్పిడి వంటివి కూడా ఉన్నాయని వెల్లడించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన పద్ధతిని ఎంచుకొని, తమను తాము కాపాడుకుంటాయట.
అయితే ఈ పద్ధతులను ఎంచుకునే సమయంలో స్వీయనియంత్రణను పాటించడం, పలు రకాలుగా ఆలోచించడం, ఎంచుకోవడానికి కాస్త సమయం తీసుకోవడం వంటివి కాకుల్లో ఉన్న ఉత్తమ గుణాలని శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం మనుషుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణాలను గతంలో చింపాజీల్లో గమనించామని, అంతకు మించిన పరిణితిని కాకులు కనబర్చడం ఆశ్చర్యపర్చిందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఓస్వాత్ తెలిపారు.