బాబ్ డిలాన్ 'నోబెల్'ను అంగీకరించినట్లేనా?
కాలిఫోర్నియా: ప్రముఖ గాయకుడు, కవి బాబ్ డిలాన్‌కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం ప్రకటించి వారం గడుస్తున్నా దానిపై ఆయన పెదవి విప్పలేదు. దీంతో స్విడిష్ అకాడమీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. 'కనీసం గ్రహీతకు కూడా అవార్డు ఇచ్చిన సంగతి చెప్పరా?' అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం బాబ్ డిలాన్ నోబెల్‌ను తిరస్కరిస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబ్ డిలాన్ అధికారిక వెబ్సైట్లో చోటుచేసుకున్న మార్పులు స్విడిష్ అకాడమీకి ఊరటనిచ్చాయి.
కెరీర్ ప్రారంభం నుంచి 2012 వరకు బాబ్ డిలాన్ రచించి, పాడిన పాటల సమాహరం 'ది లిరిక్స్ 1961-2012' పుస్తకానికి గానూ ఆయనకు నోబెల్ సాహిత్య పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. కాగా, సోమవారం నుంచి ఆ పుస్తకానికి సంబంధించిన ప్రచార వాక్యాల్లో 'నోబెల్ లిటరేచర్ అవార్డు పొందిన పుస్తకం'అని బాబ్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. పురస్కారంపై ఇప్పటి వరకు పెదవి విప్పని బాబ్.. ఈ చర్యతో నోబెల్ ను అంగీకరించినట్లు ప్రకటించారని స్విడిష్ అకాడమీ వర్గాలు సంబరపడుతున్నాయి. (తప్పక చదవండి: ‘నోబెల్’కు నగుబాటు!)
అవార్డు ప్రకటించిన విషయాన్ని బాబ్ డిలాన్‌కు నేరుగా చేరవేసే ప్రక్రియకు మంగళవారంతో మంగళంపాడినట్లు స్విడిష్ అకాడమీ శాశ్వత ప్రతినిధులు సారా డేనియస్ ప్రకటించారు. అయితే డిసెంబర్ 10న స్టాక్ హోంలో జరగబోయే నోబెల్ పురస్కార ప్రదాన కార్యక్రమానికి బాబ్ డిలాన్ వస్తారా? రారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె చెప్పారు. గతంలోనూ కొందరు నోబెల్ సాహితీ గ్రహీతలు.. పురస్కార ప్రదాన కార్యక్రమానికి గౌర్హాజరయ్యారని, ఇద్దరు కవులు మాత్రం ఏకంగా అవార్డునే తిరస్కరించారని గుర్తుచేశారు.