కోనేరులో పడి భక్తుడు మృతి
బేతంచెర్ల : శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నున్న కోనేరులో మునిగి ఓ భక్తుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు షరీఫ్ నగర్ కు చెందిన ఎల్లస్వామి (32) తమ్ములు తమ పిల్లల పుట్టు వెంట్రుకలను శనివారం మద్దిలేటిస్వామి ఆలయం వద్ద తీయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్లస్వామి స్నానం చేసి వస్తానని కోనేరు వద్దకు ఒక్కడు వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటి గుండంలో మునిగి పోయాడు. ఎంతసేపటికి ఫంక్షన్ వద్దకు రాకపోవడంతో ఊరికి వెళ్లి ఉంటాడని బంధువులు భావించారు. కార్యక్రమం పూర్తిచే సుకొని శనివారం రాత్రి ఇంటికెళ్లి చూడగా ఎల్లస్వామి కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే మద్దిలేటి స్వామి క్షేత్రం వద్దకు వచ్చి గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం ఆలయ నీటిగుండంలో ఎల్లస్వామి శవం తేలింది. మృతుడికి భార్య గంగాభవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్ గౌస్ తెలిపారు.