లండన్: ‘పెరెగ్రిన్ ఫాల్కన్’అనే గద్ద పక్షి జాతిలోనే అత్యంత వేగవంతమైన దూరదృష్టి కలిగి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఒక సెకనుకు దాదాపు 130 ఫ్రేమ్‌లను తన కళ్లతో బంధిస్తుందని తెలిసింది. దీంతో ఈ పక్షులు ఎక్కువ వేగంతో ఎగిరేటప్పుడు నేలపై ఉండే తన ఆహారాన్ని వేగంగా గుర్తించి, స్పందించే వీలు కలుగుతుందన్న మాట. స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధన ప్రకారం మానవుడి కళ్లు ఒక సెకనులో 50 నుంచి 60 ఫ్రేమ్‌లను మాత్రమే బంధించగలుగుతాయి. ఎక్స్‌పెరిమెంటల్ బయాలజీ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనం ప్రకారం సరైన వెలుతురు ఉన్న వాతావరణంలో పెరెగ్రిన్ ఫాల్కన్ సెకనుకు 129 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలదని తెలిసింది. సేకర్ ఫాల్కన్ అనే గద్ద సెకనుకు 102, హారిస్ హాక్ డేగ 77 ఫ్రేమ్‌లను గుర్తుపెట్టుకోగలవని తెలిపింది. వేటాడే పక్షుల దృష్టిపై తొలిసారిగా అధ్యయనం చేసి, ఎదురుగా కనిపించే దానికి ఎలా స్పందిస్తుందనే విషయం తెలుసుకున్నట్లు లుండ్ వర్సిటీకి చెందిన అల్ముట్ కెల్బర్ తెలిపారు. సేకర్ ఫాల్కన్, హారిస్ హాక్ డేగలు నేలపై మెల్లగా కదిలే క్షీరదాలను మాత్రమే వేటాడుతుంటాయని, అందుకే వాటికి తక్కువ దూరదృష్టి ఉంటుందని వివరించారు. అదే పెరెగ్రిన్ ఫాల్కన్ మాత్రం తన ఆహారాన్ని చూసిన వెంటనే ఆకాశం నుంచి దాదాపు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో కిందకు దిగి చటుక్కున నోట్లో వేసుకుంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment