Madhira assembly constituency
-
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
సాక్షి, ఖమ్మం: మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నరసయ్య (87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తన స్వగ్రామం కల్లూరు మండలం పోచారంలో తుదిశ్వాస విడిచారు. మధిర శాసనసభ స్థానానికి రెండుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 2009 శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి... మరో నెలలో గడువు ముగుస్తుందనగా రాజీనామా చేశారు. చనిపోయేంత వరకు పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి పనిచేశారు. వెంకట నరసయ్య మృతి పట్ల పలువురు సీపీఎం జిల్లా నాయకులు, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
మధిర మెచ్చేదెవరినో?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలకు పెట్టనికోట.. విశిష్ట రాజకీయాలకు పెట్టింది పేరు.. పాగా వేసేందుకు తహతహలాడుతున్న పార్టీలు.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రచారం చేయగా.. నియోజకవర్గ ప్రజలు ఎవరిని మెచ్చుకుంటారనేది ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్ పార్టీ ఈసారి మధిర నియోజకవర్గంలో విజయం సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఇక్కడ విజయం సాధించేందుకు సర్వశక్తులొడ్డుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ అభ్యర్థిగా లింగాల కమల్‌రాజ్ బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు 2014 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే భట్టి విక్రమార్క అప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయగా.. కమల్‌రాజ్ వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం తరఫున పోటీ చేశారు. అనంతరం జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఆయన తొలుత వైఎస్సార్ సీపీలో చేరగా.. ఆ తర్వాత ఆయనతోపాటు టీఆర్ఎస్ గూటికి చేరారు. కమ్యూనిస్టు పార్టీలో విద్యార్థి దశ నుంచి పనిచేయడం.. ఎంపీపీగా పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతోపాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తిస్థాయి అండదండలు.. టీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలు తనను విజయ తీరానికి చేరుస్తాయని కమల్‌రాజ్ విశ్వసిస్తున్నారు. ఇక టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర రాజకీయాల్లో తనవంతు కీలక పాత్రను పోషిస్తూనే మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌తోపాటు ఎంపీ పొంగులేటి పూర్తిగా మధిర నియోజకవర్గంపై దృష్టి సారించి.. పల్లె నిద్రలు చేయడం.. ఇంటింటి ప్రచారానికి సైతం నడుం బిగించడం పార్టీ విజయానికి దోహదపడుతుందని టీఆర్ఎస్ భావిస్తుండగా.. కాంగ్రెస్‌కు గల సంప్రదాయ ఓటు బ్యాంకు, విక్రమార్కకు నియోజకవర్గ ప్రజలతో ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రజాకూటమి ద్వారా టీడీపీ, సీపీలు భాగస్వామ్యం కావడంతో తమకు నియోజకవర్గంలో అదనపు బలం లభించినట్లయిందని భావిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు భట్టి విజయం సాధించడానికి ఈ అంశాలు దోహదపడతాయని భావిస్తున్నారు. మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శలు.. ఇదే నియోజకవర్గం నుంచి సీపీఎం మద్దతుతో బీఎల్పీ అభ్యర్థిగా డాక్టర్ కోటా రాంబాబు, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కత్తుల శ్యామలరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థుల అభ్యర్థిత్వం దాదాపు రెండు నెలల ముందే ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన అనేకమార్లు నిర్వహించే అవకాశం లభించింది. మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పార పడుతూ.. ప్రజాకూటమి విజయం సాధిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని.. ప్రజా సమస్యలు తీరుతాయని, కేసీఆర్ పాలనలో చేసిందేమీ లేదని.. ఆడంబరాలతో ప్రజలను మభ్య పెట్టారని విమర్శనాస్త్రాలు సంధించారు. భట్టి, పొంగులేటి మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం, విమర్శలు, ప్రతివిమర్శల హోరు కొనసాగింది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌తోపాటు ఆయన గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న ఎంపీ పొంగులేటి సైతం ఎన్నికల ప్రచారంలో వాడీవేడిగా విమర్శనాస్త్రాలను సంధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి, ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసిన తీరును ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ బలాబలాలను వివరిస్తూనే.. ప్రత్యర్థి పార్టీల బలహీనతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. లింగాల కమల్‌రాజ్ విజయం కోసం సీఎం కేసీఆర్ మధిరలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించగా.. మల్లు భట్టి విక్రమార్క విజయం కోసం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్ రెండు పర్యాయాలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే ఖమ్మంలో జరిగిన రాహుల్, చంద్రబాబు సభల్లో సైతం భట్టి విజయాన్ని అగ్రనేతలు కాంక్షించారు. నియోజకవర్గంలోని ముదిగొండ, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, మధిర మండలాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు.. తమకు లభించిన ఆదరణకు అనుగుణంగా విజయం తమదంటే తమదని విశ్వసిస్తున్నారు. -
నమ్మిన వారికి టీఆర్ఎస్ అండగా ఉంటుంది
సాక్షి, మధిర: రాయపట్నం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 40 కుటుంబాల వారు ఆదివారం టీఆర్ఎస్లోకి చేరారు. వారికి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. దూళిపాళ్ల వీరయ్యచౌదరి, జానీ, మస్తాన్, సైదులు, తేళ్ల మోహన్‌రావు, నర్సింహారావు, ఎడ్ల పూర్ణయ్య, రాయల సాంబయ్య తదితరులు టీఆర్ఎస్లోకి చేరారు. తేళ్ల కొండ, తేళ్ల వాసు, దూళిపాళ్ల వీరయ్యచౌదరి ఆధ్వర్యంలో ఎంపీ పొంగులేటికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య, కోలాట నృత్యాలతో పొంగులేటిని ఘనంగా గ్రామంలోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటిని భారీ గజమాలతో సన్మానించారు. ఆ తరువాత గ్రామంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీని నమ్మినవారికి ఎప్పుడూ అన్యాయం జరగదని, ప్రతిఒక్కరికీ తాను అండగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని, కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశానని తెలిపారు. డప్పు వాయిద్యాలతో, మేళతాళాలతో రాయపట్నం గ్రామప్రజలు ఎంపీ పొంగులేటికి బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతుసమన్వయ సమితి అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, చీదిరాల వెంకటేశ్వర్లు, కోనా జగదీష్, ఈదర సుబ్బారావు, కనుమూరి వెంకటేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, అలివేలు ఉమామహేశ్వరరెడ్డి, చావలి రామరాజు, కట్టా గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
అక్రమ పొత్తులతో ‘కూటమి’
సాక్షి, మధిర: మధిరలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న లింగాల కమల్రాజ్దే గెలుపని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్కూరు, రాయపట్నం, దేశినేనిపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ... కాంగ్రెస్, టీడీపీ అక్రమ పొత్తు పెట్టుకొని మాయకూటమిగా ఏర్పడి ప్రజలను మాయ చేసేందుకే ముందుకు వస్తున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలన్నారు. దేశమంగా గర్వించే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా.. మధిర గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. మధిర నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, విషప్రచారాలు నమ్మే ప్రజలు కారని అన్నారు. నిత్యం అందుబాటులో ఉండే కమల్‌రాజ్‌ను పార్టీలకు అతీతంగా ఆదరిస్తూ కారు గుర్తుపై ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, నాయకులు మేకల లక్ష్మి, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, ఇక్బాల్, భోగ్యం ఇందిర, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యన్నం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తాలు... -
ప్రచారంలో ఎదురుపడి..
సాక్షి, మధిర: మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూటమి(కాంగ్రెస్) తరఫున మల్లు భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ నుంచి లింగాల కమల్‌రాజ్ ప్రధా న పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మధిర నగరపంచాయతీ పరిధిలోని 17వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కమల్‌రాజ్‌తోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. అదే సమయంలో, అదే వార్డు లో కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి భట్టి తనయుడు మల్లు సూర్యవిక్రమాదిత్య ను వెంటబెట్టుకుని ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువర్గాల వాహనాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎదురైన వాహనాలు తప్పుకునేటప్పుడు, కార్యకర్తలు ఒకే చోటకు చేరినప్పుడు ఏమైనా వివాదం జరుగుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. అయితే ఎవరికివారే ప్రశాతంగా ప్రచా రం నిర్వహించుకున్నారు. -
హామీలపై వివరణలు సంతృప్తికరంగా లేవు: భన్వర్‌లాల్
పార్టీల మేనిఫెస్టోలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక: భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్న హామీలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. తెలుగుదేశం, లోక్‌సత్తా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వివరణలు కోరామని, అయితే వాటి నుంచి వచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవన్నారు. రుణాల మాఫీ పట్ల కొన్ని పార్టీలు వివరణ సంతృప్తిగా లేదని భావించి, తదుపరి చర్యలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించినట్లు చెప్పారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక వచ్చిందన్నారు. ఆరోపణలు రుజువైతే చర్యల నిమిత్తం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని చెప్పారు. లెజెండ్ సినిమా డీవీడీ అందిన తరువాత సంబంధిత కమిటీ పరిశీలిస్తుందని వివరించారు. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి ఫ్యాను గుర్తు కేటాయించడంపై మాట్లాడుతూ, ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తు ఇచ్చిన తరువాత స్వతంత్ర అభ్యర్థికి మళ్లీ అదే గుర్తును రిటర్నింగ్ అధికారి ఏవిధంగా కేటాయించారో తెలియదని, ఈ నేపథ్యంలో ఈసీకి నివేదిక పంపుతామని భన్వర్‌లాల్ తెలిపారు. -
పోరుగడ్డ మధిర
మధిర, న్యూస్‌లైన్: పోరాటాల పురిటిగడ్డ మధిర అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. నాటి నుంచి 2009 ఎన్నికల వరకు మధిర నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా 14 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ ఒకసారి, కాంగ్రెస్ ఏడు సార్లు, సీపీఎం ఐదు సార్లు, టీడీపీ ఒకసారి గెలుపొందాయి. 1952లో తొలిసారి నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 55,400 ఓట్లు ఉండేవి. 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు బొమ్మకంటి సత్యన్నారాయణరావు, తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ పార్టీకి చెందిన ఎస్పీ రావుపై 2,587 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962 నాటికి నియోజకవర్గ ఓట్లు 61,466కు చేరాయి. ఆ ఎన్నికల్లో 49,792 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య స్వతంత్ర అభ్యర్థి ఆర్. శంకరయ్యపై 5,456 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 నాటికి 76,526 ఓట్లు ఉండగా 61,736 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గినేని వెంకయ్య, సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై 10,404 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నియోజకవర్గంలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, సీపీఎం మధ్యనే సాగుతుండేది. ఈ సారి కూడా అదేపునరావృతం కావచ్చని విశ్లేషకుల అంచనా. నియోజకవర్గం నుంచి శీలం సిద్దారెడ్డి, బోడేపూడి వెంకటేశ్వరరావు వంటి నేతలు ఘనతికెక్కారు. శీలం సిద్దారెడ్డి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా, బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఎం శాసనసభ పక్ష నేతగా పలుమార్లు పనిచేశారు. నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థుల వివరాలు... 1972లో దుగ్గినేని వెంకట్రావమ్మ సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. 1978లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి బండారు ప్రసాదరావు జనతాపార్టీకి చెందిన మద్దినేని నర్సింహారావుపై గెలిచారు. 1983లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన శీలం సిద్దారెడ్డి సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. 1985లో సీపీఎం అభ్యర్థి బోడేపూడి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై గెలుపొందారు. 1989లో బోడేపూడి వెంకటేశ్వరరావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై విజయం సాధించారు. 1994లో బోడేపూడి వెంకటేశ్వరరావు శీలం సిద్దారెడ్డిపై గెలుపొందారు. శాసన సభ్యునిగా కొనసాగుతూ బోడేపూడి అకాలమృతి చెందారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్య తన సమీప అభ్యర్థి శీలం సిద్దారెడ్డిపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ తొలిసారిగా మధిర నియోజకవర్గం నుంచి తన అభ్యర్థిని బరిలో నిలిపింది. 1999 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్యపై టీడీపీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అప్పట్లో ఎమ్మార్పీఎస్ కూడా పోటీలో ఉంది. 2004 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి కట్టా వెంకటనర్సయ్య టీడీపీ అభ్యర్థి కొండబాల కోటేశ్వరరావుపై 21,443 ఓట్లతో విజయం సాధించారు. అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ మద్దతుతో, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిష్మాతో కట్టా వెంకటనర్సయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ కూడా పోటీచేశారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గంలో 1,83,475 ఓట్లు ఉండగా 1,60,002 ఓట్లు పోలయ్యాయి. మధిర నియోజకవర్గ ఎన్నికల చరిత్రలోనే 86.93 శాతం పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. అత్యధిక ఓట్ల నమోదులో రాష్ట్రంలో రెండోస్థానంలో నియోజకవర్గం నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లోనూ రాజశేఖరరెడ్డి చరిష్మా బాగా పనిచేసింది. కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క విజయానికి దోహదపడింది. తన సమీప సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై భట్టి 1417ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న జరగబోయే మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక రసవత్తరం గా మారనుంది. గత ఎన్నికల్లో విడిగా పోటీచేసి దాదాపు 15వేల ఓట్లు సాధించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. నూతనంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో బలీయమైన శక్తిగా ఎదిగింది. వైఎస్ఆర్సీపీ, సీపీఎం పొత్తుతో మరోసారి సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నా రు. కాంగ్రెస్, సీపీఐతో జట్టుకట్టింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క మరో పరీక్షకు సిద్ధమయ్యారు. తొలిసారి టీఆర్ఎస్ అభ్యర్థి బొమ్మెర రామ్మూర్తి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పోటీలో ఉన్నారు. గతంలోని రాజకీయ సమీకరణాలకు, నేటి సమీకరణాలకు పూర్తి తేడా కనిపిస్తోంది. దాదాపు పోటీ సీపీఎం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ కూటమి మధ్యే ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2008-09 పునర్విభజనకు ముందు మధిర నియోజకవర్గంలో మధిర, ఎర్రుపాలెం, బోనకల్, వైరా, తల్లాడ మండలాలు ఉండేవి. పునర్విభజన తర్వాత మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌కు తోడు చింతకాని, ముదిగొండ మండలాలు వచ్చి చేరాయి. వైరా ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడగా, తల్లాడ సత్తుపల్లి నియోజకవర్గంలో కలిసిపోయింది.