madapur police station
-
మాదాపూర్ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై
సాక్షి,హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో శనివారం(ఏప్రిల్ 6) ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ ఏసీబీ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ పోలీసులు లంచం వ్యవహారంపై విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండు రోజులుగా ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఎస్సై, రైటర్ అవినీతి వ్యవహారం బయటపడింది. ఇదీ చదవండి.. కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్ -
పాకిస్తాన్ చెర నుంచి తెలుగు యువకుడి విడుదల
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఎట్టకేలకు విడుదలయ్యాడు. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్‌ను భారత అధికారుల బృందానికి అప్పగించగా, మంగళవారం మాదాపూర్ పోలీసులు అతన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రశాంత్‌ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. తన విడుదలకు సహకరించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు. తనను విడిపించడం కోసం ప్రత్యేక చొరవ తీసుకుని ఢిల్లీకి వెళ్లి అధికారులతో మాట్లాడిన సీపీ సజ్జనార్‌కు జీవితకాలం రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. తన లాంటి వారు చాలా మంది ఏళ్ల తరబడి పాక్ జైళ్లలో మగ్గుతున్నారని, వారి విడుదల కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని అభ్యర్ధించాడు. పాక్ చెర నుంచి బయటపడతానని అస్సలు అనుకోలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కాగా, నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసిన ప్రశాంత్ 2017 ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి అదృశ్యమయ్యాడు. ప్రియురాలి కోసం స్విట్జర్లాండ్ వెళ్లే క్రమంలో అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో పాక్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ తండ్రి బాబూరావు 2019లో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి తన కొడుకును పాక్ చెర నుంచి విడిపించాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: కేటీఆర్‌ని సోనూ సూద్ ఏమి కోరారో తెలుసా? మాకొద్దీ కరోనా ట్రీట్మెంట్, ప్రాణాలు పోతే పోనీ -
హోం క్వారంటైన్ నిబంధనల ఉల్లంఘన
గచ్చిబౌలి: హోం క్వారంటైన్లో ఉండాల్సిన ఓ యువకుడు బయట తిరుగుతుండటంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఓ యువకుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఈ నెల 19న హైదరాబాద్‌కు వచ్చాడు. విమానాశ్రయంలో పరీక్షలు చేసి నెగెటివ్ రావడంతో ఇంట్లో హోం క్వారంటైన్ ఉండాలని సూచించారు. మంగళవారం సైబర్‌టవర్ జంక్షన్ లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో యువకుడు ఉన్నాడు. తల్లితో పాటు వెళ్తుండగా ఆపిన పోలీసులు మీరు ఎక్కడ ఉంటారని ఆరా తీశారు. మార్చి 19న ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు తెలిపాడు. హోం క్వారంటైన్ ఉండాల్సి ఉండగా బయటకు ఎందుకు వచ్చారని పోలీసులు ప్రశ్నించారు. యువకునిపై ఐపీసీ 188, 269, రిలవెంట్ ప్రివిజన్ ఆఫ్ ది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద కేసు నమోదు చేశారు. తల్లి, కొడుకులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సదరు యువకుడు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఇద్దరు లాక్డౌన్ ఉల్లంఘనులకు జైలుశిక్ష యాకుత్‌పురా: లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించిన ఇద్దరు యువకులకు నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఆయన వారికి 14 రోజులపాటు జైలుశిక్ష విధించారు. మీర్‌చౌక్‌కు చెందిన ఖాజా ఫహీముల్లా, యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ షకీల్‌లు పాతబస్తీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కోవిడ్–19 వైరస్ పట్ల దుష్ప్రచారం చేస్తున్నారు. సోమవారం రాత్రి కోట్ల అలీజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ ఇద్దరు యువకులను పోలీసులు ఆపి ప్రశ్నించగా...వారు సరైన సమాధానం ఇవ్వలేదు. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కోవిడ్–19పై దుష్ప్రచారం చేస్తున్న యువకులిద్దర్నీ పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా...14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మీర్‌చౌక్ పోలీసులు తెలిపారు. -
వాలెంటైన్స్ డే: భజరంగ్‌దళ్ కార్యకర్తల అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : వాలెంటెన్స్ డే సందర్భంగా మాదాపూర్, ఐటీ కారిడార్ పరిసరాల్లో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవానికి వ్యతిరేకంగా ఆగ్రహంతో విధ్వంసం సృష్టించిన ఐదుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో నాగోత్ అజయ్ సింగ్, వదిత్య అర్జున్, కొర్ర సంతోష్, గుడుపు పవన్ కుమార్, పొలారి తిరుపతి ఉన్నారు. ఫిబ్రవరి 14వ తేదీన సుమారు 10 నుంచి 15 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు కే పి హెచ్ బి నుంచి హైటెక్ సిటీ వెళ్లేదారిలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ వాలెంటైన్స్ డేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గచ్చిబౌలి, కొత్తగూడా, మాదాపూర్ తదితర ప్రాంతాలలోని వాణిజ్య సముదాయాలపై దాడులకు దిగారు. దారిలో కనపడిన ఓ ఐస్ క్రీమ్ షాప్ లో విధ్వంసం సృష్టించారు. ఇనార్బిట్ మాల్, బికనీర్ వాలా, ఏబీఎన్ శరత్ మాల్ తదితర చోట్ల దాడులకు దిగారు. సమాచారం మేరకు కాగా పోలీసులు ఇనార్బిట్ మాల్ కి చేరుకోగానే వారంతా అక్కడి నుంచి పారిపోయారు. కాగా షాపు యాజమాన్యాల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ లు పరిశీలించిన అనంతరం పోలీసులు ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. కాగా మిగిలిన వారైన సుభాష్, కిరణ్, దత్త సాయి, సాయి రెడ్డి, వెంకట్ మరియు తదితరులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రేమికుల అవస్థలు) -
హైదరాబాద్ : మరో ఇద్దరు మహిళల దారుణహత్య
సాక్షి, హైదరాబాద్ : వరుస హత్యాకాండలతో రాజధాని నగరం ఎరుపెక్కింది. వేర్వేరు ఘటనల్లో మంగళవారం ఒక్కరోజే ఇద్దరు యువతుల హత్యోదంతాలు వెలుగులోకి వచ్చాయి. కోండాపూర్ వద్ద గోనె సంచిలో యువతి మృతదేహాన్ని గుర్తించిన కొద్దిసేపటికే.. హయత్ నగర్లో ఓ విద్యార్థిని హత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం చందానగర్‌లో మూడు హత్యల వ్యవహారం కలకలంరేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ.. : హయత్ నగర్లో హత్యకు గురైన యువతిని అనూషగా గుర్తించారు. బండరాయితో తలపై బలంగా మోది ఆమెను హత్యచేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన అనూష.. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లు పోలీసులు చెప్పారు. మోహన్ అనే యువకుడితో కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థమైందని, హత్యలో అతని ప్రమేయం కూడా ఉండొచ్చని మృతురాలి కుటుంబీకులు అనుమానిస్తున్నారు. నిశ్చితార్థం తర్వాత నుంచి మోహన్ వేధిస్తున్నాడని, ఘటన జరిగిన రోజు నుంచి అతని మొబైల్ స్విచాఫ్ చేసి ఉందని అనూష సోదరులు మీడియాతో అన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కి.. : మంగళవారమే వెలుగుచూసిన మరో ఘటన ఇది. కొండాపూర్‌లోని శ్రీరాంనగర్ కాలనీ బొటానికల్ గార్డెన్ సమీపంలో స్థానికులు ఒక మూటను గుర్తించి పోలీసులను సమాచారం అందించారు. తెరిచి చూడగా.. ముక్కలుగా నరికిన మృతదేహం కనిపించింది. ఆనవాళ్లను బట్టి హత్యకు గురైంది ఓ మహిళ అని పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఎవరు, చంపిపారేసిన దుండగులెవరో కనిపెట్టేందుకు యత్నిస్తున్నారు. చందానగర్‌లో మూడు హత్యల కలకలం : రంగారెడ్డి జిల్లా చందానగర్‌లో శనివారం జరిగిన ఈ మూడు హత్యల ఉదంతం సోమవారం ఉదయం వెలుగు చూసింది. అపర్ణ అనే మహిళతో సహజీవనం చేస్తున్న మధు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అపర్ణ, ఆమె కూతురు కార్తికేయ(5), తల్లి జయమ్మ(50)లను మధు దారుణంగా హతమార్చాడు. -
ముగ్గురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు కానిస్టేబుళ్ల పై కేసు నమోదైంది. మాదాపూర్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లు పాత నోట్లు తరలిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 8 లక్షల పాత నోట్లు తీసుకున్నారు. డ్రైవర్ ఫిర్యాదుతో ముగ్గురు కానిస్టేబుళ్లతో పాటు ఓ హోంగార్డుపై కేసు నమోదు చేశారు. -
సహజీవనం పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: ఉద్యోగంతో పాటు వ్యాపారంలో వాటా ఇస్తానని మాయమాటలతో నమ్మబలికి సహజీవనం చేసి మోసానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఏడుగురిపై కోర్టు ద్వారా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలు.. 25వ మెట్రోపాలిటన్ కోర్టు ద్వారా ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సీఐ నర్సింహులు వివరించారు. నిజాంపేటలో నివాసముండే సంకు రమణ(33) హబ్సిగూడలోని ఫార్చూన్ బటర్‌ఫ్లై సిటీ రియల్ఎస్టేట్ కార్యాలయంలో ఏజీఎంగా పని చేస్తున్నాడు. నింబోలి అడ్డలో నివాసం ఉండే ఓ వివాహిత(27) ఫార్చూన్ బటర్ ఫ్లై సిటీ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. 2014 నుంచి మాదాపూర్‌లోని అయ్యప్ప సోసైటీలో మరో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మార్కెటింగ్ మేనేజర్‌ను ఆ రోజు నుంచి అక్కడే విధులు నిర్వహించాలని రమణ చెప్పాడు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రమణ కార్యాలయంలోనే ఉండేవాడు. కారులో తీసుకెళ్తూ వివాహితతో అన్యోన్యంగా మెలిగాడు. జీతంతో పాటు చేసే వ్యాపారంలో 50 శాతం వాటా ఇస్తానని, రూ. 25 లక్షలు డిపాజిట్ చేస్తానని, ఐదేళ్ల కొడుకును డిగ్రీ వరకు తానే చదివిస్తానని నమ్మబలికాడు. మహరాణిలా చూసుకుంటానని, భర్తకు విడాకులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. కార్యాలయానికి సమీపంలోనే అయ్యప్ప సొసైటీలో మరో ఫ్లాట్ అద్దెకు తీసుకొని మార్కెటింగ్ మేనేజర్‌ను అక్కడే ఉంచాడు. వీకెండ్లో ఆమె ఫ్లాట్‌లోనే రాత్రి వేళల్లో ఉంటూ సహజీవనం చేస్తూ, రిసార్ట్స్‌లలో తిప్పాడు. ఆమె గర్భం దాల్చడంతో మత్తు ఇచ్చి గర్భస్రావం అయ్యేటట్లు చేశాడు. బలవంతంగా మద్యం తాగించేవాడు. భార్య జానకీ పాటు సహ ఉద్యోగులు కిరణ్, రాజేష్, వాసు, రవి, మధు, రాములు సహజీవనం విషయం బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారు. జీతంతోపాటు కమిషన్ రూ.5 లక్షలు రావాల్సి ఉంది. ఈలోగా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఫ్లాట్ అద్దె గడువు ముగియడంతో యజమాని ఖాళీ చేయాలని బాధితురాలితో చెప్పాడు. దీంతో ఆమె రమణను ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. సెప్టెంబర్ 26న మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా వినాయక నిమజ్జనంలో పోలీసులు ఉండటంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. సంకు రమణతో పాటు అతనికి సహకరించిన కూకట్‌పల్లికి చెందిన కిరణ్(40), రాజేష్(32), వాసు(32), రవి(33)లతో పాటు ప్రధాన నిందితుడి భార్య జానకి అలియాస్ ధనలక్ష్మి(29), మధు(30), రాము(29)లపై కోర్టు ద్వారా ఐపీసీ 420, 313, 376, 506, రెడ్‌విత్-34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామన్నారు. బాధితురాలు శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు విచ్చేశారు. మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. ఆమె నుంచి సీఐ వివరాలు సేకరించి గచ్చిబౌలిలోని మహిళా పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. సీఐ సునీత బాధితురాలి నుంచి మరిన్ని వివరాలను సేకరించారు. దాదాపు ఏడాదిపాటు సహజీవనం చేసి మోసగించినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం.