
గచ్చిబౌలి: హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన ఓ యువకుడు బయట తిరుగుతుండటంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. కూకట్‌పల్లిలో నివాసం ఉండే ఓ యువకుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఈ నెల 19న హైదరాబాద్‌కు వచ్చాడు. విమానాశ్రయంలో పరీక్షలు చేసి నెగెటివ్ రావడంతో ఇంట్లో హోం క్వారంటైన్ ఉండాలని సూచించారు. మంగళవారం సైబర్‌టవర్ జంక్షన్ లో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో యువకుడు ఉన్నాడు. తల్లితో పాటు వెళ్తుండగా ఆపిన పోలీసులు మీరు ఎక్కడ ఉంటారని ఆరా తీశారు. మార్చి 19న ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు తెలిపాడు. హోం క్వారంటైన్ ఉండాల్సి ఉండగా బయటకు ఎందుకు వచ్చారని పోలీసులు ప్రశ్నించారు. యువకునిపై ఐపీసీ 188, 269, రిలవెంట్ ప్రివిజన్ ఆఫ్ ది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 కింద కేసు నమోదు చేశారు. తల్లి, కొడుకులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. సదరు యువకుడు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు.
ఇద్దరు లాక్‌డౌన్ ఉల్లంఘనులకు జైలుశిక్ష
యాకుత్‌పురా: లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించిన ఇద్దరు యువకులకు నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా ఆయన వారికి 14 రోజులపాటు జైలుశిక్ష విధించారు. మీర్‌చౌక్‌కు చెందిన ఖాజా ఫహీముల్లా, యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ షకీల్‌లు పాతబస్తీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కోవిడ్–19 వైరస్ పట్ల దుష్ప్రచారం చేస్తున్నారు. సోమవారం రాత్రి కోట్ల అలీజా వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఈ ఇద్దరు యువకులను పోలీసులు ఆపి ప్రశ్నించగా...వారు సరైన సమాధానం ఇవ్వలేదు. నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కోవిడ్–19పై దుష్ప్రచారం చేస్తున్న యువకులిద్దర్నీ పోలీసులు అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా...14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు మీర్‌చౌక్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment